ఘోరం.. పదో తరగతి బాలిక సజీవదహనం

ABN , First Publish Date - 2020-05-12T16:27:31+05:30 IST

పదో తరగతి చదువుతూ ఉజ్వల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ బాలికకు పదిహేనేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి...

ఘోరం.. పదో తరగతి బాలిక సజీవదహనం

  • పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన దుండగులు
  • అన్నాడీఎంకే కార్యకర్తలే కారణం 
  • బాధితురాలి వాంగ్మూలం 
  • కఠినంగా శిక్షిస్తాం: సీఎం 
  • రూ.5 లక్షల పరిహారం ప్రకటన

చెన్నై: పదో తరగతి చదువుతూ ఉజ్వల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ బాలికకు పదిహేనేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. పాత కక్షలకు ఆ చిన్నారి బలైపోయింది. బాలికను కట్టేసి, పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసేందుకు పాల్ప డ్డారు ఇద్దరు దుర్మార్గులు.  కరోనా విపత్కర సమయంలో విల్లుపురం లో జరిగిన ఘోరానికి సంబంధించి వివరాలిలా...  విల్లుపురం సమీపం లోని సిరుమదురై గ్రామానికి చెందిన జయపాల్‌ కుమార్తె జయశ్రీ (15) ఆదివారం మధ్యాహ్నం తన తండ్రి నడుపుతున్న చిల్లర దుకాణంలో కాలిన గాయాలతో పడి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు వెంటనే విల్లుపురం ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు.


ప్రాథమిక చికిత్స అనంతరం బాలికను మెరుగైన చికిత్స కోసం చెన్నై కీల్పాక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తిరువెన్నయలూర్‌ పోలీసులు బాలికను విచారించగా, అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్‌ మురుగన్‌, మరో కార్యకర్త కలియపెరుమాళ్‌ తన చేతులు కట్టివేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్టు వాంగ్మూలంలో తెలిపింది. ఇదిలా ఉండగా, కీల్పాక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక సోమవారం చికిత్స ఫలించక మృతిచెందింది. పాతకక్షల కారణంగా ఈ సంఘటన జరిగి ఉండొచ్చని బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు మురుగన్‌, కలియపెరుమాళ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.


పార్టీ నుంచి తొలగింపు.. సీఎం

బాలికను పెట్రోల్‌ పోసి హత్య చేసేందుకు ప్రయత్నించిన మురుగన్‌, కలియ పెరుమాళ్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్ట్లు అన్నాడీఎంకే అధిష్ఠానం సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం ఎడప్పాడి పళనిస్వామి స్పందిస్తూ.. ఈ ఘోర సంఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని, బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసి, రూ.5లక్షల పరిహారం ప్రకటించారు.


బాలల హక్కుల సంఘం నోటీసు

ఇదిలా ఉండగా.. విల్లుపురం విద్యార్థిని దారుణ హత్యపై వారంలోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాతీయ బాలల హక్కుల భద్రతా కమిషన్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసు జారీ చేసింది. ఘటనపై కమిషన్‌ సుమోటోగా  కేసును నమోదు చేసుకుంది. మరోవైపు, బాలిక హత్యపై రాష్ట్రంలోని మహిళా సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను ఉరి తీయాలని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-12T16:27:31+05:30 IST