చెన్నై: ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎండార్స్ చేసిన ఓ నగల దుకాణం వందలాదిమందిని నిలువునా ముంచేసింది. రూ. 26 కోట్ల మేర మోసగించింది. కేరళ ఫ్యాషన్ జువెల్లరీ (కేఎఫ్జే) 1,689 మంది నుంచి వివిధ పథకాల పేరుతో రూ. 26 కోట్లు సేకరించి అనంతరం మోసగించింది. ఈ కేసుకు సంబంధించి కేఎఫ్జేకు చెందిన ఇద్దరు ప్రమోటర్లను చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. 2016-2019 మధ్య వివిధ గోల్డ్ స్కీమ్‌ల పేరుతో ఖాతాదారుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించారు. సోదరులైన సంస్థ ఎండీ సుజీత్ చెరియన్, డైరెక్టర్ సునీల్ చెరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖాతాదారులను మోసం చేసిన కేసులో సోదరులిద్దరినీ అరెస్ట్ చేసినట్టు డీస్పీ (ఆర్థిక నేర విభాగం) సురేశ్ ధ్రువీకరించారు. కోర్టు వీరికి బెయిలు నిరాకరించిందని తెలిపారు. వీరిపై 2019లోనే మోసం, నేరపూరిత చర్య వంటి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
వీరి అరెస్టుతో పోయిన సొమ్ము వెనక్కి వస్తుందని బాధిత ఖాతాదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేఎఫ్జే అందిస్తున్న వివిధ గోల్డ్ స్కీమ్‌లను ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎండార్స్ చేయడం గమనార్హం. ఖాతాదారుల నుంచి సేకరించిన నిధులను బినామీలు, స్నేహితులకు మళ్లించినట్టు ఆరోపణలున్నాయి.