ఉల్లంఘనలపై ఉక్కుపాదం..రాష్ట్రవ్యాప్తంగా 1000 దుకాణాల సీజ్‌

ABN , First Publish Date - 2021-05-17T17:48:11+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ గొలుసుకట్టును తెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా, ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌

ఉల్లంఘనలపై ఉక్కుపాదం..రాష్ట్రవ్యాప్తంగా 1000 దుకాణాల సీజ్‌

చెన్నైలో నిండుకున్ననిత్యావసరాలు?

సంపూర్ణ లాక్‌డౌన్‌తో బోసిబోయిన రోడ్లు 


చెన్నై/అడయార్: రాష్ట్రంలో కరోనా వైరస్‌ గొలుసుకట్టును తెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా, ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఆదివారం మాత్రం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఈ  సమయంలో అత్యవసర పనులపై బయటకు వచ్చే వారిని మాత్రమే  అనుమతించిన పోలీసులు ఇష్టానుసారం రోడ్లపై తిరిగితే ఉపేక్షించేది లేదని లౌడ్‌ స్పీకర్లలో హెచ్చరిస్తూ, ప్రధాన ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా దుకాణాలను సీజ్‌ చేసి వాటి యజమానుల నుంచి రూ.4 కోట్ల మేర అపరాధం రుసుం వసూలు చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు ఒక్క చెన్నై నగరంలోనే సుమారుగా 240 దుకాణాలకు సీల్‌ వేశారు. వ్యాపారులతో పాటు మాస్కులు ధరించని వారి నుంచి అపరాధరుసుంగా రూ.1.44 కోట్లను వసూలు చేసినట్టు చెన్నై నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడి వెల్లడించారు. 


డెల్లా జిల్లాల్లో... 

రాష్ట్రంలో డెల్టా జిల్లాలుగా పేరుగాంచిన తంజావూరు, నాగపట్టణం, తిరు వారూరు, మైయిలాడుదై జిల్లాల్లో ఈ లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేస్తు న్నారు. అయినప్పటికీ దుకాణాలు తెరిచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసు కుంటున్నారు. ఒక్క తంజావూరు జిల్లాలోనే తంజై, పట్టుక్కోట్ట, తిరు వయ్యారు, కుంభకోణం తదితర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచినందుకు 192 దకాణాలను సీజ్‌ చేసి, రూ.1.53 లక్షల   అపరాధ రుసుం వసూలు చేశారు. 


నగరంలో నిండుకున్న సరుకులు?

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నగరవాసులు అప్రమత్తమ య్యారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల మధ్య తమకు కావాల్సిన వంట సామగ్రితో పాటు కూరగాయలు, పాలు వంటి నిత్యావ సరాలు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. నగరం లోని ప్రధాన ప్రాంతాలైన మైలాపూరు, వడపళని, ఎంజీఆర్‌ నగర్‌, కేకే నగర్‌, కోయంబేడు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో కొనుగోలుదారుల రద్దీ అధికంగా కనిపించింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన కిరాణా సరుకులు కూడా చాలా మేరకు ఖాళీ అయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా నగరానికి వచ్చే సరుకు లోడు లారీల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిన విషయం తెల్సిందే. దీనికితోడు నగర వాసులు ముందుగానే భారీ మొత్తంలో కిరాణా సరుకులను కొనుగోలు చేయడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు. 


నిర్మానుష్యంగా రహదారులు 

ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. కేవలం అత్యవసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. అదేసమయంలో పలు రద్దీ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి, నగర వాసుల కదలికలపై గమనించారు.   ముఖ్యంగా మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద అదనపు కమిషనరు కణ్ణన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ బాలకృష్ణన్‌, డిప్యూటీ కమిషనర్‌ శాంసన్‌ డ్రోన్‌ కెమెరాలను వినియోగించి మెరీనా తీరంలో ప్రజల కదలికలను పర్యవేక్షించారు. అదేవిధంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జన సంచారం లేక బోసిపోయి కనిపించాయి.

Updated Date - 2021-05-17T17:48:11+05:30 IST