Abn logo
Sep 27 2021 @ 01:55AM

జడేజా మెరుపు ఇన్నింగ్స్‌

అబుధాబి: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను విజయం వరించింది. టాపార్డర్‌ అద్భుత షోతో సునాయాసంగా మ్యాచ్‌ను గెలవాల్సిన ధోనీసేన..మిడిలార్డర్‌ వైఫల్యంతో చివరి దాకా తెచ్చుకుంది. కానీ జడేజా మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు వాకిటకు తీసుకొచ్చాడు. దాంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎ్‌సకే రెండు వికెట్లతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 171/6 స్కోరు చేసింది. త్రిపాఠి (45), నితీశ్‌ (37 నాటౌట్‌), దినేశ్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 172/8 స్కోరుతో విజయం అందుకుంది. రుతురాజ్‌ (40), డుప్లెసి (43), జడేజా (8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22) సత్తా చాటారు. నరైన్‌ (3/41) మూడు వికెట్లు తీశాడు. జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు. 


చెలరేగిన రుతురాజ్‌, డుప్లెసి :

172 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసి చెన్నైకి అద్భుత ఆరంభం ఇచ్చారు. పోటీపడి ఫోర్లు కొట్టిన వీరు మొదటి వికెట్‌కు 74 పరుగులతో పటిష్ట పునాది వేశారు. స్వల్ప వ్యవధిలో గైక్వాడ్‌, డుప్లెసి నిష్క్రమించాక..చెన్నై మిడిలార్డర్‌ కుప్పకూలింది. 21 బంతుల్లో కావాల్సినవి 34 పరుగులు. మిగిలినవి ఏడు వికెట్లు. దాంతో సీఎ్‌సకే గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ ఆరు బంతుల తేడాతో మొయిన్‌, రైనా, ధోనీ అవుట్‌ చేసిన కోల్‌కతా పోటీలోకొచ్చింది. 


జడేజా షో:

అయితే 19వ ఓవర్లో నాలుగు బంతుల్లో విశ్వరూపం ప్రదర్శించిన జడేజా కోల్‌కతా ఆశలను చిదిమేశాడు. ప్రసిధ్‌ వేసిన ఆ ఓవర్లో 6,6,4,4తో జడ్డూ కదం తొక్కాడు. ఇక చివరి ఓవర్లో చెన్నై విజయానికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా నరైన్‌...కర్రాన్‌, జడేజాలను అవుట్‌ చేశాడు. ఒక్క పరుగు చేస్తే చెన్నైదే విజయం. టెన్షన్‌ను అదిమిపట్టిన దీపక్‌..నరైన్‌ బంతిని మిడ్‌వికెట్‌వైపు కొట్టి పరుగు తీయడంతో చెన్నై గెలుపు సంబరాల్లో మునిగింది. 


సంక్షిప్త స్కోర్లు:

కోల్‌కతా: 20 ఓవర్లలో 171/6 (త్రిపాఠి 45, నితీశ్‌ (నాటౌట్‌) 37, దినేష్‌ కార్తీక్‌ 26,  హాజెల్‌వుడ్‌ 2/40, శార్దూల్‌ 2/20); 

చెన్నై: 20 ఓవర్లలో 172/8 (రుతురాజ్‌ 40, డుప్లెసి 43, మొయిన్‌ 32, జడేజా 22, నరైన్‌ 3/41) 

క్రైమ్ మరిన్ని...