Abn logo
Sep 20 2021 @ 00:44AM

చెన్నై సూపర్‌

  • ముంబైపై విజయం 
  • రుతురాజ్‌ అజేయ అర్ధసెంచరీ

దుబాయ్‌: ఐపీఎల్‌ రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. 24 రన్స్‌కే సగం మంది పెవిలియన్‌లో కూర్చున్న వేళ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్‌) సంయమన ఆటతీరుతో అండగా నిలిచాడు. ఆ తర్వాత బౌలర్ల జోరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. జడేజా (26)తో కలిసి గైక్వాడ్‌ ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. ఆఖర్లో డ్వేన్‌ బ్రావో (8 బంతుల్లో 3 సిక్సర్లతో 23) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్‌ తివారీ (40 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్‌)కి సహకారం కరువైంది. బ్రావోకు మూడు, దీపక్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రుతురాజ్‌ నిలిచాడు.


సౌరభ్‌ ఒక్కడే..: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో ముంబై కూడా పవర్‌ప్లేలోనే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా సౌరభ్‌ తివారీ మినహా మరెవరూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. ఓపెనర్లు డికాక్‌ (17), అన్మోల్‌ప్రీత్‌ (16)లను దీపక్‌ చాహర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. కీలక సూర్యకుమార్‌ (3)ను శార్దూల్‌ అవుట్‌ చేయగా ఇషాన్‌ (10) బ్రావోకు చిక్కాడు. ఓ సిక్సర్‌, ఫోర్‌తో జోరు మీదున్న కెప్టెన్‌ పొలార్డ్‌ (15)ను పేసర్‌ హాజెల్‌వుడ్‌ ఎల్బీ చేశాడు. ఆ వెంటనే క్రునాల్‌ (4) రనౌట్‌ కావడంతో ముంబై 94/6తో కష్టాల్లో పడింది. అటు సౌరభ్‌ తివారీ అర్ధసెంచరీతో చివరి వరకు నిలిచినా మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు.  


రుతురాజ్‌ అండతో..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఎంఎస్‌ ధోనీకి తన నిర్ణయం ఎంత తప్పో తొలి ఓవర్‌లోనే తెలిసొచ్చింది. పేసర్లు బౌల్ట్‌, మిల్నేల నుంచి దూసుకొచ్చిన బుల్లెట్‌లాంటి బంతులను ఎదుర్కోలేక చెన్నై బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, చివర్లో బ్రావో పుణ్యమా అని సీఎస్‌కే పరువు కాపాడుకుంది. డుప్లెసి, మొయిన్‌ అలీ డకౌట్‌ కాగా రైనా (4), ఎంఎస్‌ ధోనీ (3) దారుణంగా నిరాశపరిచారు. మిల్నే ఓవర్‌లో బంతి రాయుడు ఎడమ మోచేతిని బలంగా తాకడంతో రెండో ఓవర్‌లోనే అతడు రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై 24/4 స్కోరుతో దయనీయంగా నిలిచింది. ఈ సమయంలో రుతురాజ్‌ అండగా నిలిచాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రుతురాజ్‌ ఇచ్చిన క్యాచ్‌ను డికాక్‌ వదిలేయడం చెన్నైకి కలిసివచ్చింది. చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ నెమ్మదిగా స్కోరును చక్కదిద్దిన గైక్వాడ్‌కు జడేజా (26) సహకరించాడు. క్రునాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో రుతురాజ్‌ 6,4 బాదగా జడ్డు  ఫోర్‌తో 18 పరుగులు వచ్చాయి. పొలార్డ్‌ ఓవర్‌లోనూ రుతురాజ్‌ రెండు ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17వ ఓవర్‌లో తను ఓ భారీ సిక్సర్‌తో మరింత వేగం పెంచే ప్రయత్నం చేయగా అదే ఓవర్‌లో జడేజా లాంగాఫ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఐదో వికెట్‌కు 81 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. బ్రావో (23) వచ్చీ రావడంతోనే బ్యాట్‌ ఝుళిపించాడు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అతడి రెండు సిక్సర్లు, గైక్వాడ్‌ 4,6తో చెన్నై 24 పరుగులు సాధించింది. చివరి ఓవర్‌లో బ్రావో అవుటైనా గైక్వాడ్‌ సిక్సర్‌తో స్కోరు 150 దాటింది.

స్కోరుబోర్డు


చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ (నాటౌట్‌) 88; డుప్లెసి (సి) మిల్నే (బి) బౌల్ట్‌ 0; మొయిన్‌ అలీ (సి) సౌరభ్‌ తివారీ (బి) మిల్నే 0; అంబటి రాయుడు (రిటైర్డ్‌ హర్ట్‌) 0; రైనా (సి) రాహుల్‌ చాహర్‌ (బి) బౌల్ట్‌ 4; ధోనీ (సి) బౌల్ట్‌ (బి) మిల్నే 3; జడేజా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 26; బ్రావో (సి) క్రునాల్‌ (బి) బుమ్రా 23; శార్దూల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 156/6. వికెట్ల పతనం: 1-1, 2-2, 3-7, 4-24, 5-105, 6-144. బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-35-2; మిల్నే 4-0-21-2; బుమ్రా 4-0-33-2; పొలార్డ్‌ 2-0-15-0; రాహుల్‌ చాహర్‌ 4-0-22-0; క్రునాల్‌ 2-0-27-0. 


ముంబై ఇండియన్స్‌: డికాక్‌ (ఎల్బీ) చాహర్‌ 17; అన్మోల్‌ప్రీత్‌ (బి) చాహర్‌ 16; సూర్యకుమార్‌ (సి) డుప్లెసి (బి) శార్దూల్‌ 3; ఇషాన్‌ కిషన్‌ (సి) రైనా (బి) బ్రావో 11; సౌరభ్‌ తివారీ (నాటౌట్‌) 50; పొలార్డ్‌ (ఎల్బీ) హాజెల్‌వుడ్‌ 15; క్రునాల్‌ (రనౌట్‌) 4; మిల్నే (సి) సబ్‌- గౌతమ్‌ (బి) బ్రావో 15; రాహుల్‌ చాహర్‌ (సి) రైనా (బి) బ్రావో 0; బుమ్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 136/8; వికెట్ల పతనం: 1-18; 2-35; 3-37; 4-58; 5-87; 6-94; 7-134; 8-135; బౌలింగ్‌: దీపక్‌ 4-0-19-2; హాజెల్‌వుడ్‌ 4-0-34-1; శార్దూల్‌ 4-0-29-1; మొయిన్‌ అలీ 3-0-16-0; బ్రావో 4-0-25-3; జడేజా 1-0-13-0. 


క్రైమ్ మరిన్ని...