చెన్నై బోల్తా

ABN , First Publish Date - 2020-10-08T08:42:40+05:30 IST

ఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) చతికిలపడింది. ఒక దశలో 101/3తో సులువుగా నెగ్గుతుందనుకున్న ధోనీ సేన..

చెన్నై బోల్తా

ఛేదనలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే)  చతికిలపడింది. ఒక దశలో 101/3తో సులువుగా నెగ్గుతుందనుకున్న ధోనీ సేన.. అనూహ్యంగా ఓటమి పాలైంది. వాట్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఆఖర్లో జడేజా భారీ షాట్లు ఆడినా.. అది ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. రాహుల్‌ త్రిపాఠి అర్ధ శతకంతో కోల్‌కతాకు గౌరవప్రద స్కోరును అందించాడు. 


రాహుల్‌ త్రిపాఠి (81)బంతులు: 51 ఫోర్లు: 8 సిక్సర్లు: 3

కోల్‌కతా చేతిలో ఓటమి

రాణించిన త్రిపాఠి


అబుదాబి: బ్యాటింగ్‌ వైఫల్యంతో ధోనీ అండ్‌ కో మరోసారి ఓడింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) చేతిలో పరాజయం పాలైంది. రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81) అర్ధ శతకంతో.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. బ్రావో (3/37) మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ (2/25), కర్రాన్‌ (2/26)కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ధోనీ నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. అనంతరం ఛేదనలో చెన్నై ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడింది. వాట్సన్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 50) హాఫ్‌ సెంచరీ వృథా అయింది. రస్సెల్‌ (1/18), శివమ్‌ మావి (1/32)తోపాటు చక్రవర్తి, నాగర్‌కోటి, నరైన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. త్రిపాఠికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. 

వాట్సన్‌ మెరిసినా..: ఛేదనలో ఓపెనర్‌ డుప్లెసి (17) స్వల్ప స్కోరుకే అవుటైనా.. మరో ఓపెనర్‌ వాట్సన్‌, రాయుడు (30) బాధ్యతాయుతంగా ఆడారు. నాలుగో ఓవర్‌లో డుప్లెసిని అవుట్‌ చేసిన శివమ్‌ మావి.. తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన రాయుడు.. వాట్సన్‌కు మంచి సహకారం అందించాడు. ఆరో ఓవర్‌లో శివమ్‌ బౌలింగ్‌లో వాట్సన్‌ 4,6తో గేర్‌ మార్చడంతో.. పవర్‌ప్లే ముగిసే సమయానికి చెన్నై 54/1తో నిలిచింది. మరోవైపు రాయుడు వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు బాదడంతో పరుగుల వేగం ఎక్కడా తగ్గలేదు. అయితే, 13వ ఓవర్‌ తొలి బంతికి రాయుడిని నాగర్‌కోటి క్యాచ్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అర్ధ శతకం పూర్తి చేసిన వాట్సన్‌ను నరైన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో జట్టును గెలిపించే బాధ్యత ధోనీ (11), కర్రాన్‌ (17) జోడీపై పడింది. 16వ ఓవర్‌లో నరైన్‌ బౌలింగ్‌లో కర్రాన్‌ 6,4 బాదడంతో.. సాధించాల్సిన లక్ష్యం 24 బంతుల్లో 44 పరుగులకు దిగి వచ్చింది. కానీ, ధోనీని బౌల్డ్‌ చేసిన చక్రవర్తి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. తర్వాతి ఓవర్‌లో కర్రాన్‌ను రస్సెల్‌ క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన తరుణంలో.. జాదవ్‌ (7 నాటౌట్‌), జడేజా (21 నాటౌట్‌) చివరి వరకు క్రీజులో ఉన్నా గెలిపించలేక పోయారు. 

త్రిపాఠి ఒక్కడే..: సునీల్‌ నరైన్‌ వరుసగా విఫలమవుతుండడంతో.. కోల్‌కతా ఓపెనింగ్‌ జోడీలో మార్పులు చేసింది. గిల్‌కు జోడీగా రాహుల్‌ త్రిపాఠిని టాపార్డర్‌కు ప్రమోట్‌ చేసింది. ఈ అవకాశాన్ని త్రిపాఠి అర్ధ శతకంతో చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతినే త్రిపాఠి ఫోర్‌కు తరలించాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఆ తర్వాతి ఓవర్‌లోనూ మరో రెండు బౌండ్రీలతో స్కోరు వేగం పెంచాడు. అయితే, మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (11) ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన ఠాకూర్‌ (2/28).. గిల్‌ను క్యాచ్‌ అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 37 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్‌ రాణా (9)ను కర్ణ్‌ శర్మ పెవిలియన్‌ చేర్చాడు. రాణాతో కలసి త్రిపాఠి రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించాడు. ఈ తర్వాత వచ్చిన నరైన్‌ (17) ఉన్నంతసేపు స్కోరుబోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు.

బ్రావో వేసిన 10వ ఓవర్‌లో త్రిపాఠి ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేయగా.. నరైన్‌ 6,4 బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు లభించాయి. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో కర్ణ శర్మ బౌలింగ్‌లో  ముందుకు డైవ్‌చేస్తూ జడేజా పట్టిన అత్యద్భుతమైన క్యాచ్‌కి నరైన్‌ వెనుదిరిగాడు. తొలుత క్యాచ్‌ అందుకున్న జడేజా..తాను బౌండరీలైన్‌ను తాకుతానేమోనన్న పరిస్థితుల్లో... చివరి క్షణాల్లో డుప్లెసికి విసరగా, అతనా క్యాచ్‌ని పూర్తిచేశాడు. ఈ దశలో చెన్నై బౌలర్లు పట్టుబిగించడంతో పరుగుల రాక కష్టమైంది. మోర్గాన్‌ (7) ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌కు తరలించాడు. దీంతో 12వ ఓవర్‌లో నైట్‌ రైడర్స్‌ స్కోరు 100 పరుగులు దాటింది. కానీ, 14వ ఓవర్‌లో 5 పరుగులిచ్చిన కర్రాన్‌.. మోర్గాన్‌ను అవుట్‌ చేసి కోల్‌కతాను గట్టి దెబ్బకొట్టాడు. సహచరులు వెనుదిరుగుతున్నా త్రిపాఠి మాత్రం ధాటిగానే ఆడాడు. చాహర్‌ వేసిన 15వ ఓవర్‌లో 4,6తో ఎదురుదాడి చేశాడు. కాగా, డేంజర్‌మాన్‌ రస్సెల్‌ (2)ను ఠాకూర్‌ పెవిలియన్‌ చేర్చాడు. మిడిలార్డర్‌లో ధాటిగా ఆడే మోర్గాన్‌, రస్సెల్‌ స్వల్ప స్కోర్లకే అవుట్‌ కావడంతో ఆఖర్లో నైట్‌రైడర్స్‌ పుంజుకోలేక పోయింది. 17వ ఓవర్‌ ఐదో బంతికి త్రిపాఠిని బ్రావో క్యాచ్‌ అవుట్‌ చేశాడు. కెప్టెన్‌ కార్తీక్‌ (12), కమిన్స్‌ (17 నాటౌట్‌) ఏడో వికెట్‌కు 22 రన్స్‌ జోడించారు. అయితే, కార్తీక్‌ను కర్రాన్‌ అవుట్‌ చేశాడు. నాగర్‌కోటి (0), శివమ్‌ మావి (0)ని బ్రావో వెనక్కి పంపగా.. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి చక్రవర్తి (1)ని జడేజా రనౌట్‌ చేశాడు. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: రాహుల్‌ త్రిపాఠి (సి) వాట్సన్‌ (బి) బ్రావో 81, శుభ్‌మన్‌ గిల్‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌ 11, నితీష్‌ రాణా (సి) జడేజా (బి) కర్ణ్‌ శర్మ 9, నరైన్‌ (సి) డుప్లెసి (బి) కర్ణ్‌ శర్మ 17, మోర్గాన్‌ (సి) ధోనీ (బి) కర్రాన్‌ 7, రస్సెల్‌ (సి) ధోనీ (బి) ఠాకూర్‌ 2, కార్తీక్‌ (సి) ఠాకూర్‌ (బి) కర్రాన్‌ 12, కమిన్స్‌ (నాటౌట్‌) 17, నాగర్‌కోటి (సి) డుప్లెసి (బి) బ్రావో 0, శివమ్‌ మావి (సి) ధోనీ (బి) బ్రావో 0, వరుణ్‌ చక్రవర్తి (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 167 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-37, 2-70, 3-98, 4-114, 5-128, 6-140, 7-162, 8-163, 9-166; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-47-0, సామ్‌ కర్రాన్‌ 4-0-26-2, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-28-2, కర్ణ్‌ శర్మ 4-0-25-2, డ్వేన్‌ బ్రావో 4-0-37-3. 

చెన్నై: వాట్సన్‌ (ఎల్బీ) నరైన్‌ 50, డుప్లెసి (సి) కార్తీక్‌ (బి) మావి 17, రాయుడు (సి) శుభ్‌మన్‌ (బి) నాగర్‌కోటి 30, ధోనీ (బి) చక్రవర్తి 11, సామ్‌ కర్రాన్‌ (సి) మోర్గాన్‌ (సి) రస్సెల్‌ 17, కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 7, జడేజా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 157/5; వికెట్లపతనం: 1-30, 2-99, 3-101, 4-129, 5-129; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-25-0, శివమ్‌ మావి 3-0-32-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-28-1, నాగర్‌కోటి 3-0-21-1, సునీల్‌ నరైన్‌ 4-0-31-1, రస్సెల్‌ 2-0-18-1.

Updated Date - 2020-10-08T08:42:40+05:30 IST