వేదికపై కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ

ABN , First Publish Date - 2021-10-25T00:48:39+05:30 IST

ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. వేదికపైనే కార్యకర్తలు బాహాబాహీకి..

వేదికపై కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. వేదికపైనే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. జష్‌పూర్‌లో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. జిల్లా మాజీ అధ్యక్షుడు పవన్ అగర్వాల్‌ మాట్లాడుతుండగా ఆయన నుంచి మైక్ లాక్కోవడంతో ఆయన మద్దతుదారులు వేదికపైకి దూసుకువచ్చారు. దీంతో ఘర్షణ తలెత్తింది.


సంఘటన వివరాల ప్రకారం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్‌ గురించి పవన్ అగర్వాల్ మాట్లాడటం మొదలుపెట్టగానే కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇఫ్తికర్ హసన్ ఒక్కసారిగా స్టేజ్‌పై వచ్చి ఆయన నుంచి మైక్ లాక్కున్నారు. అగర్వాల్‌ను ముందుకు నెట్టారు. దీంతో డజనుకు పైగా కార్యకర్తలు, నేతలు స్టేజ్‌పైకి చేరి ఆ చర్యను ప్రతిఘటించారు. కాగా, ఈ ఘటన అనంతరం పవన్ అగర్వాల్ మాట్లాడుతూ, టీఎస్ సింగ్ దేవ్, ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు దేవ్ కోసం బఘెల్ తన పదవిని వదులుకోవాలని అన్నారు. రెండున్నరేళ్ల పాటు తన వంతు కోసం దేవ్ వేచిచూశారని, దేవ్, బఘెల్ కలిసి పనిచేయకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేది కాదని అన్నారు. ఇదే విషయాన్ని తాను చెప్పే ప్రయత్నం చేస్తుండగా తనపై కున్‌కురి ఎమ్మెల్యే దాడికి దిగారని చెప్పారు.


కాగా, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ఇటీవల తలెత్తిన నాయకత్వ సంక్షోభం పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్లింది. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల సీఎం పదవిని టీఎస్ సింగ్ ఆశిస్తుండగా, అందుకు బఘెల్ నిరాకరిస్తున్నారు. గత నెలలో రాహుల్ గాంధీ ఈ ఇద్దరు నేతలతో విడివిడిగా సమావేశమై తాత్కాలికంగా సమస్యను సద్దుమణిగేలా చేశారు.

Updated Date - 2021-10-25T00:48:39+05:30 IST