నగరాన్ని ముంచెత్తిన వర్షం

ABN , First Publish Date - 2022-06-21T12:51:42+05:30 IST

రాజధాని నగరం చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి 10 గంటల తరువాత చిన్న చిన్న తుంపర్లు పడినప్పటికీ సోమవారం వేకువజామున

నగరాన్ని ముంచెత్తిన వర్షం

- లోతట్టు ప్రాంతాలు జలమయం

- నేలకూలిన వృక్షాలు 


అడయార్‌(చెన్నై), జూన్‌ 20: రాజధాని నగరం చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి 10 గంటల తరువాత చిన్న చిన్న తుంపర్లు పడినప్పటికీ సోమవారం వేకువజామున ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వర్షం పడింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో  వృక్షాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సబ్‌వేల లోకి వర్షపునీరు చేరింది. పలు రహదారుల్లో వర్షపునీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


మరో మూడు రోజులు వర్షం..

మరో మూడు రోజుల పాటు మోస్తరుగా జల్లులు పడతాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని ప్రకటించింది. ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చెన్నైలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. అదేసమయంలో నగరంలో వర్షం పడే సూచనలు లేకపోవడంతో మరికొన్ని రోజులు వేసవితాపాన్ని అనుభవించక తప్పదని నగర వాసులు భావించారు. అయితే, ఆదివారం రాత్రి హఠాత్తుగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఆలందూరు, తాంబరం, మీనంబాక్కం, వడంలూరు, పూందమల్లి, పోరూర్‌, తిరువేర్కాడు, వేలప్పన్‌చావడి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధురవాయల్‌, పూందమల్లి ప్రాంతాల్లో  వర్షపునీరు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 


విద్యుత్‌ సరఫరాకు బ్రేక్‌...

 భారీ వర్షం కారణంగా ఉత్తర చెన్నైలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  తండయార్‌పేట వీఓసీ నగర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడంతో ఆ ప్రాంత వాసులు అంధకారంలో గడపాల్సి వచ్చింది. బలమైన గాలులకు అశోక్‌ నగర్‌లో చెట్లు కూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టి.నగర్‌లోని వెంకటనారాయణ రోడ్డులో కూడా భారీ వృక్షం కూలిపోయింది. ఆ చెట్లను కార్పొరేషన్‌ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. 

Updated Date - 2022-06-21T12:51:42+05:30 IST