చెన్నైపై రాజస్థాన్ అద్భుత విజయం

ABN , First Publish Date - 2020-09-23T04:59:42+05:30 IST

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ అభిమానులకు అసలైన మజా పంచింది. ఐపీఎల్‌-2020లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రెచ్చిపోయింది. శాంసన్ మెరుపులు, స్మిత్ మాస్టర్ స్ట్రోక్.....

చెన్నైపై రాజస్థాన్ అద్భుత విజయం

దుబాయ్: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ అభిమానులకు అసలైన మజా పంచింది. ఐపీఎల్‌-2020లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రెచ్చిపోయింది. శాంసన్ మెరుపులు, స్మిత్ మాస్టర్ స్ట్రోక్.. వెరసి రాజస్థాన్‌ భారీ స్కోరు చేసింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఎప్పుడూ లేని వింధంగా స్మిత్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే జైస్వాల్ రూపంలో రాజస్థాన్ తొలి వికెట్‌ను వెంటనే కోల్పోయింది. అయితే వన్ డౌన్‌లో శాంసన్ వచ్చీ రావడంతోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సులు బాదుతూ ప్రతి ఒక్క బౌలర్‌నూ ఆడేసుకున్నాడు. ఒకపక్క సంజు శాంసన్(32 బంతుల్లో 74 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌కు స్టీవ్ స్మిత్(47 బంతుల్లో 69 పరుగులు) క్లాసిక్ ఇన్నింగ్స్ తోడవడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. దీంతో ఆర్ఆర్ ఈ ఏడాది టోర్నీలోనే తొలిసారి 200 పైగా స్కోరు సాధించింది. అయితే శాంసన్ ఔట్ కావడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అంతేకాకుండా వరుసగా వికెట్లు కూడా పడిపోవడంతో స్మిత్‌పై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో లోనే స్మిత్ కూడా అవుటయ్యాడు. చివరి ఓవర్లో ఆర్చర్ హిట్ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 7 వికెట్లకు గానూ 216 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసి పోటీలో ఉన్నట్లే అనిపించింది.


కానీ మురళీ విజయ్ మళ్లీ నిరాశ పరుస్తూ 21 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి డీప్ స్క్వేర్‌లో గోపాల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత వాట్సన్ కొద్ది సేపు నిలబడినా తెవాటియా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వికెట్లు పడుతున్నా డూప్లెసిన్ మాత్రం సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 7 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 72 పరుగులు చేసి వీరోచితంగా పోరాడాడు.  కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. చివర్లో ధోనీ వరుస సిక్సులు బాదినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. దీంతో 16 పరుగుల తేడాతో చెన్నైపై రాజస్థాన్ విజయ ఢంకా మోగించింది.

Updated Date - 2020-09-23T04:59:42+05:30 IST