100 మంది ఉద్యోగులకు కార్లు.. ఐటీ కంపెనీ సర్ ఫ్రైజ్

ABN , First Publish Date - 2022-04-12T21:00:16+05:30 IST

చెన్నై: కంపెనీ ఎదుగుదలకు అనునిత్యం పాటుపడుతున్న 100 మంది ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది ఓ ఐటీ సంస్థ.

100 మంది ఉద్యోగులకు కార్లు.. ఐటీ కంపెనీ సర్ ఫ్రైజ్

చెన్నై: కంపెనీ ఎదుగుదలకు అనునిత్యం పాటుపడుతున్న 100 మంది ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది ఓ ఐటీ సంస్థ. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ ఐడియాస్2ఐటీ ఏకంగా 100 మంది ఉద్యోగులకు మారుతీ కార్లను బహుమతిగా అందించింది. కంపెనీ వృద్ధి కోసం అనునిత్యం కృషి, అసమాన భాగస్వామ్యానికి గుర్తింపుగా ఈ కార్లను అందించామని కంపెనీ ప్రకటించింది. 10 ఏళ్లకుపైగా కంపెనీతో ప్రయాణం కొనసాగిస్తున్న 100 మంది ఉద్యోగులకు 100 కార్లను గిఫ్ట్ గా అందించామని కంపెనీ మార్కెటింగ్ హెడ్ హరి సుబ్రమణియన్ చెప్పారు. కంపెనీ ద్వారా పొందిన సంపదను ఉద్యోగులను తిరిగి పంచిపెట్టాలనేదే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మురళీ వివేకనందన్ స్పందిస్తూ.. కంపెనీ పురోభివృద్ధి కోసం ఉద్యోగులు ఎంతోపాటుపడ్డారని, ఎన్నో ప్రయత్నాలు చేశారని ప్రశంసించారు. కంపెనీయేమీ ఉద్యోగులకు కార్లు ఇవ్వడం లేదు. వారే తమ కఠోర శ్రమతో సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు. లక్ష్యాలను అధిగమిస్తే సంపాదనను ఉద్యోగులతో కూడా పంచుకుంటామని ఏడెనిమిదేళ్ల క్రితం సిబ్బందికి మాటిచ్చామని గుర్తుచేసుకున్నారు.  కార్లు అందించడం కేవలం మొదటి అడుగు మాత్రమేనని, సమీప భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు చాలానే ఉంటాయని వివేకనందన్ సంకేతాలిచ్చారు. 


కాగా ఈ కంపెనీలో మొత్తం 500 మంది పనిచేస్తున్నారు. కంపెనీ స్వయంగా కార్లను బహుమతిగా అందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు నాణేలు, ఐఫోన్ల రూపంలో కంపెనీ తన సంతోషాన్ని పంచుకుంటుందని ప్రశాంత్ అనే ఉద్యోగి చెప్పాడు. కాగా ఇటివలే చెన్నై కేంద్రంగానే పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ కిస్ ఫ్లో కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు రూ.1 కోటి విలువైన బీఎండబ్ల్యూ కార్లను ప్రదానం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-12T21:00:16+05:30 IST