Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 08:35AM

మళ్లీ జలదిగ్బంధంలో Chennai

                    - 14 జిల్లాలకు నేడు రెడ్‌ అలర్ట్‌


చెన్నై: ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తూత్తుకుడి, కోయంబత్తూరు, నీలగిరి, తిరునల్వేలి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. డెల్టా జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని పలుచోట్ల శుక్రవారం అర్ధరాత్రి నుండి శనివారం వేకువజాము దాకా కుండపోత వర్షం కురిసింది. టి.నగర్‌, కేకేనగర్‌, మాంబళం, కోయంబేడు, వడపళని, కోడం బాక్కం, విరుగంబాక్కం, సాలిగ్రామం, నుంగంబాక్కం, చూళైమేడు, పురుషవాక్కం, పులియంతోపు, ఎగ్మూరు, వేళచ్చేరి, మేడవాక్కం, అన్నానగర్‌, ముగప్పేర్‌, వేప్పేరి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. పూందమల్లి హైరోడ్డు, పోలీసు కమిషనర్‌ కార్యాలయపు ప్రాంతం, అన్నాసాలై, రాయపేట హైరోడ్డు, తరమణి ఐటీ హైవే తదితర ప్రధాన రహదారులలో ఒకటి నుంచి మూడు అడుగుల లోతున వర్షపు నీరు వరదలా ప్రవహించింది. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పులియంతోపు, ఓట్టేరి, మాధవరం, వడపెరుం బాక్కం, వేళచ్చేరి, మడిపాక్కం వంటి పల్లపు ప్రాంతాలు వర్షపునీటితో దీవులుగా మారాయి. గూడువాంజేరి, ఊరపాక్కంలో 800 ఇళ్లు నీటమునిగాయి. ఆ ఇళ్లలోని వారిని పడవల ద్వారా అగ్నిమాపక దళం సభ్యులు, పోలీ సులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరంలో లక్షకు పైగా వీథులుండగా సుమారు ఆరువందల వీధుల్లో అడుగులోతు వర్షపునీరు మురుగునీటితో కలిసి  ప్రవహిం చింది. నగరంలోని 75 ప్రాంతాల్లో కార్పొరేషన్‌ అధికారులు మోటారు పంపులతో వాననీటి తొలగింపు పనులను చేపడుతున్నారు. వర్షబాధిత ప్రాంతాల నుండి కార్పొరేషన్‌ అధికారులు 653 మందిని ఆరు ప్రత్యేక శిబిరాలకు తరలించారు. వీరికి మూడు పూటలా అన్నపానీయాలు అందిస్తున్నారు.


9 రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దు

నగరంలో తొమ్మిది ప్రధాన రహదారులలో వర్షపునీరు రెండడుగులకు పైగా ప్రవహిస్తుండటంతో ఆ రహదారుల్లో వాహనాల రాకపోకలను ట్రాఫిక్‌ పోలీసులు రద్దు చేశారు. కేకే నగర్‌ రాజమన్నార్‌ రహదారి జలమయం కావడంతో ఆ మార్గంలో వెళ్ళాల్సిన వాహనాలను సెకండ్‌ అవెన్యూ రహదారిమీదుగా మళ్ళించారు. వలసరవాక్కం మెగామార్ట్‌ రహదారిలో ట్రాఫిక్‌ను రద్దు చేశారు. ఆర్కాడు రహదారికి వెళ్ళాల్సిన వాహనాలను కేశవర్థిని రహదారి మీదుగా మళ్ళించారు. టి.నగర్‌ వాణీమహల్‌ నుంచి బెంజ్‌పార్కు వరకూ రహదారిలో వర్షపునీరు చేరటంతో ఆ వైపు వెళ్ళాల్సిన వాహనాలను హబీబుల్లా రోడ్డు మీదుగా నడుపుతున్నారు. కేకేనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న అన్నా మెయిన్‌రోడ్డులో వాననీటి కాల్వల మరమ్మతు జరుగుతుండటం, రహదారిలో వర్షపునీరు చేరటంతో ఉదయం థియేటర్‌ వైపువెళ్లే వాహనాలను ఎదురుదిశ రహదారి మీదుగా నడుపుతున్నారు. ఉదయం థియేటర్‌ జంక్షన్‌, కాశిథియచేటర్‌ జంక్షన్‌ నుంచి అన్నా మెయిన్‌రోడ్డు వైపు వెళ్లే భారీ వాహనాలను అశోక్‌నగర్‌ పిల్లరై వైపు నడుపుతున్నారు. మేడవాక్కం నుంచి చోళింగనల్లూరు వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రామ్‌నగర్‌ మెయిన్‌రోడ్డు జలమయం కావడంతో మడిపాక్కం నుంచి రామ్‌నగర్‌ మీదుగా వేళచ్చేరి వెళ్లే బస్సుల రాకపోకలను రద్దు చేశారు. కీళ్‌కట్టలై నుంచి తిరువాన్మియూరు వెళ్లే బస్సులు మేడ వాక్కం జంక్షన్‌ రోడ్డు, పళ్ళికరనై మీదుగా నడుపుతున్నారు. కోడంబాక్కం రంగరాజపురంలో ద్విచక్రవాహనాలు వెళ్లే సబ్‌వేలో వర్షపునీరు చేరటంతో ఆ సబ్‌వేలో వాహనాల రాకపోకలను రద్దు చేశారు. టి.నగర్‌ మేడ్లీ సబ్‌వేలో వర్షపునీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఆ సబ్‌వేలోనూ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.


ఓఎంఆర్‌లో వరద దృశ్యాలు

తిరుప్పోరూరు ప్రాంతంలోని పడూరు, తయ్యూరు చెరువులు భారీ వర్షాలకు నిండిపోయాయి. ప్రస్తుతం ఆ చెరువుల నుంచి ప్రవహిస్తున్న జలాలు పాత మహాబలిపురం రోడ్డు (ఔమ్మార్‌)పై వరదలా ప్రవహిస్తున్నాయి. తిరుప్పోరూరు - చెంగల్పట్టు మధ్య కరుంబాక్కం చెరువుకట్టలను గుర్తు తెలియని వ్యక్తులు తెగగొట్టడంతో పంటభూములు నీట మునిగాయి. ఇదిలా వుండగా ముడిచ్చూరు - వరదరాజపురంలో పీటీసీ కాలనీ, శశివరదన్‌ కాలనీ, అముదంనగర్‌, అష్టలక్ష్మినగర్‌ ప్రాంతాల్లో మూడువేల ఇళ్లు వాననీటిలో మునిగాయి.  తాంబరం మున్సిపాలిటీ పరిధిలోని గణపతిపురం, రోజా గార్డెన్‌ తదితర ప్రాంతాల్లో వెయ్యి ఇళ్ళ చుట్టూ రెండడుగుల లోతు వర్షపునీరు చుట్టుముట్టింది. 


అంబత్తూరు పారిశ్రామికవాడలో...

అంబత్తూరు పారిశ్రామికవాడలో కుండపోత వర్షానికి 500 ఫ్యాక్టరీలలో వర్షపు నీరు చొరబడింది. దీనితో ఆ ఫ్యాక్టరీలలోని యంత్రాలు, పరికరాలు, ఇనుప సామగ్రి నీటమునిగాయి. 


నీట మునిగిన వెయ్యి ఎకరాల పంట

మైలాడుదురైలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో రైతులు పండించిన వరి పంటలు మూడోసారి నీట మునిగాయి. ఇటీవల రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు మైలాడు దురై సమీపంలోని పొన్నేరు. పాండూరు, మహారాజపురం, అరున్‌మొళిదేవన్‌ తదితర గ్రామాల్లోని ఆ పంటలు నీట మునగటంతో రైతులు ఆందోళన చెందారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కురిసిన కుండపోత వర్షాలకు మరోమారు ఆ పంటలు మునిగిపోవ టంతో తమకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


తిరుచ్చిలో.... : తిరుచ్చిలో శుక్రవారం రాత్రంతా కురిసిన వర్షాలకు 500లకు పైగా నివాసగృహాలలో వర్షపునీరు చొర బడింది.  అగ్నిమాపకదళం సభ్యులు, పోలీసులు, విపత్తుల నివారణ బృందం సభ్యులు ఇళ్ళలోని వారిని రబ్బరు పడవలతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచ్చి కుళుమణి రహదారిలోని సెల్వనగర్‌, అరవిందనగర్‌, సీతాలక్ష్మినగర్‌ ప్రాంతాల్లో కరుమండపం, పొన్‌నగర్‌, ఇనియనూర్‌ వర్మానగర్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లచుట్టూ రెండడుగుల లోతున వర్షపునీరు ప్రవహిస్తోంది. 


నీలగిరిలో విరిగిపడ్డ కొండచరియలు

కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తగిరి పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలకు మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నీలగిరి జిల్లాలో మంజూరు - ఊటీ రహదారిలో కుందా వంతెన సమీ పంలో మూడుచోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇదే విధంగా మంజూరు పరిసరాల్లో పదిచోట్ల కొండచ రియలు, బండరాళ్లు విరిగి రహదారులపై పడ్డాయి.


14 జిల్లాలకు వర్షసూచన

చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీగా వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, కారైక్కాల్‌, నాగపట్టినం, తిరువారూరు, తంజావూరు, పుదుకోట, రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  తిరువణ్ణామలై, కళ్లకుర్చి, కన్నియాకుమారి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.


తూత్తుకుడి జలమయం

తూత్తుకుడి జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. తూత్తుకుడిలోని ముత్తమ్మాళ్‌ కాలనీ, రహమత్‌నగర్‌, ధనశేఖరన్‌నగర్‌, కురింజినగర్‌, రాజీవ్‌నగర్‌, కదిర్‌వేల్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్ళచుట్టూ రెండడుగుల లోతున వర్షపునీరు ప్రవహిస్తోంది. 

Advertisement
Advertisement