‘చెత్త’ర్వులు

ABN , First Publish Date - 2022-08-07T06:14:08+05:30 IST

‘చెత్త’ర్వులు

‘చెత్త’ర్వులు

విజయవాడ కార్పొరేషన్‌లో వింత ఉత్తర్వులు

చెత్త పన్ను కడితేనే ప్రజారోగ్య సిబ్బందికి జీతాలట..!

వీఎంసీ అధికారుల చెత్త నిర్ణయం

ఆగస్టు వరకు రశీదులు చూపాల్సిందే

అప్పుడే వేతనం చేతికందేది


చెత్త పన్ను చెల్లించకపోతే ఉద్యోగులు, కార్మికుల జీతాలు నిలిపేస్తారట.. పన్ను రశీదులు చూపిస్తేనే ఆగస్టు నెల జీతాలు విడుదల చేస్తారట.. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు విడుదల చేసిన ఈ ఉత్తర్వులు వినడానికి వింతగానే ఉన్నా వీఎంసీ సిబ్బందిని మాత్రం ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. 


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఈనెల 5వ తేదీన ‘అతి జరూరు’ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఆగమేఘాలపై అమల్లోకి తెచ్చారు. అంతలా హడావుడి చేసిన ఆ ఉత్తర్వుల్లోని సారాంశం చూసి ఉద్యోగులు నివ్వెరపోయారు. వీఎంసీ ప్రజారోగ్య విభాగంలో పనిచేసే పర్మినెంట్‌ ఉద్యోగులు మొదలు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, వర్కర్లు, మేస్త్రీలు, ఇతర పారిశుధ్య సిబ్బంది, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్‌, శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్లు తప్పనిసరిగా చెత్తపన్ను చెల్లించాలని, రశీదుల వివరాలను సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమర్పించాలని, అప్పుడే ఆగస్టు వేతనాలు చెల్లిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెత్తపన్ను వసూలుపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీఎంసీ అధికారులు జారీచేసిన ఈ ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. 

ఇదేం చోద్యం..

చెత్తపన్ను చెల్లించకపోతే జీతాలు ఆపేస్తామని ప్రకటించడం ద్వారా కార్మిక చట్టాలను ప్రభుత్వమే ఉల్లంఘించినట్లు అవుతుందని వామపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుధ్య సిబ్బందికి చెత్తపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాల్సింది పోయి, వేతనాలకు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ లేదు. కానీ, వీఎంసీ అధికారులు ఏ ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు ఇచ్చారో వారికే తెలియాలి.

ఎలా సాధ్యం..?

చెత్తపన్ను చెల్లించాలని ఎవరికీ నోటీసులు ఇవ్వట్లేదు. పైగా కట్టిన వారికి రశీదులూ ఇవ్వట్లేదు. ప్రభుత్వం వసూలు చేస్తున్నది పన్నా.. లేక యూజర్‌ చార్జీయా.. అనే స్పష్టత కూడా లేదు. ప్రజల అభ్యంతరాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా యూజర్‌ చార్జీలు వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండదని మున్సిపల్‌ అధికారులే చెబుతున్నారు. మరోవైపు స్వచ్ఛ భారత్‌, క్లీన్‌ ఏపీ (క్లాప్‌) పేరు చెప్పి చెత్త సేకరణకు కొనుగోలు చేసిన వాహనాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు ఉన్నాయి. వాహనాల కాంట్రాక్టును బడా కంపెనీకి కట్టబెట్టారని, ప్రతి వాహనానికీ నెలకు రూ.62 వేలు చెల్లిస్తున్నారని, బడా కంపెనీల జేబులు నింపటానికి చెత్తపన్నును ప్రజలపై రుద్దారన్న వాదన కూడా ఉంది. ఇప్పటికే ఓవైపు వృద్ధులు, వితంతువులు, వికలాంగులను బెదిరించి వారి పింఛనులోనే చెత్తపన్ను మొత్తాన్ని కోత పెడుతున్నారు. ఇప్పుడు జీతం నిలిపివేస్తామని ఉద్యోగులు, కార్మికులను బెదిరిస్తున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరికీ ఇదే విధానాన్ని అమలు చేస్తారన్న ఆందోళన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 


రాజ్యాంగ విరుద్ధం

చెత్తపన్ను వసూలు చేయటమే రాజ్యాంగ విరుద్ధం. పారిశుధ్య కార్మికులకు లక్ష రూపాయలు జీతం ఇచ్చినా తక్కువేనంటూ సీఎం జగన్‌ కార్మికులపై ప్రేమ ఒలకబోశారు. ఇప్పుడు చెత్తపన్ను భారాన్ని మోపుతున్నారు. ప్రజలను భయభ్రాంతులను చేసి పన్నులు వసూలు చేయటం నిరంకుశత్వం కాదా..? ఈ అమానుష చర్యలకు సీఎం బాధ్యత వహించాలి. నగరపాలక సంస్థ అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే ఉద్యమిస్తాం. - సీహెచ్‌ బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు


త్వరలో ఉద్యోగులందరికీ..

ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.30 నుంచి రూ.120, చిన్న, మధ్య తరగతి వ్యాపారుల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.15 వేల వరకూ చెత్తపన్ను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అనే కనికరం లేకుండా పింఛన్లలోనూ కోత పెట్టి చెత్తపన్ను జమ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీఎంసీ ఉద్యోగుల వంతు వచ్చింది. త్వరలో రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఇదే రూల్‌ పెడతారు. - ముమ్మనేని ప్రసాద్‌, టీడీపీ కార్పొరేటర్‌






మేయరమ్మ.. వింత ఉత్తర్వులు

ఆమెకు చెప్పే.. కౌన్సిల్‌లో ప్రతిపాదనలు చేయాలట..!

విపక్షంతో పాటు స్వపక్ష కార్పొరేటర్ల నుంచి వ్యతిరేకత

రెండు రోజులకే ఉత్తర్వులు వెనక్కి..

మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి వింత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై సొంత పార్టీ కార్పొరేటర్ల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడంతో రెండు రోజులకే వెనక్కి తగ్గారు. సాధారణంగా కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో కార్పొరేటర్లు ఏమైనా ప్రతిపాదనలు చేయాలంటే నేరుగా సంబంధిత అధికారులకు పంపుతారు. వాటిని అజెండాలో చేర్చి కౌన్సిల్‌లో చర్చ జరుపుతారు. ప్రజాస్వామ్య విధానంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది. అందుకు భిన్నంగా కార్పొరేటర్లు ఎవరైనా కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదనలు పెట్టాలంటే ముందుగా తన ఆమోదం తీసుకోవాలని మేయర్‌ భాగ్యలక్ష్మి ఈనెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ విధానం నియంతృత్వంలో తప్ప ఎక్కడా ఉండదని విపక్ష కార్పొరేటర్లు మండిపడ్డారు. మేయర్‌ తీరుపై సొంత పార్టీ కార్పొరేటర్లు సైతం కత్తులు దూశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. కంగుతిన్న మేయర్‌ హడావుడిగా ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు.

Updated Date - 2022-08-07T06:14:08+05:30 IST