Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నా కొడుకుపై పోటీ చేస్తే నేను ఓడిపోతా

twitter-iconwatsapp-iconfb-icon
నా కొడుకుపై పోటీ చేస్తే నేను ఓడిపోతా

అందువల్లే పార్టీ నుంచి బయటికొచ్చా

ఒక్క ఒప్పందమూ అమలుకాలేదు: రాజేశ్వరరావు

మిడిల్‌ క్లాసును ఆకర్షించేలా కమ్యూనిష్టుల్లో మార్పులు రాలేదు

గ్రామస్తుల కోసం జర్మనీ నుంచి ఇప్పటికీ నిధులు రాబట్టుకొస్తా: రమేష్‌


పార్టీకన్నా ప్రజాభిప్రాయమే ముఖ్యమంటారు చెన్నమనేని రాజేశ్వరరావు. అందుకే కమ్యూనిస్టు పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కొడుకుపై పోటీ చేస్తే తాను ఓడిపోయేవాడినన్నది ఆయన అభిప్రాయం. కాంగ్రెస్‌లోని అవకాశవాదుల వల్లే తెలంగాణ సమస్య ఇంతవరకు వచ్చిందంటారాయన. మరోవైపు.. మారుతున్న కాలానికి అనుగుణంగా మన కమ్యూనిస్టు పార్టీలు మారలేదనీ, అందువల్లే మధ్య తరగతివర్గాన్ని ఆకర్షించలేకపోయాయన్నది ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్‌ ఫిర్యాదు. ఆ తండ్రీకొడుకులతో జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం 17-06-2013న ఏబీఎనలో ప్రసారమయింది. ఆ వివరాలు... 


ఆర్కే: ఇప్పుడు మీ వయసు 90 ఏళ్లనుకుంటా. ఇన్నేళ్లుగా అన్నీ చూస్తూ వచ్చారు కదా? ఈ దశను ఎలా అభివర్ణిస్తారు?

రాజేశ్వర్‌రావు: ఏ మౌలిక సమస్యల పరిష్కారం కోసమైతే రాజకీయాల్లోకి ప్రవేశించామో అవి అలాగే ఉన్నాయి. వాటి విషయంలో చాలా అసంతృప్తిగా ఉంది.


ఆర్కే: నాన్నగారి అనుభవాలను చూసాక కూడా రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు?

రమేష్‌: నేను జర్మనీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నపుడు 2008లో టీడీపీ మహానాడులో తెలంగాణ తీర్మానం చేసింది. తెలంగాణ కోసమే నేను 2009లో టీడీపీలోకి వచ్చాను.


ఆర్కే: మీరు పుట్టింది భూస్వామ్య వెలమ కుటుంబంలో. కానీ మీ జీవితమంతా కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై ఉంది. ఇదెలా జరిగింది?

రాజేశ్వర్‌రావు: నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, క్విట్‌ ఇండియా ఉద్యమాలతో రాజకీయాల్లోకి ప్రవేశించాను. మా బావగారు, మా జిల్లా మొదటి ఎంపీ, కమ్యూనిస్టు దృక్పథం కలిగిన బద్దం ఎల్లారెడ్డిల ప్రభావంతో కమ్యూనిస్టు ఉద్యమం పైపు వచ్చాను.


ఆర్కే: తెలంగాణలో ఆంధ్ర మహాసభ ఎలా ఏర్పడింది?

రాజేశ్వర్‌రావు: త్రిలింగ అనే పదాన్ని వంకర చేసి ఉర్దూభాషలో తెలంగాణ అన్నారు. దీంతో నిజాం అన్నిటినీ వంకర చేస్తాడనే అభిప్రాయం ఏర్పడింది. తెలంగాణ అనే పదంకన్నా, ఆంధ్ర అనే పదం బావుందని అనుకున్నాం. తెలుగనే పదం స్వాతంత్ర్యానికీ, స్వేచ్ఛకు ప్రతీకగా భావించాం. ఇప్పటికీ భావిస్తున్నాం.


ఆర్కే: కానీ ఇప్పుడు సీమాంద్రులను శత్రువుల కింద భావిస్తున్నారు కదా?

రమేష్‌: తెలంగాణపై వివక్ష చూపారనీ, ఆంధ్ర ప్రాంతానికి నిధులు ఎక్కువగా వెళ్లాయన్న అభిప్రాయంతో ఆ ప్రాంతం వారిపై కోపం ఉంది. కానీ నా ఆంధ్ర స్నేహితుల్లో చాలా మంది రాష్ట్ర విభజన జరిగితే తప్పేమీ లేదన్న అభిప్రాయంలో ఉన్నారు.


ఆర్కే: కమ్యూనిస్టు పార్టీ వల్ల ఫలితం లేదనుకొని బయటికొచ్చారా లేక ఆ భావజాలం మీదే అసంతృప్తా?

రాజేశ్వర్‌రావు: అసంతృప్తేమీ లేదు. రమేష్‌ జర్మనీలో ఉండగా పంపించిన నిధులతో అనేక గ్రామాలకు మంచినీటి వసతి కల్పించాము. దీంతో ప్రజలకు రమేష్‌ మీద అభిమానం పెరిగి, అతణ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని నాపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని నేను కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి వివరించా. కొడుకుపై పోటీ చేస్తే నేను ఓడిపోతా అని కూడా చెప్పా. కానీ నేను పోటీ చేయాల్సిందే అంది పార్టీ. దీంతో నేను పార్టీకి రాజీనామా చేశాను. కానీ ఇప్పటికీ కమ్యూనిస్టు భావజాలాన్ని విశ్వసిస్తా.


ఆర్కే: కానీ మీరు కొడుకు కోసమే పార్టీని వీడారని భావిస్తున్నారు.

రాజేశ్వర్‌రావు: ఏ న్యాయాన్నైతే ప్రజలు కోరుకుంటారో దానిని అనుసరించాల్సిందే.


నా కొడుకుపై పోటీ చేస్తే నేను ఓడిపోతా

ఆర్కే: టీడీపీలోకి ఎందుకెళ్లారు?

రాజేశ్వర్‌రావు: అప్పట్లో రమేష్‌కు జర్మనీ పౌరసత్వముండేది. భారతీయ పౌరసత్వం కావాలని చంద్రబాబు నాటి హోంమినిష్టర్‌ అద్వానీ ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎన్నికల్లోపు పౌరసత్వం రాకపోవడంతో చంద్రబాబు నన్నే పోటీ చేయమన్నారు. పార్టీకన్నా ప్రజాభిప్రాయమే ముఖ్యమని నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది.


ఆర్కే: మీ రాజకీయ అనుభవం మీ పిల్లలపై ప్రభావం చూపలేదా?

రమేష్‌: నాన్న ప్రభావం ఉంది. అయితే మిడిల్‌క్లాస్‌ వారిని ఆకర్షించే విధంగా కమ్యూనిస్టు పార్టీలో మార్పులు జరగలేదు. ప్రజాస్వామ్యంలో కూడా విప్లవ భావాలు ఉంటాయని రష్యాలో గోర్బచేవ్‌, జర్మనీల్లో నిరూపించడానికి ప్రయత్నించారు. అప్పుడు జర్మనీలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ ఉన్న నేను వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిని. కానీ మన కమ్యూనిస్టులు మాత్రం గోర్బచేవ్‌ను పెద్ద విలన్‌గా చూశారు. లెనిన్‌ చెప్పిన కార్మికవర్గ నియంతృత్వాన్ని నేటి పరిస్థితులకు అన్వయించడానికి ప్రయత్నించడం తప్పు.


ఆర్కే: జీవితాంతం విశాలాంధ్ర కోసం పోరాడిన మీరు చివరి దశకు వచ్చేసరికి ప్రత్యేక తెలంగాణ అంటున్నారు?

రాజేశ్వర్‌రావు: జంటిల్మెన్‌ అగ్రిమెంట్‌ తదితర ఒప్పందాలు జరిగినా ఒక్కటీ అమలు కాలేదు. దీనికి కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన. కాంగ్రెస్‌ పార్టీలో పెత్తనం కోసమో, పదవుల కోసమో తెలంగాణను ఉపయోగించుకోవడం ప్రారంభమైంది. తెలంగాణ వాళ్లకు రావాల్సిన 50-60 వేల ఉద్యోగాలు ఆంధ్రా వాళ్లకు వెళ్లాయి.


ఆర్కే: ఇది తెలంగాణ నాయకుల వైఫల్యం కాదా?

రాజేశ్వర్‌రావు: ఇక్కడి నాయకులకు ఇప్పటికీ ప్రజాస్వామ్యం అంటేనే తెలీదు.


ఆర్కే: మరి వీళ్లు రేపు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక దాన్నేం అభివృద్ది చేస్తారు?

రాజేశ్వర్‌రావు: అలాగని ఇలాగే వెనుకబడే ఉండలేం కదా?


ఆర్కే: అప్పట్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే నాయకులే ఏ పార్టీలోనూ లేరా?

రమేష్‌: అప్పట్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం, వివక్షఫై ఇంత అవగాహన ఉండేది కాదు. తెలంగాణలోని సీట్లన్నీ తెలంగాణవాదులే గెల్చుకుంటే తెలంగాణ వస్తుందన్నది మా పార్టీ అవగాహన.


ఆర్కే: జర్మనీ ఎలా వెళ్లారు?

రమేష్‌: అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలో ఉన్నవారి పిల్లలు రష్యా, జర్మనీకి వెళ్లే అవకాశం కల్పించేవారు. నీలం రాజశేఖరరెడ్డిగారు నన్ను జర్మనీ పంపాలని నిర్ణయించారు. 76లో అక్కడికి వెళ్లాను. వ్యవసాయంలో పీహెచ్‌డీ చేశాను.


ఆర్కే: మీరు వేములవాడలో అందుబాటులో ఉండరనీ, ఎక్కువ కాలం జర్మనీలో ఉంటారని ఫిర్యాదు.

రమేష్‌: నా జీవితంలో సగభాగం జర్మనీలో గడిచింది. నా భార్యాపిల్లలు అక్కడే ఉన్నారు. అదీగాకుండా.. నేను జర్మనీ నుంచి తిరిగి వచ్చినపుడల్లా ఏవో నిధులు తీసుకొస్తూనే ఉన్నాను. నా నియోజకవర్గంలో ఇప్పుడు 62 గ్రామాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్ల కోసం 2 కోట్ల 40 లక్షలు ఖర్చవుతోంది. ఆ నిధులు జర్మనీ నుంచి తెచ్చినవే.


ఆర్కే: మీ ఇద్దరూ ఏయే అంశాలపై మాట్లాడుకుంటారు.

రమేష్‌: నాన్నగారు రెండు పుస్తకాలు రాశారు. మూడో పుస్తకం రాస్తున్నారు. ఆయనది చాలా విశాల దృక్పథం. అయితే ఆయన ఐడియలిస్ట్‌. నిజాలన్నీ బయటికే చెప్పేస్తారు. దాని వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అయినా ఆయనంటే గౌరవమే.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రాజకీయ నేతలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.