చెన్నై.. అదే తీరు

ABN , First Publish Date - 2020-10-11T09:20:35+05:30 IST

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా.. ఆ తర్వాత పటిష్ఠ ...

చెన్నై.. అదే తీరు

మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేలవ ప్రదర్శన 

కొనసాగుతూనే ఉంది. ఇదే స్టేడియంలో 179 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించిన చెన్నై ఈసారి బెంగళూరు విసిరిన 170 పరుగుల టార్గెట్‌ను జట్టంతా కలిసినా చేరుకోలేకపోయింది. పరుగులు తీయడమే తెలీదన్నట్టుగా టపటపా వికెట్లు చేజార్చుకుంది. ఇక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆరంభంలో నిదానంగా ఆడినా డెత్‌ ఓవర్లలో దుమ్ము రేపడంతో బెంగళూరు అద్భుతంగా కోలుకుంది. 


బెంగళూరు చేతిలో చిత్తు 

 చెలరేగిన కోహ్లీ


దుబాయ్‌: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోగా.. ఆ తర్వాత పటిష్ఠ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో 37 పరుగుల తేడాతో ఆర్‌సీబీ ఘనవిజయం సాధించింది. చెన్నైకిది ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదో ఓటమి. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. శార్దూల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసి ఓడింది. రాయుడు (42), జగదీశన్‌ (33) ఫర్వాలేదనిపించారు. మోరి్‌స మూడు, సుందర్‌ రెండు వికెట్లు తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు.

వణికించారు: 170 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్‌ ఆర్‌సీబీకన్నా నిదానంగా సాగింది. చివర్లోనైనా మెరుపులుంటాయేమోనని భావించినా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి వాట్సన్‌ (14), డుప్లెసి (8)లను కోల్పోయి 26 రన్స్‌ చేసింది. ఇలాంటి స్థితిలో రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన జగదీశన్‌ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతడికి రాయుడు సహకరించడంతో దాదాపు తొమ్మిది ఓవర్లపాటు మరో వికెట్‌ పడకుండా స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అడపాదడపా ఫోర్లు బాదినా ఆశించిన వేగం మాత్రం కనిపించలేదు. 15వ ఓవర్‌లో జగదీశన్‌ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. మూడో వికెట్‌కు వీరి మధ్య 64 పరుగులు వచ్చాయి. ఇక భారీ సిక్సర్‌తో మురిపించిన కెప్టెన్‌ ధోనీ (10)ని చాహల్‌.. సామ్‌ కర్రాన్‌ (0)ను మోరిస్‌ అవుట్‌ చేయడంతో సీఎ్‌సకే వరుసగా మూడు వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. మూడు ఓవర్లలో 61 పరుగులు చేయాల్సి ఉండగా 18వ ఓవర్‌లో రాయుడును ఉడాన బౌల్డ్‌ చేయడంతో చెన్నై ఆశలు వదులుకుంది.

నిదానంగా ఆరంభం: టాస్‌ గెలవగానే బెంగళూరు జట్టు వెంటనే బ్యాటింగ్‌కు దిగింది. కానీ పిచ్‌ వారు ఆశించినట్టుగా సహకరించలేదు. దీంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ నిదానంగా సాగడంతో పాటు స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు చేజార్చుకుని ఇబ్బంది పడింది. కానీ చివర్లో మాత్రం కోహ్లీ గేరు మార్చి విరుచుకుపడడంతో మంచి స్కోరే అందుకుంది. ఆరంభంలో చెన్నై బౌలర్లు చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో కట్టడి చేయడంతో పవర్‌ప్లేలో బెంగళూరు చేసింది 36 పరుగులే. పైగా మూడో ఓవర్‌

లోనే ఓపెనర్‌ ఫించ్‌ (2)ను చాహర్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ సమయంలో దేవ్‌దత్‌, కోహ్లీ జోడీ జాగ్రత కనబరుస్తూ నాలుగో వికెట్‌కు 53 రన్స్‌ జోడించింది. కానీ 7.1 ఓవర్లపాటు క్రీజులో ఉన్న వీరి నుంచి 3 ఫోర్లు, ఓ సిక్స్‌ మాత్రమే రావడంతో స్కోరు నత్తనడకన సాగింది. దీనికి తోడు 11వ ఓవర్‌లో దేవ్‌దత్‌, డివిల్లీర్స్‌ (0)ను శార్దూల్‌ పెవిలియన్‌కు చేర్చి షాక్‌ ఇచ్చాడు.

కోహ్లీ జోరు: 15 ఓవర్లలో జట్టు స్కోరు 95/4. ఈ దశలో 150 రన్స్‌ చేస్తే గొప్ప అనే పరిస్థితి నెలకొంది. కానీ డెత్‌ ఓవర్లలో కోహ్లీ సిసలైన ఆటతీరును ప్రదర్శించడంతో ఆఖరి 24 బంతుల్లోనే 66 రన్స్‌ వచ్చాయి. 39 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన తను 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్‌లో శివమ్‌ దూబే కూడా సిక్సర్‌ బాదగా 24 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లోనూ జట్టు 14 పరుగులు సాధించడంతో సవాల్‌ విసిరే స్కోరు చేసింది. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు వచ్చాయి.


 ఆర్‌సీబీ తరఫున (ఐపీఎల్‌, చాంపియన్స్‌ లీగ్‌ల్లో) 6 వేల పరుగులు పూర్తి చేసిన కోహ్లీ


స్కోరు బోర్డు

బెంగళూరు: దేవ్‌దత్‌ (సి) డుప్లెసి (బి) శార్దూల్‌ 33; ఫించ్‌ (బి) చాహర్‌ 2; కోహ్లీ (నాటౌట్‌) 90; డివిల్లీర్స్‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌ 0; సుందర్‌ (సి) ధోనీ (బి) సామ్‌ కర్రాన్‌ 10; దూబే (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 169/4; వికెట్ల పతనం: 1-13, 2-66, 3-67, 4-93; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-10-1; సామ్‌ కర్రాన్‌ 4-0-48-1; శార్దూల్‌ 4-0-40-2; బ్రావో 3-0-29-0; కరణ్‌ 4-0-34-0; జడేజా 2-0-7-0.

చెన్నై: వాట్సన్‌ (బి) సుందర్‌ 14; డుప్లెసి (సి) మోరిస్‌ (బి) సుందర్‌ 8; రాయుడు (బి) ఉడాన 42; జగదీశన్‌ (రనౌట్‌/మోరిస్‌) 33; ధోనీ (సి) గుర్‌కీరత్‌ (బి) చాహల్‌ 10; సామ్‌ కర్రాన్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) మోరిస్‌ 0; జడేజా (సి) గుర్‌కీరత్‌ (బి) మోరిస్‌ 7; బ్రావో (సి) పడిక్కల్‌ (బి) మోరిస్‌ 7; చాహర్‌ (నాటౌట్‌) 5; శార్దూల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 132/8; వికెట్ల పతనం: 1-19, 2-25, 3-89, 4-106, 5-107, 6-113, 7-122, 8-126; బౌలింగ్‌: మోరిస్‌ 4-0-19-3; సైనీ 4-0-18-0; ఉడాన 4-0-30-1; సుందర్‌ 3-0-16-2; చాహల్‌ 4-0-35-1; దూబే 1-0-14-0.

Updated Date - 2020-10-11T09:20:35+05:30 IST