నాన్‌వెజ్‌... పచ్చడి కావాల్సిందే!

ABN , First Publish Date - 2020-02-08T06:08:47+05:30 IST

నాన్‌వెజ్‌ ప్రియులను పచ్చళ్లు తినమంటే పెదవి విరుస్తారు. అదే నాన్‌వెజ్‌ను పచ్చడి చేస్తే... నోట్లో నీళ్లు ఊరక మానదు. నాన్‌వెజ్‌ కూరలు...

నాన్‌వెజ్‌... పచ్చడి కావాల్సిందే!

నాన్‌వెజ్‌ ప్రియులను పచ్చళ్లు తినమంటే పెదవి విరుస్తారు. అదే నాన్‌వెజ్‌ను పచ్చడి చేస్తే... నోట్లో నీళ్లు ఊరక మానదు. నాన్‌వెజ్‌ కూరలు, వేపుళ్లు, టిక్కాలు, కబాబ్‌లు... ఇలా ఎన్ని ఉన్నా, వాటితో చేసే పచ్చళ్ల రుచి పసందుగా ఉంటుందనడంలో సందేహం లేదు. చికెన్‌, మటన్‌, చేపలు, రొయ్యలు... వీటన్నింటితో కూడా మామిడి, నిమ్మ, ఉసిరి ఊరగాయాల్లాగే చేయొచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ పచ్చళ్లను అందరూ ఇష్టపడుతున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో రేటు ఎక్కువగా ఉండే ఈ నాన్‌వెజ్‌ పచ్చళ్లను ఎంచక్కా ఇంట్లోనే తయారుచేసుకొని ఇంటిల్లిపాది ఆస్వాదించొచ్చు.


చేపలతో...

కావలసినవి

చేపలు - అరకేజీ, పసుపు - చిటికెడు, నువ్వుల నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా.

మసాలా కోసం : ఎండుమిర్చి - 50గ్రాములు, పసుపు - పావుటీస్పూన్‌, జీలకర్ర - ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుద్రాక్ష - 100గ్రాములు, గసగసాలు - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - నాలుగైదు, చింతపండు - కొద్దిగా, పంచదార - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ

  • ముందుగా చేపలను కట్‌ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
  • తరువాత చేప ముక్కలకు పసుపు, ఉప్పు పట్టించాలి. 
  • పాన్‌లో నూనె వేసి ఆ చేప ముక్కలు వేసి వేగించాలి.
  • మిక్సీలో ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఎండుద్రాక్ష, గసగసాలు వేసి మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి.
  • చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి చింతపండు నానబెట్టాలి.
  • అల్లం వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి.
  • పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. 
  • కాసేపు వేగిన తరువాత మసాలా పేస్టు వేసి కలపాలి. 
  • ఇప్పుడు చింతపండు నీళ్లు పోసి, ఉప్పు, పంచదార వేసి కాసేపు ఉడికించాలి.
  • పచ్చిమిర్చి, ఆవాలు వేయాలి. చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి.
  • ఇప్పుడు వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలపి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

రొయ్యలతో...

కావలసినవి

రొయ్యలు(చిన్నవి) - పావుకేజీ, ఉప్పు - తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - సరిపడా, అల్లం వెల్లుల్లి - 120 గ్రాములు, పచ్చిమిర్చి - ఇరవై, వెనిగర్‌ - అరకప్పు.

తయారీ

  • ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకొని ఉప్పు, పసుపు పట్టించి అరగంటపాటు పక్కన పెట్టాలి.
  • పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక రొయ్యలు వేసి వేగించాలి. 
  • కారం వేసి చిన్నమంటపై ఐదు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.
  • మరొకపాన్‌లో నూనె వేసి అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి.
  • పచ్చిమిర్చి కూడా వేసి మరికాసేపు వేగనివ్వాలి. 
  • తరువాత రొయ్యలు, వెనిగర్‌, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. 
  • వెనిగర్‌ ఒకేసారి మొత్తం వేయకుండా ముందుగా పావు కప్పు వేయాలి. ఒకవేళ అవసరమనుకుంటే మరికాస్త వేయాలి.
  • చిన్నమంటపై ఐదు నిమిషాల ఉడికించాలి. 
  • రొయ్యల ఉడికిన తరువాత నూనె పైకి తేలుతుంది. 
  • ఇప్పుడు స్టవ్‌ ఆర్పేసి, దించాలి. చల్లారిన తరువాత జాడీలో భద్రపరచుకోవాలి.
  • ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలరోజుల పాటు పాడవకుండా ఉంటుంది.

మటన్‌తో...

కావలసినవి 

బోన్‌లెస్‌ మటన్‌ - అరకేజీ, ఉప్పు - తగినంత, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - అరకప్పు, మెంతులు - అర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, ధనియాలు - అర టీస్పూన్‌, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, నూనె - సరిపడా, నిమ్మరసం - పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు.


తయారీ

  • ముందుగా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేగించుకుని, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  • మటన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
  • ఒకపాత్రలో మటన్‌ వేసి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, అర కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. 
  • నీళ్లు పూర్తిగా పోయే వరకు ఉడికించాలి.
  • తరువాత అందులోనే కొద్దిగా నూనె వేసి మటన్‌ ముక్కలు ఫ్రై కానివ్వాలి.
  • కారం వేసి కలపాలి. పొడి చేసి పెట్టుకున్న మసాలా వేయాలి.
  • నిమ్మరసం వేసి మరికాసేపు ఉడికించాలి. 
  • నూనె తేలే వరకు ఉడికించి దించాలి. 
  • మటన్‌ పచ్చడి అన్నం, చపాతీలోకి రుచిగా ఉంటుంది.


Updated Date - 2020-02-08T06:08:47+05:30 IST