అంబులెన్సుల్లోనే వైద్యం

ABN , First Publish Date - 2021-05-14T15:45:24+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌తో కూడిన పడకలన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. దీనితో పడకలు లభించక రోగులంతా ఆంబులెన్సులలో

అంబులెన్సుల్లోనే వైద్యం

ఆక్సిజన్‌ పడకలు లేక కరోనా బాధితుల అగచాట్లు

నల్లబజారులో రెమ్‌డెసివిర్‌ అమ్మకాలు


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ఆక్సిజన్‌తో కూడిన పడకలన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. దీనితో పడకలు లభించక రోగులంతా ఆంబులెన్సులలో గంటల తరబడి వేచి వుండాల్సిన దుస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు ముప్పైవేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.  చెన్నైలో ఏడువేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నగరంలోని రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, కీల్పాక్‌ వైద్యకళాశాల ఆస్పత్రి, ఓమండూరార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,323 ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో మూడు పడకలు మాత్రమే ఖాళీగా ఉంటున్నాయి. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 33 వేల 272 ఆక్సిజన్‌ సదుపాయం కలిగిన పడకలుండగా. ప్రస్తుతం 3336 పడకలు మాత్రమే ఖాళీగా ఉంటున్నాయి. తీవ్ర చికిత్సా విభాగంలోని 8325 పడకలలో 509 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.


చెన్నై జీహెచ్‌లో...

నగరంలోని రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోజూ వేల సంఖ్యలో వస్తున్న కరోనా బాధితులను అడ్మిట్‌ చేసుకోలేని పరిస్థితులు దాపురించాయి. ప్రతిరోజూ ర ఈ ఆస్పత్రికి వివిధ ప్రాంతాల నుంచి 50కిపైగా అంబులెన్స్‌లలో కరోనా బాధితులు చికిత్సకోసం తరలివస్తున్నారు. ఆ అంబులెన్స్‌లన్నీ ఉదయమే ఆ ఆస్పత్రికి వద్దకు చేరుకుని వరుసగా నిలిచివుంటున్నాయి. కరోనా వార్డులలో చికిత్స పొందుతున్నవారు డిశ్చార్జి అయినప్పుడో లేక కరోనా బాధితులు చికిత్స ఫలించక మృతి చెందినప్పుడో పడకలు ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే అంబులెన్స్‌లో వేచివున్న కరోనా బాధితులను అడ్మిట్‌ చేసుకుంటున్నారు. బుధవారం అంబులెన్స్‌లలో వెంటిలేటర్స్‌ సాయంతో చికిత్సలందుకున్న కరోనా బాధితులలో ఆరుగురు మృతి చెందారు. ఈ విషయం తెలిసినా తక్కిన అంబులెన్స్‌లలో ఉన్న కరోనా బాధితులు తమకు  ఆక్సిజన్‌ సదుపాయంతో పడకలు తప్పకుండా లభిస్తాయనే ఆశతో గురువారం ఉదయం నుంచి వేచి ఉంటున్నారు. రాయపురంలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కూడా రోజూ వందల సంఖ్యలో కరోనా బాధితులు చికిత్సకోసం తరలివస్తున్నారు. ఆ ఆస్పత్రిలోనూ ప్రస్తుతం పడకలు కొరతగా వున్నాయి. గిండీ కింగ్స్‌ ఆస్పత్రి వద్ద, ఓమందూరార్‌ ఎస్టేట్‌ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. 


చెంగల్పట్టు ఆస్పత్రిలో...

చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రోజురోజుకూ అడ్మిట్‌ అవుతున్న కరోనా బాధితుల సంఖ్య అధికమవుతోంది. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో పడకలు లేక రోగులు నేలపైనే పడుకుని చికిత్సలందుకుంటున్నారు. పలువురు కరోనా బాధితులు సకాలంలో చికిత్సలు పొందలేక తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి ప్రవేశద్వారం మెట్లపైనే నిదురపోతున్నారు. వీరితోపాటు వచ్చిన బంధువుల పరిస్థితికి కూడా దయనీయంగా ఉంటోంది. అటు కరోనా బాధితులకు, ఇటు వారితో సహాయకులుగా వచ్చిన బంధువులకు అన్నపానీయాలు కూడా లభించడం లేదు. దీనితో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


తిరునల్వేలిలో 10 మంది మృతి?

ఇదిలా ఉండగా తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు లభించకపోవడంతో పదిమంది కరోనా బాధితులు మృతి చెందినట్టు తెలుస్తోంది.. అయితే ఈ విషయాన్ని ఆస్పత్రి నిర్వాహకులు ధ్రువీకరించడం లేదు. ఆస్పత్రికి రోజూ వందల సంఖ్యలో కరోనా బాధితులు చికిత్సల కోసం వస్తున్నారని, వీరిలో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు, శ్వాసకోశ సంబంధిత,  హృద్రోగ సంబంధిత సమస్యలున్నవారు ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకే మృతి చెందటం పరిపాటి అని, ఆ కోవలోనే బుధవారం పదిమంది కరోనా బాధితులు మృతి చెంది వుంటారని వివరణ ఇచ్చారు. అయితే మృతుల బంఽధువులు సకాలంలో ఆక్సిజన్‌ పడకులు లభించకపోవడం వల్లే పదిమంది మృతి చెందారని ఆరోపించారు. తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆక్సిజన్‌ సదుపాయంతో కూడిన పడకలు ఖాళీగా లేకపోవడంతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు ఆ నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ కోలుకోలేని కరోనా బాధితులను సైతం ఈ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీనితో ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది.


రాష్ట్రానికి 519 టన్నుల ఆక్సిజన్‌

రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు వీలుగా రోజుకు 519 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజుకు 30 వేలకు పైగా పెరగటంతో వారికి ఆక్సిజన్‌ సదుపాయంతో పడకలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ అంశాలను పరిగణలలోకి తీసుకుని ఆక్సిజన్‌ కోటాను పెంచాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కేంద్రం రాష్ట్రానికి సరఫరా చేస్తున్న ఆక్సిజన్‌ కోటాను 519 టన్నులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హైకోర్టులో ఓ కేసు విచారణకు హాజరైన కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది శంకరనారాయణన్‌ ప్రకటించారు.


బ్లాక్‌లో రెమ్‌డెసివిర్‌ అమ్మిన కేసులో డాక్టర్‌ అరెస్టు

తిరువారూరులో రెమ్‌డెసివిర్‌ మందును రూ.23 వేలకు విక్రయించిన కేసులో డాక్టర్‌ సహా ఇరువురిని సివిల్‌ సప్లయిస్‌ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై రెడ్‌హిల్స్‌లో రెమ్‌డెసివిర్‌ మందును అక్రమంగా తరలిస్తున్న దినేష్‌ అనే యువకుడిని సివిల్‌ సప్లయిస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువ కుడి వద్ద జరిపిన విచారణలో రెమ్‌డెసివిర్‌ మందును తిరువారూరుకు చెందిన డాక్టర్‌ ఆదిపన్‌ నుంచి తాను కొనుగోలు చేసిన నల్లబజారులో అధికధరలకు విక్రయిస్తున్నానని తెలిపారు. దినేష్‌ ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు తిరువారూరుకు వెళ్ళి డాక్టర్‌ ఆదీపన్‌ను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 85 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-05-14T15:45:24+05:30 IST