చెరువులు మాయం..

ABN , First Publish Date - 2020-11-30T05:14:24+05:30 IST

నగర పరిధిలోని చెరువులన్నీ దాదాపు ఆక్రమణల పరమయ్యాయి. బచ్చరాలచెరువు, బుడ్డాయపల్లె చెరువు, పక్కీరుపల్లె చెరువు, మొగిలిచెరువు, పుట్లంపల్లె చెరువు, రామయ్య చెరువులు ఆక్రమణకు గురయ్యాయంటూ పలువురు దశాబ్దాలుగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

చెరువులు మాయం..
కుచించుకునిపోయిన మృత్యుంజయకుంట

రోజురోజుకూ కబలిస్తున్న గ్యాంగ్‌లు

స్వరూపాన్ని కోల్పోయి కుంటల్లా తయారవుతున్న వైనం

కడప నగరంలో జల ప్రళయానికి ఆక్రమణలే కారణం

ఆక్రమించి అమ్మేసెయ్‌.. భవనాలు కట్టేసెయ్‌


ఈ నగరానికి ఏమైంది.. ఓ పక్క ప్రభుత్వ భూములు, శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మరోపక్క తాగునీటి అవసరాలు, బాటసారులు, పశువుల దాహార్తి తీర్చేందుకు పూర్వీకులు ఎంతో ముందు చూపుతో తవ్వించిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు సైతం ఆక్రమించేశారు. మరికొందరు సైడ్‌ కాల్వలు, రహదారులను కలిపేసుకుని భవంతులు నిర్మించారు. చెరువులు, వాగుల్లోకి చుక్కనీరు వెళ్లేందుకు అవకాశం లేదు. దీంతో నీరంతా ఎటుపడితే అలా పారుతూ నగరాన్ని ముంచెత్తుతోంది. నీటిపారుదలశాఖ సిటీ ప్లానింగ్‌, రెవెన్యూ యంత్రాంగం విఫలమైతే స్థలాలు అన్యాక్రాంతమవడానికి రాజకీయ నేతలు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. నగర పరిధిలోని చెరువులన్నీ దాదాపు ఆక్రమణలకు గురి కావడంతో వర్షాలు వచ్చినప్పుడల్లా నగర వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. 


(కడప - ఆంధ్రజ్యోతి):  నగర పరిధిలోని చెరువులన్నీ దాదాపు ఆక్రమణల పరమయ్యాయి. బచ్చరాలచెరువు, బుడ్డాయపల్లె చెరువు, పక్కీరుపల్లె చెరువు, మొగిలిచెరువు, పుట్లంపల్లె చెరువు, రామయ్య చెరువులు ఆక్రమణకు గురయ్యాయంటూ పలువురు దశాబ్దాలుగా ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. పక్కీరుపల్లె చెరువు 76 ఎకరాల విస్తీర్ణం ఉంది.  చెరువులు ఎక్కువగా చిన్నచౌకు పంచాయతీలో ఉన్నాయి. చెరువులు ఆక్రమణకు గురై కుచించుకుపోయి చెరువుల స్థాయి నుంచి వంకల స్థాయికి మారిపోయాయి. మృత్యుంజయకుంట అయితే దాదాపు 70 శాతం ఆక్రమణకు గురై చిన్న మురికిగుంటలా తయారైంది. చెరువులను, బుడ్డాయపల్లె చెరువుతట్టు కాల్వలు ఆక్రమించేసి అందమైన భవనాలు నిర్మించారు. 


వంకలనూ వదలడం లేదు

రాజీవ్‌ పార్కు నుంచి రైల్వేస్టేషన రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, పెట్రోలు బంకు సమీపం నుంచి మృత్యుంజయకుంటకు కాల్వ నాలుగు నుంచి పది అడుగుల మేర విస్తీర్ణంలో ఉన్నట్లు చెబుతారు. వర్షం నీరంతా ఈ కాల్వలోనే మృత్యుంజయకుంటలోకి చేరేది. మృత్యుంజయకుంట నుంచి వై.జంక్షన మీదుగా బుడ్డాయపల్లె చెరువుకు కాల్వ ఉన్నట్లు చెబుతారు. అయితే ఇప్పుడు అక్కడ కుచించుకుపోయిన డ్రైనేజీ కాల్వలు దర్శనమిస్తున్నాయి. రాజీవ్‌ పార్కు నుంచి ఆర్టీసీ బస్టాండు పెట్రోలు బంకు వరకు కమర్షియల్‌ ప్రాంతం ఉంది. దీంతో ఇక్కడ స్థలం రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. వాణిజ్య ప్రాంతం కావడంతో సెంటు ధర రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల మధ్య బస్టాండు ప్రాంతంలో ఉంది. దీంతో జానెడు కూడా వదలకుండా ఆక్రమించేసి కొందరు అందమైన భవంతులు నిర్మించారు.


రాజకీయ నేతల అండ

కడప నగరంలో చెరువులు, వాగులు, వంకలు అన్యాక్రాంతం కావడంలో కొందరు రాజకీయ నేతలు కీలకంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అనుచరులు లబ్ధి పొందేలా చెరువులు కుంటలు ఆక్రమించినా పట్టించుకోలేదని విమర్శలున్నాయి. కడపకు చెందిన ఓ నేత అనుచరులే మృత్యుంజయకుంటను మింగేసినట్లు చెబుతారు. ఆయన అనుచరులే చిన్నచౌకు పరిధిలో వాగులు, వంకలు, అలుగు చెరువు లోతట్టు స్థలాలను ఆక్రమించేసి విక్రయించారనే విమర్శలున్నాయి. తలా ఒక చేయి అన్నట్లుగా ఆక్రమ నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోలేదు. స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారులు పట్టంచుకోలేదనే విమర్శలున్నాయి. 


అందరూ కలిసి 

చెరువుల ఆక్రమణలో రెవెన్యూ, నీటిపారుదల, సిటీ ప్లానింగ్‌, రాజకీయ పార్టీల నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్లు విమర్శలున్నాయి. ఏ చెరువు ఎంత విస్తీర్ణం, ఎంత  మేర కాల్వలు ఉన్నాయనే విషయం కూడా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. కొందరు రాజకీయ నేతలకు తలొగ్గి రెవెన్యూ అఽధికారులు కొన్నిచోట్ల పట్టాలు కూడా ఇచ్చారనే విమర్శలున్నాయి. అడపాదడపా మాత్రమే టౌన ప్లానింగ్‌ అధికారులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. అయితే పాలకవర్గాల ముఖ్య నేతలే రహదారులు, వాగులు ఆక్రమించి కట్టడంతో వాటిని అడ్డుకోలేకపోయారనే విమర్శ ఉంది. దీంతో విచ్చలవిడిగా నిర్మాణాలు పెరిగిపోయాయి. రెండురోజుల క్రితం కురిసిన వర్షాలకు బుగ్గవంక నదీ పరివాహక ప్రాంతాలన్నీ ముంచేస్తే వర్షం నీరు, చెరువుల నుంచి వచ్చే నీరు సాఫీగా వెళ్లేందుకు కాల్వలు లేకపోవడంతో ప్రకాశనగర్‌, ఓంశాంతినగర్‌, భరతనగర్‌, ఎన్జీవో కాలనీ, అప్సరా వరకు మొత్తం జలమయమైంది. అప్సరా సర్కిల్‌ అయితే వీఽధులన్నీ జలమయంగా మారాయి. చినుకులు ఆగిపోయినా అక్కడ ప్రధాన వీధుల్లో మొకాలిలోతుకు పైగా నీరుండగా ఎన్జీవో కాలనీల్లో చాలా వరకు ఇళ్లల్లోకి నీరు చేరి అలాగే ఉంది. 


అక్రమ కట్టడాలు కూల్చేస్తాం 

- లవన్న, కమిషనరు 

అనుమతి లేకుండా, రహదారులు ఆక్రమించేసి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేస్తామని కమిషనరు లవన్న తెలిపారు. వాగులు, వంకలు చెరువు తట్టు భూముల్లో నిర్మించే నిర్మాణాలకు అనుమతినివ్వమన్నారు.

Updated Date - 2020-11-30T05:14:24+05:30 IST