నగరం నిర్మానుష్యం

ABN , First Publish Date - 2022-01-07T13:58:55+05:30 IST

కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి కర్ఫ్యూ మొదలైంది. కర్ఫ్యూపై ముందుగానే అవగాహన కల్పించడంతోపాటు గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాత్రి 10 గంటలకే రోడ్లపై జ

నగరం నిర్మానుష్యం

- రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ షురూ

- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు


అడయార్‌(చెన్నై): కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రాత్రి కర్ఫ్యూ మొదలైంది. కర్ఫ్యూపై ముందుగానే అవగాహన కల్పించడంతోపాటు గత అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రాత్రి 10 గంటలకే రోడ్లపై జనం కనిపించకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఈ కర్ఫ్యూ తదుపరి ఉత్తర్వులు వెల్లడయ్యేంత వరకు కొనసాగనుంది. ఈ కర్ఫ్యూ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 60 వేల మంది బలగాలను రంగంలోకి దింపింది. ఒక్క చెన్నై నగరంలోనే పది వేల మంది పోలీసులు మోహరించారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన తాంబరం, ఆవడి పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో కూడా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి రాత్రి కర్ఫ్యూ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ కర్ఫ్యూను కఠినంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ శైలేంద్రబాబు అన్ని కార్పొరేషన్‌ కమిషనర్లు, ఐజీలు, డీఐజీలు, జిల్లా ఎస్పీలు, తాలూకా డీఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో ప్రవేశించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, వారి అత్యవసర ప్రయాణానికి గల కారణాలను వివరిస్తూ తగిన ఆధారాలతో కూడిన పత్రాలున్నవారిని మాత్రం పోలీసులు అనుమతి చ్చారు. అలాగే, రైలు, విమాన ప్రయాణీకులను మాత్రం టిక్కెట్‌ పరిశీలించి పంపించేశారు. అలాగే, జిల్లా సరిహద్దుల్లో కూడా ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ప్రభుత్వం అనుమతించినవి మినహా ఇతర వాహనాలను జిల్లాలోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. ప్రతి చెక్‌పోస్ట్‌ వద్ద కోవిడ్‌ మార్గదర్శకాలకు లోబడి పోలీసులు ఏర్పాట్లు చేశారు. కర్ఫ్యూ తొలిరొజు కావడంతొ కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై స్వల్పంగా వాహనాలు కనిపించాయి. 


ఉదయం నుంచే పలచగా..

కొంత కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ గురువారం ఉదయం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో టి.నగర్‌, ప్యారీస్‌, పురుషవాక్కం, వడపళని వంటి రద్దీప్రాంతాల్లో జనం పలుచగా కనిపించారు. నిత్యం రద్దీగా ఉండే ఫ్లవర్‌ బజార్‌ వీధులు సైతం అరకొర జనంతో కనిపించాయి. ఇక ఎంటీసీ బస్సులు సైతం తక్కువమంది ప్రయాణీకులతో పరుగులు పెట్టాయి. ఇదిలా వుండగా ఈ నెల 20వ తేదీ వరకు కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో ఆయా విద్యాలయాలకు చెందిన హాస్టళ్లను మూసి వేయడంతో విద్యార్థులు గురువారం ఇళ్లకు బయలుదేరారు.

 

10 గంటలకే మూతబడిన దుకాణాలు 

ఒక్క చెన్నైలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటలకు అన్ని రకాల వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, షాపులు మూత పడ్డాయి. రాత్రి 8 గంటల నుంచే స్థానిక పోలీసులు వాహనాల్లో పెట్రోలింగ్‌ చేస్తూ, పది గంటలలోపే దుకాణాలను మూసివేయాల్సిందిగా లౌడ్‌ స్పీకర్లలో ప్రచారం చేశారు. రాత్రి 10 గంటలకు పైగా దుకాణాలు మూసి వేయని వ్యాపారులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.  


అలాంటి వారికి మినహాయింపు 

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి కర్ఫ్యూ డ్యూటీకి అనారోగ్యంతో పాటు ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడే పోలీసులకు మినహాయింపునిచ్చారు. ఇలాంటివారికి స్టేషన్లలోనే విధులు నిర్వహించేలా పోలీస్‌ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధులకు వెళ్లే పోలీసులు మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించాలని ఆదేశించారు. అలాగే, ఈ పోలీసులు షిప్టుల్లో పనిచేసేలా డీజీపీ శైలేంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేక చెక్‌పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీసులు కరోనాపై ప్రచారం కూడా చేశారు.  

Updated Date - 2022-01-07T13:58:55+05:30 IST