చెరువులను చెర..పట్టి..

ABN , First Publish Date - 2022-05-17T06:45:15+05:30 IST

చెరువులను చెర..పట్టి..

చెరువులను చెర..పట్టి..
బండిపాలెం, పోచంపల్లి, కొణకంచి మధ్య సాగునీటి చెరువు పరిస్థితి ఇదీ

నీటిని బయటకు పంపి మరీ మట్టి తవ్వకాలు

చేపలు పట్టేసి.. మట్టి కొట్టేసి.. 

ప్రైవేట్‌ వెంచర్లకు అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తరలింపు

అధికారుల మౌనంతో ఇష్టానుసారంగా..


నాడు : జగ్గయ్యపేట మండలం బండిపాలెం, పోచంపల్లి, పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామాల మధ్యలో భారీ సాగునీటి చెరువు ఉంది. ఎప్పటికప్పుడు సాగర్‌ జలాలతో దీనిని నింపుతారు. దీంతో మండు వేసవిలో సైతం నీటితో తొణికిసలాడుతూ ఉండేది. మూడు గ్రామాల రైతులకు సాగునీరు అందించటంతో పాటు వేసవిలో భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడేది.


నేడు :  నిండుకుండలాంటి ఈ చెరువుపై కన్నేశారు అధికార పార్టీ నాయకులు. ఇక్కడ చేపలు పట్టేందుకు, మట్టి తోలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే నీటిని బయటకు పంపించి చెరువును ఖాళీ చేశారు. సాగర్‌ జలాలతో నింపి చెరువును కాపాడాలంటూ టీడీపీ నాయకుడు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. 


ఈ ఒక్కటే కాదు.. ఇక్కడి ఎన్నో చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో బహిరంగంగా మట్టి, గ్రావెల్‌ తవ్వుకుపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ, అక్రమ తవ్వకాల గురించి తెలిసినప్పటికీ అధికారులు మౌనంగా చూస్తూ ఊరుకుంటున్నారు. పెద్దల ఒత్తిడితో అటువైపు కన్నెత్తి చూడట్లేదు. గ్రామాల ప్రజలు అభ్యంతరాలు చెబుతున్నా, రోడ్డెక్కి అడ్డుకుంటున్నా అక్రమార్కులు తమ పని తాము చేసుకుపోతున్నారు.


కంచికచర్ల, మే 16 : బండిపాలెం, పోచంపల్లి, కొణకంచి గ్రామాల మధ్యలోని భారీ సాగునీటి చెరువు  పూర్తిగా ఎండిపోవటంతో అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. నాయకుల ఆధ్వర్యంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. చెరువు గర్భాన్ని యంత్రాలతో కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడట్లేదు. సోమవారం కూడా తవ్వకాలు  సాగాయి.

- పెనుగంచిప్రోలు చెరువులో మూడు రోజుల నుంచి గ్రావెల్‌ (గలస) అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేత ఒకరు ఇటీవల ఆరు ఎకరాల పొలం కొని వెంచర్‌ వేశారు. ఈ వెంచర్లో అంతర్గత రోడ్ల కోసం చెరువులో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలను అడ్డుకోవద్దంటూ పాలక పెద్దలు స్థానిక మండల అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. రెండు యంత్రాలు, పది ట్రాక్టర్లతో గ్రావెల్‌ తవ్వి వెంచర్‌కు తరలిస్తున్నప్పటికీ అధికారులు మౌనవ్రతంలో ఉన్నారు. 

- వీరులపాడు మండలం జయంతి, అల్లూరు, జుజ్జూరు, వెల్లంకి, కొణతాలపల్లి చెరువుల్లోనూ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 

- జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట చెరువులో అయితే ఓవైపు చేపలు, మరోవైపు మట్టి కోసం నీటిని అక్రమంగా బయటకు పంపుతున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగినా ఫలితం లేదు. 

అనుమతులు నిల్‌

చెరువుల్లో మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు ఇరిగేషన్‌, మైనింగ్‌, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా లోతట్టు, పల్లపు పంట భూములను మెరక చేసేందుకే మట్టి తోలుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తుంటారు. కొన్నిచోట్ల అక్రమార్కులు.. రైతుల పేర్లతో అనుమతులు తీసుకుని దోపిడీ సాగిస్తుండగా, మిగతా చోట్ల ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చెలరేగిపోతున్నారు. 








Updated Date - 2022-05-17T06:45:15+05:30 IST