టోల్‌ బాదుడు

ABN , First Publish Date - 2020-08-10T11:16:22+05:30 IST

టీడీపీ హయాంలో జిల్లాలో చెన్నై-బెంగళూరు ఫోర్‌లేన్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి.

టోల్‌ బాదుడు

మహాసముద్రం వద్ద తాత్కాలిక టోల్‌గేట్‌  

పనులు పూర్తి కాకనే రుసుం వసూలు  

ఆందోళన చెందుతున్న వాహనదారులు 


 ఆలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది నేషనల్‌ హైవే అధికారుల తీరు. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి కాకనే బంగారుపాళ్యం మండలం మహాసముద్రం వద్ద తాత్కాలిక టోల్‌గేట్‌ ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు వందశాతం పనులు పూర్తయ్యాకే టోల్‌ ఫీజు వసూలు చేయాల్సినా ఒక్కరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. 


చిత్తూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ హయాంలో జిల్లాలో చెన్నై-బెంగళూరు ఫోర్‌లేన్‌ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆ మేరకు రెండు ప్రాజెక్టులకు కోట్ల రూపాయల నిధుల మంజూరు జరిగింది. ఇందులో భాగంగా గుడిపాల మండలం నంగమంగళం నుంచి బంగారుపాళ్యం మధ్య జరిగే పనులకు రూ.450 కోట్లు, బంగారుపాళ్యం నుంచి పలమనేరు మండలం నంగిలి నడుమ జరిగే పనులకు రూ.600కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో బంగారుపాళ్యం-నంగిలి హైవే పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.నంగమంగళం-బంగారుపాళ్యం ప్రాజెక్టు ఏడాది కాలంగా నత్తనడకన నడుస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా చిత్తూరు నగర సమీపంలోని కుక్కలపల్లె క్రాస్‌ నుంచి నంగమంగళం వరకు దాదాపు 25 కి.మీ. రహదారి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కుక్కలపల్లె క్రాస్‌ నుంచి బంగారుపాళ్యం నడుమ అక్కడక్కడా చిన్నపాటి పనులనూ పూర్తి చేయాల్సి ఉంది. వీటిని నేషనల్‌ హైవే అధికారులు పట్టించుకోకుండా బంగారుపాళ్యం మండలం మహాసముద్రం వద్ద తాత్కాలిక టోల్‌గేట్‌ ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీస్తోంది. 


తక్కువ దూరం ప్రయాణం భారమే.. 

చిత్తూరు-బెంగళూరు మార్గంలోని పలమనేరు మండలం నంగిలి వద్ద ఇప్పటికే ఓ టోల్‌గేట్‌ ఉంది. మహాసముద్రంలో రెండోది ఏర్పాటు చేయడం వాహనదారులకు భారంగా మారింది. దీంతో చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఒక్కో గేటు వద్ద రూ.80 వంతున టోల్‌ ఫీజు చెల్లించక తప్పదు. కాగా, చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం బంగారుపాళ్యం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. రెండుప్రాంతాల మధ్య దూరం 20 కి.మీ. ఉండగా, మహాసముద్రం టోల్‌గేటు వద్ద అప్‌అండ్‌డౌన్‌ రూ.80 వంతున ఆయన రూ.160 టోల్‌ ఫీజు చెల్లించారు. అయితే కారుకు అయిన పెట్రోల్‌ ఖర్చుకి సమానంగా రుసుం చెల్లించాల్సి రావడంపై ఆందోళన చెందారు. అప్‌అండ్‌డౌన్‌ ఫీజు ఒకేసారి చెల్లిస్తే రూ.40 ఆదా అయ్యే అవకాశమున్నా, టోల్‌గేట్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదని కారు యజమాని వాపోయారు. దీంతో ఇక మీదట చిత్తూరు నుంచి అరగొండ మీదుగా సింగిల్‌రోడ్డులోనే బంగారుపాళ్యం వెళ్లేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. 


అధికారులు ఏమంటున్నారంటే... 

ఈ రహదారిని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారని,మహాసముద్రం నుంచి నంగిలి వరకు పనులు పూర్తయినట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా పేర్కొన్నారు.దానికి సంబంధించి టోల్‌ వసూలు చేస్తున్నామన్నారు.  అయితే హైవే విస్తరణ పనులు పూర్తి కాకముందు నుంచే నంగిలి వద్ద వసూళ్లు జరుగుతున్నాయి కదా అని గుర్తుచేశారు.ఎన్‌హెచ్‌ఏఐ పీడీ సుధాకర రెడ్డితో మాట్లాడితే చిత్తూరు సమీపంలోని కుక్కలపల్లె క్రాస్‌ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రహదారి పనులు పూర్తయ్యాయన్నారు. నంగమంగళం వరకు పనులు ఆలస్యమవుతున్న కారణంగా.. ఇప్పటివరకు జరిగిన పనులను లెక్కబెట్టి దానికి మాత్రమే టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నామన్నారు.అయితే అక్కడక్కడా పనులూ పూర్తి చేయాల్సి వున్నప్పటికీ టోల్‌ ఫీజు వసూలు చేయడం దారుణమని వాహనదారులు వాపోతున్నారు.

Updated Date - 2020-08-10T11:16:22+05:30 IST