భళా..రాజస్థాన్‌

ABN , First Publish Date - 2020-09-23T09:23:06+05:30 IST

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ప్రారంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ అందుబాటులో

భళా..రాజస్థాన్‌

ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి  

చెలరేగిన శాంసన్‌, స్మిత్‌, ఆర్చర్‌

డుప్లెసి పోరాటం వృథా


 మైదానం చూస్తే చాలా చిన్నది.. పైగా బ్యాటింగ్‌ పిచ్‌.. ఇంకేముంది.. అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సొమ్ము చేసుకుంటూ సంజూ శాంసన్‌ చెలరేగాడు. బంతి పడిందే ఆలస్యం.. చూడాల్సింది ఆకాశం వైపే అనే తరహాలో ఏకంగా 9 సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఆఖర్లో ఆర్చర్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వడంతో రాజస్థాన్‌ జట్టు చెన్నై ముందు రికార్డు లక్ష్యాన్ని ఉంచగలిగింది. కానీ అత్యంత సీనియర్‌ లైనప్‌ కలిగిన సీఎ్‌సకే మాత్రం తమ బ్యాట్లను ఝుళిపించలేకపోయింది. అయితే డుప్లెసి ఒక్కడే కాస్త పోరాడినా సహకారంకరువైంది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 33 సిక్సర్లతో 416 పరుగులునమోదయ్యాయి.


షార్జా: ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ తమ ప్రారంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ అందుబాటులో లేకపోయినా పటిష్ఠ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 1 ఫోర్‌, 9 సిక్సర్లతో 74), స్మిత్‌ (47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69) అద్భుత ఇన్నింగ్స్‌తో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో ఆర్చర్‌ (8 బంతుల్లో 4 సిక్సర్లతో 27) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. సామ్‌ కర్రాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. డుప్లెసి (37 బంతుల్లో 1 ఫోర్‌, 7 సిక్సర్లతో 72) పోరాడినా ఫలితం లేకపోయింది. తెవాటియాకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు.

వికెట్లు టపటపా

217 పరుగుల రికార్డు లక్ష్యం కోసం బరిలోకి దిగిన చెన్నైని స్పిన్నర్‌ రాహుల్‌ తెవాటియా దెబ్బతీశాడు. కుదురుకుంటున్న దశలో వరుస వికెట్లతో ప్రత్యర్థిని కోలుకోకుండా చేశాడు. ఆరో ఓవర్‌లో షేన్‌ వాట్సన్‌ (33) వరుసగా 6,6,4తో గేరు మార్చడంతో ఇక పరుగుల వరద ఖాయమే అనిపించింది. కానీ ఈ స్థితిలో తెవాటియా అతడిని అవుట్‌ చేసి గట్టి దెబ్బ తీశాడు. ప్యాడ్‌కు తగిలిన బంతి వికెట్ల మీదికి వెళ్లడంతో ఏడో ఓవర్‌లో తను బౌల్డ్‌ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే విజయ్‌ (21)ను మరో స్పిన్నర్‌ గోపాల్‌ అవుట్‌ చేశాడు. ఇక తెవాటియా తొమ్మిదో ఓవర్‌లో ధాటిగా ఆడుతున్న సామ్‌ కర్రాన్‌ (17), రుతురాజ్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో సీఎస్‌కే తొలి 10 ఓవర్లలో 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేదార్‌ జాదవ్‌ (22) హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 

డుప్లెసి పోరాటం

13.5 ఓవర్‌లో ధోనీ బరిలోకి దిగగా అప్పటికి 38 బంతుల్లో 103 పరుగులు కావాలి. మరో ఎండ్‌లో డుప్లెసి కూడా ఉండడంతో చెన్నై ఆశలు వదులుకోలేదు. 15వ ఓవర్‌లో డుప్లెసి రెండు సిక్సర్లతో 16 పరుగులు రాబట్టినా సాధించాల్సిన రన్‌రేట్‌ 20కి పైగా వెళ్లింది. అటు ధోనీ నిదానంగా ఆడుతూ నిరాశపరిచినా 17వ ఓవర్‌లో డుప్లెసి మూడు సిక్సర్లతో 21 రన్స్‌ సాధించాడు. 29 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక 12 బంతుల్లో 48 రన్స్‌ అవసరం కాగా ప్రతీ బాల్‌ ఫోర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్చర్‌ ఓవర్‌లో భారీ సిక్సర్‌ సాధించాక డుప్లెసి.. శాంసన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఆశలు ఆవిరయ్యాయి. చివరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించినా ఫలితం లేకపోయింది.

వహ్వా.. శాంసన్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ తొలి మూడు ఓవర్లలో చేసింది 10 పరుగులే. ఆ లోపే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన యశస్వీ జెస్వాల్‌ (6) వికెట్‌ కూడా కోల్పోయుంది. కానీ ఇదంతా తుఫాను ముందు ప్రశాంతతే.. వన్‌డౌన్‌లో దిగిన సంజూ శాంసన్‌ షార్జా మైదానంలో ప్రళయం సృష్టించాడు. దీంతో ఆ తర్వాత ఆరు ఓవర్లలోనే మరో 90 పరుగులు చేయగలిగింది. పేస్‌, స్పిన్‌ అనే తేడా లేకుండా నలువైపులా తన బ్యాట్‌ను ఝుళిపిస్తూ సిక్సర్ల హోరు సృష్టించాడు. ఐదో ఓవర్‌లో వరుసగా 4,6,6తో బాదడం ఆరంభించిన తను తర్వాత పీయూష్‌ వేసిన ఓవర్‌లోనైతే ఏకంగా నాలుగు సిక్సర్లతో అదరగొట్టి 28 రన్స్‌ రాబట్టాడు. అటు 19 బంతుల్లోనే అర్ధసెంచరీని కూడా పూర్తి చేశాడు. తనకు ఈ ఫార్మాట్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్‌ స్మిత్‌ జత కలిశాడు. ఓవరాల్‌గా తొమ్మిది సిక్సర్లతో చుక్కలు చూపించిన అతడి పరుగుల ప్రవాహానికి 12వ ఓవర్‌లో ఎన్‌గిడి బ్రేక్‌ వేశాడు. డీప్‌ కవర్‌లో చాహర్‌ క్యాచ్‌ తీసుకోగా రెండో వికెట్‌కు 57 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్‌లో రుతురాజ్‌ సూపర్‌ త్రోతో మిల్లర్‌ రనౌటయ్యాడు. ఊతప్ప(5) నిరాశపరిచాడు. 

ఆఖరి ఓవర్‌లో 30

17 నుంచి 19 ఓవర్ల మధ్యలో కేవలం 20 పరుగులకే తెవాటియా (10), పరాగ్‌ (6), స్మిత్‌ వికెట్లను కోల్పోయిన రాజస్థాన్‌ స్కోరు 200లోపే ముగుస్తుందని అంతా భావించారు. అనూహ్యంగా ఆఖరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌ శివాలెత్తాడు. ఎన్‌గిడి వేసిన ఈ ఓవర్‌లో అతడు వరుసగా 6,6,6,6తో వణికించాడు. ఇందులో లాంగాన్‌లో బాదిన రెండో సిక్సర్‌ అయితే మైదానం బయటికి వెళ్లింది. ఆ తర్వాత రెండు బంతులను నోబాల్‌గా వేసినా అతను వదల్లేదు. దీంతో జట్టు మొత్తం 30 పరుగులు రాబట్టి చెన్నైకి షాక్‌ ఇచ్చింది.


1 ఐపీఎల్‌ చరిత్రలో చెన్నైపై తొలి 10 ఓవర్లలో ఎక్కువ పరుగులు (119) చేసిన జట్టు రాజస్థాన్‌.


2. రాజస్థాన్‌ తరపున వేగంగా (19 బంతుల్లో) అర్ధసెంచరీ చేసిన రెండో ఆటగాడు శాంసన్‌. బట్లర్‌ (18 బంతుల్లో)ది తొలిస్థానం.


33. ఈ మ్యాచ్‌లో నమోదైన సిక్సర్లు. ఐపీఎల్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు నమోదవడం ఇది రెండోసారి. అంతకుముందు 2018లో బెంగళూరు, చెన్నై మధ్య మ్యాచ్‌లోనూ 33 సిక్సర్లు నమోదయ్యాయి. 


స్కోరుబోర్డు

రాజస్థాన్‌ రాయల్స్‌: జైస్వాల్‌ (సి అండ్‌ బి) చాహర్‌ 6, స్మిత్‌ (సి) జాదవ్‌ (బి) సామ్‌ కర్రాన్‌ 69, శాంసన్‌ (సి) చాహర్‌ (బి) ఎన్‌గిడి 74, మిల్లర్‌ (రనౌట్‌) 0, ఊతప్ప (సి) డుప్లెసి (బి) చావ్లా 5, తెవాటియా (ఎల్బీ) సామ్‌ కర్రాన్‌ 10, పరాగ్‌ (సి) ధోనీ (బి) సామ్‌ కర్రాన్‌ 6, టామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 10, ఆర్చర్‌ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 216/7; వికెట్ల పతనం: 1-11, 2-132, 3-134, 4-149, 5-167, 6-173, 7-178; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-31-1; సామ్‌ కర్రాన్‌ 4-0-33-3, ఎన్‌గిడి 4-0-56-1, జడేజా 4-0-40-0, చావ్లా 4-0-55-1. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌: విజయ్‌ (సి) టామ్‌ కర్రాన్‌ (బి) గోపాల్‌ 21, వాట్సన్‌ (బి) తెవాటియా 33, డుప్లెసి (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌ 72, సామ్‌ కర్రాన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తెవాటియా 17, గైక్వాడ్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) తెవాటియా 0, కేదార్‌ జాదవ్‌ (సి) శాంసన్‌ (బి) టామ్‌ కర్రాన్‌ 22, ధోనీ (నాటౌట్‌) 29, జడేజా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 200/6; వికెట్లపతనం: 1-56, 2-58, 3-77, 4-77, 5-114, 6-179; బౌలింగ్‌: ఉనద్కత్‌ 4-0-44-0, ఆర్చర్‌ 4-0-26-1, గోపాల్‌ 4-0-38-1, టామ్‌ కర్రాన్‌ 4-0-54-1, తెవాటియా 4-0-37-3.

Updated Date - 2020-09-23T09:23:06+05:30 IST