Welcome to the Olympiad Jyoti: కోవైలో ఒలంపియాడ్‌ జ్యోతికి ఘనస్వాగతం

ABN , First Publish Date - 2022-07-26T14:27:37+05:30 IST

పుదుచ్చేరి నుంచి వాణిజ్యనగరమైన కోయంబత్తూరులో సోమవారం ఉదయం ప్రవేశించిన 44వ చెస్‌ ఒలంపియాడ్‌ జ్యోతికి స్థానిక ప్రముఖులు,

Welcome to the Olympiad Jyoti: కోవైలో ఒలంపియాడ్‌ జ్యోతికి ఘనస్వాగతం

చెన్నై, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి నుంచి వాణిజ్యనగరమైన కోయంబత్తూరులో సోమవారం ఉదయం ప్రవేశించిన 44వ చెస్‌ ఒలంపియాడ్‌ జ్యోతికి స్థానిక ప్రముఖులు, విద్యార్థులు, క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతర్జాతీయ చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) సందర్భంగా జూన్‌ 19న ఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్‌స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) ఒలంపిక్‌ జ్యోతి యాత్రను ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన చెస్‌ క్రీడాకారులు ఓపెన్‌టాప్‌ జీప్‌లో ఆ జ్యోతిని ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. ఆ జ్యోతియాత్ర 26 రాష్ట్రాల్లో 75 నగరాలలో కొనసాగి చివరగా చెస్‌ ఒలంపియాడ్‌ జరిగే మహాబలిపురానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పుదుచ్చేరికి చేరుకున్న ఒలంపియాడ్‌ జ్యోతి(Olympiad flame)కి అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి ఎన్‌. రంగసామి తదితర ప్రముఖులు, క్రీడాభిమానులు ఘనస్వాగతం పలికారు. పుదుచ్చేరిలో యాత్ర ముగించుకుని సోమవారం ఉదయం కోయంబత్తూరలో ప్రవేశించిన ఆ జ్యోతికి అపూర్వ స్వాగతం పలికారు. మంగళవాయిద్యాల నడుమ ఆ జ్యోతికి జిల్లా కలెక్టర్‌ సమీరన్‌, కార్పొరేషన్‌ మేయర్‌ కల్పన, కమిషనర్‌ ప్రతాప్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. కోయంబత్తూరు(Coimbatore) రేస్‌కోర్స్‌ ప్రాంతానికి చేరుకున్న ఆ జ్యోతిని కేజీ థియేటర్‌, రెడ్‌క్రాస్‌ సంఘం, అవినాశి రోడ్డు, కొటీసియా మైదానం వరకూ ఊరేగించారు. ఈ ఊరేగింపులో కళాశాలల, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా కోటీసియా మైదానం చేరుకున్న జ్యోతికి సుమారు రెండువేల మంది విద్యార్థులు, స్థానికులు చెస్‌ పావుల బొమ్మల ప్లకార్డ్‌లతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు చెస్‌ క్రీడాకారులు ఓపెన్‌టాప్‌ జీప్‌లో జ్యోతిని పట్టుకుని తిరుప్పూరు బయలుదేరారు. ఈరోడ్‌, సేలం జిల్లాల్లో పర్యటించిన అనంతరం  ఒలంపియాడ్‌ జ్యోతి మహాబలిపురానికి చేరనుంది.


20 డిజిటల్‌ స్కానర్లు...

ఇదిలా ఉండగా చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు జరుగనున్న మహాబలిపురం ఫోర్‌ పాయింట్స్‌ హోటల్‌ ప్రాంగణాల వద్ద క్రీడాకారులను పరీక్షించేందుకు 20 డిజిటల్‌ స్కానర్లను ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా వివిధ దేశాలకు చెందిన చెస్‌ క్రీడాకారులు నగరానికి తరలివస్తుండటం వారికి ముందస్తు కరోనా పరీక్షలు నిర్వహించేలా ఈ స్కానర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. క్రీడాకారుల కోసం ఏసీ బస్సులను కూడా సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో ఆంగ్లం తెలిసిన డ్రైవర్లను కూడా నియమించారు. చెన్నై విమానాశ్రయం(Airport) నుంచి క్రీడాకారులను తీసుకువచ్చే ప్రతి బస్సును చెస్‌ ఒలంపియాడ్‌ ప్రాంగణం ప్రవేశ ద్వారం వద్దే నిలిపి ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్‌ స్కాన్‌ చేయనున్నారు. ఇక సోమవారం కూడా పలువురు విదేశీ చెస్‌ క్రీడాకారులు నగరానికి చేరుకున్నారు. జాంబియా పోలెండ్‌, కజకిస్తాన్‌, ఉగండా, ఐర్లాండ్‌ కేమన్‌ దీవి తదితర దేశాలకు చెందిన 20 మంది క్రీడాకారులు నగరానికి విచ్చేశారు. 



Updated Date - 2022-07-26T14:27:37+05:30 IST