చెంగల్పట్టు జిల్లాలో కొత్తరకం ‘ఒమైక్రాన్‌’

ABN , First Publish Date - 2022-05-22T12:48:11+05:30 IST

చెంగల్పట్టు జిల్లా నావలూరులో కొత్త రకం వైరస్‌ ఒమైక్రాన్‌ బీఏ4ను గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణ్యం వెల్లడించారు. గిండీలోని కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌లో

చెంగల్పట్టు జిల్లాలో కొత్తరకం ‘ఒమైక్రాన్‌’

              - మంత్రి సుబ్రమణ్యం వెల్లడి 

              - అప్రమత్తమైన వైద్య శాఖ


అడయార్‌(చెన్నై): చెంగల్పట్టు జిల్లా నావలూరులో కొత్త రకం వైరస్‌ ఒమైక్రాన్‌ బీఏ4ను గుర్తించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణ్యం వెల్లడించారు. గిండీలోని కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న వృద్ధుల ఆస్పత్రిని మంత్రి సుబ్రమణ్యం శనివారం పరిశీలించారు. ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగర శివారు ప్రాంతమైన చెంగల్పట్టు జిల్లా నావలూరులోని ఒక కుటుంబంలో ఇద్దరికి కరోనా సోకగా, వారిలో ఒకరికి ఒమైక్రాన్‌ బీఏ4 వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. వారితో సంబంధాలు కలిగిన వారికి కూడా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో ఏ ఒక్కరికీ వైరస్‌ సోకలేదన్నారు. అలాగే, ఈ వైరస్‌ బారినపడిన వారు కూడా త్వరగా కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌ 12వ తేదీన లక్ష ప్రాంతాల్లో మెగా వ్యాక్సిన్‌ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలో రూ.151.17 కోట్లతో నేషనల్‌ ఓల్డ్‌ పీపుల్స్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌ను నిర్మించగా, కరోనా సమయంలో దీనిని 800 పడకలతో కరోనా ఆస్పత్రిగా మార్చామన్నారు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో తిరిగి వృద్ధుల ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులోభాగంగానే ఈ ఆస్పత్రిని తనిఖీ చేయగా, గోడలను తాకితేనే మట్టి రాలుతోందన్నారు. గోడలకు ప్లాసింగ్‌ పనులు సిమెంట్‌తో కాకుండా మట్టితో చేశారన్నారు. ప్రజా పనుల శాఖ ఇంజనీర్లు ఈ భవనాన్ని తనిఖీ చేసి 15 రోజు ల్లో నివేదిక సమర్పించాలని కోరినట్టు మంత్రి తెలిపారు. 

Updated Date - 2022-05-22T12:48:11+05:30 IST