కరోనా పరిహారం పేరుతో మోసం

ABN , First Publish Date - 2022-05-21T06:46:40+05:30 IST

‘ప్రభుత్వం నుంచి కరోనా పరిహారం మంజూరైంది. బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌ పే నంబరు ఇస్తే...ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తాం’ అంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌లు చేస్తున్నాడు.

కరోనా పరిహారం పేరుతో మోసం

మృతుల కుటుంబాలకు అపరిచిత వ్యక్తి ఫోన్‌ 

కలెక్టరేట్‌ నుంచి మాట్లాడుతున్నానని బిల్డప్‌

సొమ్మును బ్యాంకు ఖాతాలో వేస్తామని వివరాల సేకరణ

కొద్దిసేపట్లో అకౌంట్లు ఖాళీ 

లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

అంతకుముందు ఏఎన్‌ఎంకు ఫోన్‌ చేసి మృతులపై ఆరా


విశాఖపట్నం, మాడుగుల రూరల్‌, మే 20: 

‘ప్రభుత్వం నుంచి కరోనా పరిహారం మంజూరైంది.  బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌ పే నంబరు ఇస్తే...ఆన్‌లైన్‌లో డబ్బులు పంపిస్తాం’ అంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌లు చేస్తున్నాడు. అతడికి వివరాలు చెప్పిన ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి క్షణాల్లో రూ.90 కాజేశాడు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో వెలుగుచూసిన ఈ మోసానికి సంబంధించిన వివరాలు...

మండలంలోని సాగరం సచివాలయం ఏఎన్‌ఎం వాలంకి కొండమ్మకు గురువారం ఉదయం పది గంటల సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేశాడు. ‘మీ పరిధిలో ఎంతమంది కరోనాతో చనిపోయారు?...వారి పేరు, భార్య లేదా భర్త, చనిపోయిన తేదీ, ఫోన్‌ నంబరు అడిగాడు. అందుకు కొంత సమయం కావాలని ఆమె చెప్పగా...కలెక్టరేట్‌ నుంచి ఫోన్‌ చేస్తే అంత నిర్లక్ష్యమా అంటూ గద్దించాడు. దీంతో ఆమె కరోనాతో చనిపోయిన పలువురి వివరాలను అతడికి ఇచ్చింది. ఆ జాబితాలో వాడపాడు గ్రామానికి చెందిన యన్నంశెట్టి రాజుబాబు, డి.గొటివాడకు చెందిన గెమ్మిలి జగన్నాథరావు ఉన్నారు. కొద్దిసేపటికి యన్నంశెట్టి రాజుబాబు కుమారుడు ప్రసాద్‌కు అదే అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నాను. మీ నాన్న రాజుబాబు కరోనాతో చనిపోయారు కదా...ఆయనకు రూ.50 వేల నష్టపరిహారం వచ్చింది. ఆ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటే ఖాతాలో కనీసం రూ.10 వేలు బ్యాలెన్స్‌ ఉండాలి’’ అని చెప్పాడు. దీంతో ప్రసాద్‌ తన ఖాతాలో రూ.7 వేలు ఉన్నాయని, మిగిలిన రూ.3 వేలు వేస్తానని బదులిచ్చాడు. అలా కుదరదని వేరే ఎవరిదైనా బ్యాంకు అకౌంట్‌ నంబరు ఇవ్వాలని, అందులో జమ చేస్తానని నమ్మబలికాడు. దీంతో ప్రసాద్‌ తన బావ బ్యాంకు ఖాతా వివరాలతోపాటు ఫోన్‌పే నంబర్‌ కూడా ఇచ్చాడు. ఆ తరువాత మరికొంత సమాచారం అడిగి తీసుకున్నాడు. అంతే ప్రసాద్‌ బావ అకౌంట్‌ నుంచి పది నిమిషాల్లో రూ.50 వేలు, తర్వాత రూ.20 వేలు మొత్తం రూ.70 వేలు డ్రా చేసినట్టు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ప్రసాద్‌ జరిగిన విషయాన్ని ఏఎన్‌ఎం కొండమ్మ దృష్టికి తీసుకువెళ్లాడు. 

ఇదిలావుండగా ఇదే వ్యక్తి డి.గొటివాడకు చెందిన గెమ్మెలి అరుణకుమారికి ఫోన్‌ చేసి...మీ భర్త జగన్నాథరావు కరోనాతో చనిపోయినందున ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరైందని చెప్పాడు. యన్నంశెట్టి ప్రసాద్‌కు చెప్పినట్టే బ్యాంకు ఖాతాలో కనీసం రూ.10 వేలు వుండాలని ఆమెకు కూడా చెప్పాడు. తన ఖాతాలో డబ్బులు లేకపోవడంతో తెలిసిన ఇద్దరి వ్యక్తుల బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌ పే నంబరు ఇచ్చింది. కొద్దిసేపటి తరువాత ఆ ఇద్దరి ఖాతాల నుంచి రూ.10 వేల చొప్పున డ్రా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అరుణకుమారి...సచివాలయ ఏఎన్‌ఎం కొండమ్మను ప్రశ్నించింది. దీంతో కరోనా పరిహారం పేరుతో మోసపోయామని గుర్తించి బాధితులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-21T06:46:40+05:30 IST