‘చేనేత’ సమస్యల పరిష్కారానికి కృషి: బోస్‌

ABN , First Publish Date - 2021-02-27T06:55:51+05:30 IST

గత ప్రభుత్వ హయాంలో చిలపనూళ్లు సరఫరా చేసే నిమిత్తం మంజూరు చేసిన కార్పస్‌ ఉపసంహరించడంతో ఏర్పడిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ హామీ ఇచ్చారు.

‘చేనేత’ సమస్యల పరిష్కారానికి కృషి: బోస్‌

ద్రాక్షారామ, ఫిబ్రవరి 26: గత ప్రభుత్వ హయాంలో చిలపనూళ్లు సరఫరా చేసే నిమిత్తం మంజూరు చేసిన కార్పస్‌ ఉపసంహరించడంతో ఏర్పడిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ హామీ ఇచ్చారు. రామచంద్రపురం మండలం హసన్‌బాదలో చేనేత సహకార సంఘాల ప్రతినిధి బృందం శుక్రవారం ఆయనను కలిసింది. ఈసందర్భంగా గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన కార్పస్‌ ఫండ్‌ ఉపసంహరించడంతో ఆప్కో అప్పటికే ఎన్‌హెచ్‌డీసీ నుంచి తీసుకున్న చిలపనూళ్ల మొత్తం రూ.16కోట్లు చెల్లించలేకపోయిందని తెలిపారు. దీంతో ఎన్‌హెచ్‌డీసీ చిలపనూళ్లు సరఫరా చేసిన మిల్లులకు బకాయిలు చెల్లించకపోవడంతో సదరు మిల్లులు విజయవాడ కార్యాలయానికి నూళ్ల సరఫరా నిలుపు చేశాయన్నారు. దీంతో కేంద్రం అమలు చేస్తున్న ఎంజీపీ పథకం కింద చిలపనూళ్లు సంఘాలు పొందలేకపోవడం, సంఘాల్లో పనిచేసే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని చేనేత సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌ దొంతంశెట్టి విరూపాక్షం కోరారు. సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తానని చేనేత ప్రతినిఽధి వర్గానికి బోస్‌ హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆదివారపుపేట చేనేత సహకార సంఘం చైర్మన్‌ ఉప్పు అర్థనారీశ్వర బులిరాజు ఉన్నారు.

Updated Date - 2021-02-27T06:55:51+05:30 IST