అందరినీ ఆదుకుంటాం

ABN , First Publish Date - 2022-05-10T17:46:22+05:30 IST

స్థానిక రాజా అన్నామలైపురం (ఆర్‌ఏ పురం) గోవిందసామినగర్‌లో స్థలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్ల కూల్చివేత వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున

అందరినీ ఆదుకుంటాం

ఆర్‌ఏపురం నిర్వాసితులకు ప్రత్యామ్నాయ గృహాలు

మైలాపూర్‌, మందవెల్లిలో ఏర్పాటు

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి రూ.10లక్షల సాయం

శాసనసభలో సీఎం స్టాలిన్‌ ప్రకటన


చెన్నై: స్థానిక రాజా అన్నామలైపురం (ఆర్‌ఏ పురం) గోవిందసామినగర్‌లో స్థలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్ల కూల్చివేత వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఏళ్ల తరబడి నివసిస్తున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించి, గృహాలను కూల్చివేయడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్థానికులు అధికారుల తీరును నిరశిస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారం అసెంబ్లీకి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వంలోనూ స్పందన వచ్చింది. అధికారులు కూల్చిన ఇళ్లకు ప్రత్యామాయ స్థలాల్లో ఇళ్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఆదివారం అక్కడి ఆక్రమిత ఇళ్ళను కూల్చివేసే సమయంలో ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స ఫలించక మృతి చెందిన పీఎంకే కార్యకర్త కన్నయ్య కుటుంబీకులకు రూ.10 లక్షల సాయం అందజేస్తామని ఆ యన తెలిపారు.


శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడు పన్నీర్‌సెల్వం ఆర్‌ఏ పురం ఇళ్ళ తొలగింపు అంశంపై సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ ప్రాంతంలో ఇళ్ళ కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని, ఆత్మహత్య చేసుకున్న కన్నయ్య కుటుంబానికి రూ.50లక్షల సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మైలాపూరు శాసనసభ్యుడు వేలు, సీఎల్పీ నేత సెల్వపెరుందగై, పీఎంకే సభ్యుడు జీకే మణి, డీపీఐ సభ్యుడు షానవాజ్‌, తమిళగవాళ్వురిమై కట్చి సభ్యుడు వేల్‌మురుగన్‌ తదితరులు మాట్లాడుతూ... ఆర్‌ఏ పురం నిర్వాసితులకు ప్రత్యామాయ స్థలంలో ఇళ్లను కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ జోక్యం చేసుకుంటూ.. గోవిందసామినగర్‌లో బకింగ్‌హామ్‌ కాలువ స్థలాన్ని ఆక్రమించి 366 ఇళ్ళ ను నిర్మించుకుని యేళ్ళతరబడి నివసిస్తున్నారని తెలిపారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమిత స్థలంలో ఇళ్ళను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా, నిర్వాసితులు ఆందోళనకు గారని, ఆ సందర్భంగా కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ సంఘటన తనకు తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.


ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతామన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను పాటించి అక్కడి ఇళ్లను తొలగించడం మినహా మరో మార్గం లేదని చెప్పారు.  ఇకపై ప్రభుత్వ స్థలాలను, నీటివనరులకు చెందిన స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్ళలో ఉన్నవారికి ముందుగానే ప్రత్యామ్నాయ స్థలాల్లో ఇళ్లను కేటాయించిన తర్వాతే ఆక్రమణలు తొలగిస్తామని వివరించారు. ఆర్‌ఏ పురం నిర్వాసితులకు రాష్ట్ర నగరాభివృద్ధి గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోని మందవెల్లి, మైలాపూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో ఇళ్ళను కేటాయిస్తామని స్టాలిన్‌ ప్రకటించారు.


ప్రేమలత పరామర్శ

ఆర్‌ఏపురం గోవిందసామినగర్‌లో డీఎండీకే కోశాధికారి ప్రేమలత పార్టీ ప్రముఖులతో సోమవారం ఉదయం పర్యటించారు. ఆ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న నిర్వాసితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ... యేళ్ళతరబడి నివసిస్తున్నవారిని కోర్టు ఉత్తర్వులను సాకు గా పెట్టుకుని ఇళ్ళను కూల్చివేయడం గర్హనీయమన్నారు. ఇదే విధంగా నామ్‌తమిళర్‌ కట్చి నాయకుడు సీమాన్‌, పార్టీ ప్రముఖులు కూడా నిర్వాసితులను పరామర్శించారు.


కొనసాగుతున్న ఆందోళన

ఆర్‌ఏపురం గోవిందసామినగర్‌లో ఇళ్ళ ను కోల్పోయినవారంతా సోమవారం ఆందోళన కొనసాగించారు. వీఽఽఽధిలోనే పిల్లాపాపలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమారు 200 మంది పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు. ఇదిలా ఉండగా ఆరేఎపురం ఆక్రమణల తొలగింపుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. ఈ కేసును అత్యవసరంగా భావించి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.


వచ్చే నెలలో విదేశాలకు స్టాలిన్‌

 ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ జూన్‌ నెలాఖరులో బ్రిటన్‌, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. విదేశీ పారిశ్రామిక పెట్టుబడుల సమీకరణ కోసం ఈ రెండు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విదేశీ పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులను ఆయన కలుసుకోనున్నారు. జూన్‌నెలాఖరులో ఆయన బ్రిటన్‌ రాజధాని లండన్‌లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత జూలైలో అమెరికా పర్యటన ప్రారంభించనున్నారు.. ఈ రెండు దేశాల్లో స్టాలిన్‌ ఎన్నిరోజులపాటు పర్యటించనున్నారనే విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవల దుబాయ్‌, యూఏఈ పర్యటనలో స్టాలిన్‌ విదేశీ పెట్టుబడులను విరివిగా సమీకరించిన విషయం తెలిసిందే.

Read more