చెన్నూరు టూ మహారాష్ట్ర

ABN , First Publish Date - 2021-12-09T04:18:56+05:30 IST

చెన్నూరు మండలంలో కొనుగోలు చేసిన పత్తిని దళారులు అనుమతులు లేకుండా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రైతుల వద్ద పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

చెన్నూరు టూ మహారాష్ట్ర
లోగో

- అనుమతులు లేకుండా పత్తి తరలింపు
- రైతుల వద్ద తక్కువ ధరకే కొనుగోలు
- జాతీయ రహదారి పక్కనే దళారుల మకాం
- పట్టించుకోని అధికారులు

చెన్నూరురూరల్‌, డిసెంబరు 8: చెన్నూరు మండలంలో కొనుగోలు చేసిన పత్తిని దళారులు అనుమతులు లేకుండా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రైతుల వద్ద పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా మార్కెట్‌ అధికారుల అం డదండలతో నడుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. పత్తి కొనుగోలులో సీసీఐ తక్కువ ధర పలకడంతో ప్రైవేటు కొనుగోలుదారులు  క్వింటాల్‌కు రూ. 7,500 నుంచి 7,800ల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పత్తి వాహ నాలు మిల్లుకు పోకుండా దళారీలు రోడ్డుపైనే మకాం వేసి కొనుగోలు చేస్తున్నారు. దళారులు రైతులను బురిడి కొట్టిస్తూ తూకంలో మార్పిడి చేస్తూ రైతుల వద్ద కొనుగోలు చేసి ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో మండలంలోని మార్కెట్‌ రుసుముకు భారీ స్ధాయిలో గండి పడుతోంది. మార్కెట్‌ అధికారులు ఇవేమి పట్టించుకోవడం లేదు. పలువురు నాయకుల అండదండలతో దళారులు ఈ అక్రమ దందాను నడు పుతున్నారు. చింతలపల్లి గ్రామంలోని జాతీయ రహదారిపై పత్తి వాహ నాలను పట్టణానికి వెళ్లకుం డానే మధ్యలో ఆపి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు లైసెన్స్‌ లేదని మార్కెట్‌ అధికారులు వారిలో ఒకరికి జరిమానా రాశారని, వారి తూకాలను స్వాధీనం చేసుకున్నామని మార్కెట్‌ అధికారులు చెప్పారు. కానీ మరుసటి రోజే వారి తూకాలను వారికి ఇచ్చేశారు. లైసెన్స్‌కు డీడీ తీయమని చెప్పారని లైసెన్స్‌ వచ్చే వరకు కొనుగోలు చేసుకోమ్మని అధికారులే చెప్పారని చెబుతున్నారు. ఇలా దళారులు, అధికారులు కుమ్మక్కై రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు.  

- జాతీయ రహదారి పక్కనే మకాం..
 జాతీయ రహదారి పక్కనే దళారులు మకాం వేసి రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను చేపడుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన పత్తిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రైతుల వద్ద  తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. డీసీఎం వ్యాన్‌లలో పత్తిని రాత్రివేళ చెక్‌పోస్టు దాటిస్తూ మార్కెట్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. మహారాష్ట్రలో పత్తి ధర ఎక్కు వగా పలుకుతుండడంతో దళారులు ముందుగానే మిల్లర్లతో కుమ్మక్కు అయి రైతుల వద్ద కొనుగోలు చేసి తరలిస్తున్నారు. మండలంలో ఆస్నాద్‌ రోడ్డు నుంచి మొదలు పెడితే చింతలపల్లి వరకు అనుమతులు లేకుండానే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పలుమార్లు జరిమానాలు విధించినా వీరి తీరు మారడం లేదు.  

-  అనుమతి తప్పనిసరి..
దళారులు పత్తి కొనుగోళ్లకు అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా పొందాలి. దీని కోసం వ్యవసాయ మార్కెట్‌ అధికారుల వద్ద లైసెన్స్‌కు దరఖాస్తులు చేసుకుని బ్యాంకులో రూ. 5 వేలతో డీడీ, రూ.వెయ్యితో ఇంకో డీడీ తీయాలి. అనంతరం  లైసెన్స్‌కు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌కు సంబంధించి కొనుగోలుదారుడు, అమ్మేవారు మార్కెట్‌ రుసుం చెల్లించాలి. కాని ఇవేవీ పాటించకుండా  నిబంధనలకు విరుద్ధంగా కొనుగోళ్లు చేపడుతున్నారు. మండ లంలో దాదాపు 20 నుంచి 30 పత్తి కొనుగోలు కేంద్రాలున్నాయి. వాటిలో 10, 12 దుకాణాలకు మాత్రమే ట్రేడింగ్‌ లైసెన్స్‌లు ఉన్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా ఉండడంతో పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు మిల్లులోనే అమ్ముకోవాలి..
- రామాంజనేయులు,  వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్రెటరీ

పత్తి కొనుగోలు చేసే వారు లైసెన్స్‌ తీసుకుని కొనుగోళ్లు చేపట్టాలి. లైసెన్స్‌లు లేకుండా కొనుగోళ్లు చేపడితే జరిమానా విధిస్తాం. రైతులు దళా రులను నమ్మి మోసపోవద్దు. మిల్లుల్లోనే పత్తి అమ్ముకుంటే లాభ పడతారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలి.

Updated Date - 2021-12-09T04:18:56+05:30 IST