సిబ్బంది లేరు.. నిధులు రావు

ABN , First Publish Date - 2022-05-07T05:37:57+05:30 IST

చేర్యాలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారన్న సంతోషం ప్రజలకు దక్కకుండా పోయింది. అరకొర వసతులు, అందని సేవలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఆయా విభాగాల పర్యవేక్షణ, సాధారణ పరిపాలనకు సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఇటీవల చేర్యాల అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సిబ్బంది లేరు.. నిధులు రావు
చేర్యాల పట్టణ ప్రధాన రహదారి

చేర్యాల పేరుకే మున్సిపాలిటీ.. సౌకర్యాలు పంచాయతీవే!

వేధిస్తున్న అధికారులు, సిబ్బంది కొరత

ఇన్‌చార్జిలుగా పక్క జిల్లా అధికారులు

పంచాయతీ సిబ్బందితోనే వెల్లదీత

సేవలు అంద క ప్రజలకు ఇక్కట్లు


చేర్యాల, ఏప్రిల్‌ 6 : చేర్యాలను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారన్న సంతోషం ప్రజలకు దక్కకుండా పోయింది. అరకొర వసతులు, అందని సేవలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఆయా విభాగాల పర్యవేక్షణ, సాధారణ పరిపాలనకు సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ఇటీవల చేర్యాల అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ సిబ్బంది కోరతతో పనులు ముందుకు సాగడం లేదు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో 20వేల జనాభా ఉన్నది. నివాస గృహాలు 5,300 ఉండగా 4,100 ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మున్సిపాలిటీ రెవెన్యూ విస్తీర్ణం 11,800 ఎకరాలు కాగా.. ఇందులో పట్టణ విస్తీర్ణం 9,500 ఎకరాలు ఉన్నది. చెరువులు, కుంటల కింద 1,500 ఎకరాల భూమి ఉన్నది. 64 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, ముగ్గురు కంప్యూటర్‌ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. మున్సిపాలిటీ పాలనకు మున్సిపల్‌ కమిషనర్‌ మేనేజర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, బిల్‌ కలెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్స్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, రెవెన్యూ ఆఫీసర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌, టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, అటెండర్‌ పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నది. కానీ బిల్‌ కలెక్టర్‌, మేనేజర్‌ పోస్టులు మాత్రమే మంజూరు చేశారు. ఇందులో బిల్‌కలెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉన్నది. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా పోస్టు మంజూరు కాకపోవడంతో నాలుగేళ్లు కమిషనర్‌ జనరల్‌ఫండ్‌ నుంచే వేతనం తీసుకుంటున్నారు. 


ఇన్‌చార్జిల పాలనతో కుదేలు

మున్సిపల్‌ కమిషనర్‌, మేనేజర్‌ రెగ్యులర్‌ అధికారులు ఉన్నారు. టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, జేఏవోలుగా పొరుగు జిల్లా అధికారులు ఇన్‌చార్జిలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ జనగామలో పనిచేస్తున్నారు. ఇన్‌చార్జిగా రెండు రోజులు వస్తున్నారు. జేఏవో వేములవాడలో పనిచేస్తుండగా.. ఇక్కడికి మూడు రోజులు వస్తున్నారు. కొమురవెల్లి, చేర్యాల మండలాల్లో పంచాయత్‌రాజ్‌ ఏఈగా పనిచేస్తున్న శివకుమార్‌ మున్సిపల్‌ ఏఈగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్‌ అధికారులు ఏకపోవడంతో పర్యవేక్షణ కొరవడి పనులు నిలిచిపోతున్నాయి.


నత్తనడకన ‘భువన్‌’.. కానరాని టాస్క్‌ఫోర్స్‌

సిబ్బంది అంతంతమాత్రంగానే ఉండటంతో పట్టణంలో భవనాల వివరాలు భువన్‌ యాప్‌లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్నది. ఇప్పటికీ వందలాది ఇళ్లుకు నంబర్లు కేటాయించకపోవడంతో మున్సిపల్‌ ఆదాయానికి గండిపడుతున్నది. మున్సిపల్‌ పన్నుల వసూలు కూడా అంతంతమాత్రంగా సాగుతున్నది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు నిర్దేశించిన టాస్క్‌ఫోర్స్‌ జాడ లేకపోవడంతో పట్టణంలో విచ్చలవిడిగా వెంచర్లు, భవన నిర్మాణాలు సాగుతున్నాయి. ఇటీవల పట్టణంలో 50 అనధికారిక వెంచర్లు వెలిశాయి. వీటిలో 4,000 ప్లాట్లకు ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ధువ్రపత్రాలు, ఇంటి నిర్మాణ అనుమతులు తదితర పనులతో కార్యాలయానికి వెళ్తున్న ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.


మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం : రాజేంద్రకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ 

అధికారులు, సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సత్వర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్తిస్థాయి నియామకాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. నిబంధనల మేరకు గృహ నిర్మాణ అనుమతులు జారీచేస్తున్నాం. ఆదాయ వనరుల పెంపుపై దృష్టిసారించడంతో పాటు పట్టణాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.


నియామకాల కోసం ప్రయత్నిస్తున్నాం : స్వరూపారాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ 

పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది నియామకం కోసం మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి విన్నవించాం. పోస్టుల మంజూకు ప్రయత్నిస్తున్నాం. అందుబాటులోఉన్న అధికారులు, సిబ్బందిని సమన్వయపరుస్తూ పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. 

Read more