Abn logo
Mar 8 2021 @ 00:30AM

అమ్మాయిలు.. వెనక్కి తగ్గొద్దు

సవాళ్లు ఎదురైనప్పుడే మనలోని శక్తిసామర్థ్యాలు బయటపడతాయి. ధైర్యంగా నిలబడి సంక్షోభం నుంచి గట్టెక్కాలి కానీ.. వెనక్కి తగ్గకూడదు. చెస్‌లోనే కాదు జీవితంలోనూ నేను ఇదే ఆచరిస్తా. చాంపియన్‌ కావాలంటే చాంపియన్‌లానే పోరాడాలంటున్న తెలుగు గ్రాండ్‌మాస్టర్‌.. పద్మశ్రీ ద్రోణవల్లి హారికతో నవ్య ప్రత్యేక ఇంటర్వ్యూ..


ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్‌డే ! మరి మీరు ఎలా జరుపుకోబోతున్నారు?

హో.. థ్యాంక్యూ.. అయితే.. ప్రతీ రోజు మనదే అయినప్పుడు ప్రత్యేకంగా ఒకరోజు ఉమెన్స్‌డే అని జరుపుకోవడం ఎందుకు? (నవ్వుతూ). మగవారే గొప్ప.. ఆడవాళ్లకి ఏమీ తెలియదనే ధోరణి మా ఇంట్లో నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఈ విషయంలో మా నాన్నకి థ్యాంక్స్‌ చెప్పాలి. నేను, అమ్మ చెప్పే మాటలకు నాన్న చాలా విలువిస్తారు. ఇక, నా భర్త (కార్తీక్‌) కూడా అంతే. నేను తీసుకునే నిర్ణయాలన్నింటిని నాన్నలానే తను గౌరవిస్తాడు.. బాసటగా ఉంటాడు.


అమ్మానాన్నల్లో మీపై ఎవరి ప్రభావం ఎక్కువ?

అమ్మ (సవర్ణ) ప్రభావమే ఎక్కువ. నాన్న (రమేష్‌) అయినా కొన్ని సందర్భాల్లో రాజీపడతారేమో కానీ.. అమ్మ మాత్రం ఎక్కడా తగ్గదు. నన్ను కూడా అలానే పెంచింది. నాకులా నువ్వు ఇంటికి పరిమితం కాకూడదు. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను అధిరోహించాలని నిత్యం చెబుతుండేది. ఆమె ఒక సాధారణ గృహిణి అయిన సరే ముందుచూపుతో నన్ను జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కించి గ్రాండ్‌మాస్టర్‌ను చేసింది.


లింగ వివక్ష ఎప్పుడైనా చవిచూశారా?

ఇతర రంగాల్లో లింగ వివక్ష లేదనైతే చెప్పలేను కానీ.. చెస్‌లో అయితే ఇప్పటివరకు అలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య 30-35 మంది మాత్రమే. మన దేశం నుంచి నాతో కలిపి ఇద్దరు జీఎంలే ఉన్నారు. మా మహిళా చెస్‌ కుటుంబం ప్రస్తుతానికి చాలా చిన్నది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప, మిక్స్‌డ్‌ చెస్‌ పోటీల్లో ఆడినప్పుడు నాకైతే అలాంటి భావన ఎప్పుడు కలగలేదు. ఇతర రంగాల్లో పురుషాధిక్య ఆలోచనా ధోరణి వల్ల ఇబ్బందులపాలైన స్త్రీల ఉదంతాలు మనం ఎన్నో చూశాం. అయితే, సమస్య దగ్గరే నిలిచిపోతే పరిష్కారం ఎప్పటికీ లభించదు. సమాజ పరిణామ క్రమంలో జెండర్‌ (లింగ) సమానత్వంపై అందరిలో అవగాహన పెరిగింది. చాలా మంది మగవారు కూడా ఇప్పుడు అన్ని రంగాల్లోని ఆడవారికి దన్నుగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా.


మీ రోల్‌ మోడల్‌ ఎవరు?

జుడిత్‌ పోల్గర్‌. హంగేరి గ్రాండ్‌మాస్టర్‌. చెస్‌లో ఆమె ఒక సంచలనం. ఆమె ఆగమనంతో చెస్‌లో చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు మగవారే ఎక్కువగా ఉండే ఈ క్రీడలో నేడు నాలాంటి వారందరు ముందుకు రావడానికి ఆమె ఒక బాట వేశారు.


ఉమెన్స్‌డే సందర్భంగా మా నవ్య మహిళా పాఠకుల కోసం ఏమైనా ప్రత్యేకంగా చెబుతారా?

మీ శక్తిసామర్థ్యాలపై నమ్మకముంచి మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడండి. ఆ ప్రయత్నంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఇంకా ముందుకెళ్లలేం అనిపిస్తోంది. అమ్మాయిలు.. అప్పుడు అసలు వెనక్కి తగ్గొదు. నేను ఇది సాధించగలనని మనసులో దృఢంగా నిశ్చయించుకుని మీ బలాన్నంత కూడదీసుకొని లక్ష్యం దిశగా సాగండి. జీవితంలో తప్పకుండా విజయవంతమవుతారు. ఒక్క చెస్‌లోనే కాదు.. జీవితంలోనూ నేను ఇదే ఆచరిస్తా. చాంపియన్‌ కావాలంటే చాంపియన్‌లానే పోరాడాలి.

- సంజయ్‌ శంకా


ప్రత్యేకం మరిన్ని...