Abn logo
Aug 10 2020 @ 03:49AM

సూపర్‌ ఫాస్ట్‌ చెన్నై

చెపాక్‌లో వారం రోజుల ప్రాక్టీస్‌

ఆ తర్వాతే యూఏఈకి ధోనీసేన


చెన్నై: ఐపీఎల్‌ సన్నాహకాలను చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) యమా ఫాస్ట్‌గా ఆరంభిస్తోంది. వచ్చే నెల 19 నుంచి జరగబోయే ఈ లీగ్‌ కోసం మిగతా జట్లు ఎప్పటి నుంచి ప్రాక్టీస్‌ చేస్తాయో స్పష్టత లేకపోయినా.. ధోనీ సేన మాత్రం ఈ విషయంలో క్లారిటీగానే ఉంది. ఈనెల 15 నుంచి ఎంఎ చిదంబరం స్టేడియంలో సీఎ్‌సకే ఆటగాళ్లు ఓ వారం రోజుల పాటు ప్రాక్టీ్‌సకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి సాధించింది. ఈ క్యాంపులో ధోనీ, రైనా, రాయుడు, హర్భజన్‌ సింగ్‌, పియూష్‌ చావ్లా తదితర స్వదేశీ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరంతా ఈనెల 14నే చార్టర్డ్‌ ఫ్లయిట్స్‌లో చెన్నైకి చేరుకుంటారు. మరుసటి రోజు నుంచి నెట్స్‌లో ప్రాక్టీస్‌ ఆరంభిస్తారు. కరోనా కారణంగా చాలా కాలం పాటు ఆటగాళ్లకు శిక్షణ లేకుండా పోయింది. అందుకే వారం రోజుల పాటు ఇక్కడే తగిన ప్రాక్టీస్‌ చేస్తే బాగుంటుందని ధోనీ సూచించాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఆగస్టు 21న ధోనీ బృందం దుబాయ్‌కి వెళుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌ తప్ప మరే ఇతర జట్టు కూడా స్వదేశంలో క్యాంపు ఏర్పాటు చేసే ఆలోచనలో లేదు. ‘చెన్నైకి వచ్చిన ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండరు. ఎందుకంటే ఇక్కడికి రావడానికి రెండ్రోజుల ముందే వారు కొవిడ్‌ టెస్టులు చేయించుకుంటారు. ఇక, ప్రాక్టీస్‌ సమయంలో ఆటగాళ్లు కేవలం హోటల్‌, స్టేడియానికే పరిమితమవుతారు. చెన్నైలో సాధన ప్రారంభించాక కూడా రెండుసార్లు పరీక్ష చేయించుకుంటారు’ అని సీఎ్‌సకే అధికారి తెలిపాడు.

వివో వెళ్లడంతో నష్టమేమీ లేదు: గంగూలీ

ఐపీఎల్‌ టైటిల్‌ లోగో స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో వెనక్కి తగ్గినంత మాత్రాన ఆర్థికంగా నష్టపోయేదేమీ లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. కేవలం దీన్ని తాత్కాలిక సమస్యగానే చూడాలని చెప్పాడు. ‘భారత క్రికెట్‌ బోర్డు పటిష్ఠంగా ఉంది. దీనికి గట్టి పునాదులున్నాయి. గత పాలకులతో పాటు భారత ఆటగాళ్లకూ ఇందులో పాత్ర ఉంది. కొన్ని నిర్ణయాలతో నష్టాలు వస్తాయి.. మరికొన్నింటితో లాభాలుంటాయి. అన్నింటికీ సిద్ధంగా ఉండాల్సిందే. వివో సమస్య తాత్కాలికమే. ఇప్పుడు మేం చేయాల్సింది ధైర్యంగా ముందుకెళ్లడమే’ అని దాదా తెలిపాడు.

జట్టును నమ్మడం ముఖ్యం: కోహ్లీ

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి తన ప్రేమను చాటుకున్నాడు. ఐపీఎల్‌లో ఉన్నంతకాలం ఆర్‌సీబీకే ఆడతానని గతంలోనే స్పష్టం చేసిన విరాట్‌.. జట్టుపై నమ్మకం ఉంచడం అన్నింటికంటే ముఖ్యమని తెలిపాడు. ఫలితం ఎలా ఉన్నా ముందుకు సాగాల్సిందేనని చెప్పాడు. ఈమేరకు బెంగళూరుతో తన అనుబంధాన్ని ఓ చిన్న వీడియో రూపంలో షేర్‌ చేశాడు. 


ఎన్‌సీఏ ఫిజియోపై విముఖత

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఫిజియో థెరపిస్ట్‌ ఆశిష్‌ కౌశిక్‌ను యూఏఈకి పంపాలనుకోవడంపై  ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లు చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతుండడంతో వారిని పరిశీలించేందుకు కౌశిక్‌ను పంపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే, ఐపీఎల్‌తో సంబంధం లేని బయటి వ్యక్తిని తమ బయో బబుల్‌లోకి ఎలా అనుమతిస్తామని ఫ్రాంచైజీలు ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ భారత క్రికెటర్లను ఎన్‌సీఏ ట్రాక్‌ చేయాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసుకోవచ్చని గుర్తుచేశాయి. ‘అన్ని ఫ్రాంచైజీలు ప్రపంచంలోని అత్యుత్తమ ట్రైనర్లను ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే ఆటగాళ్లతో, ఫ్రాంచైజీలతో ఎన్‌సీఏ ఫిజియో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించుకోవచ్చు. నిజానికి గతంలో జరిగిన పలు సంఘటనలతో ఎన్‌సీఏపై ఆటగాళ్లకు నమ్మకం పోయింది’ అని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
Advertisement