chemicals: కిచెన్ పాత్రల్లో ఉండే కెమికల్స్ లివర్ క్యాన్సర్ ని పెంచుతాయా?

ABN , First Publish Date - 2022-08-10T20:01:31+05:30 IST

మన వంటగదుల్లో కనిపించేవి స్టీల్, ఇత్తడి, కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ లాంటి రకరకాల వంట పాత్రలు. ఈ పాత్రలు అసలు మన ఆరోగ్యానికి మంచివేనా..?

chemicals: కిచెన్ పాత్రల్లో ఉండే కెమికల్స్ లివర్ క్యాన్సర్ ని పెంచుతాయా?

పాతకాలంలో వంట కోసం మట్టిపాత్రలనే వాడేవారు. కాలం మారుతున్న కొద్దీ వంటగదిలోనూ.. వంట చేసే తీరులోనూ మార్పు వచ్చినట్టు.. వంటపాత్రల ఎంపికలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎక్కువ శాతం మన వంటగదుల్లో కనిపించేవి స్టీల్, ఇత్తడి, కాపర్, అల్యూమినియం, నాన్ స్టిక్ వేర్ లాంటి రకరకాల వంట పాత్రలు. ఈ పాత్రలు అసలు మన ఆరోగ్యానికి మంచివేనా..? అన్నం, కూర, చారు చివరికి టీ కాచేందుకు కూడా నాన్ స్టిక్ పాత్ర వాడాల్సిందేనా..! 


ఇల్లు కట్టినా, కొత్త ఇంటికి మారుతున్నా కిచెన్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు గృహిణులంతా.. వంట ఇంటి అందాన్ని పెంచి, వంట చేసేప్పుడు సౌకర్యం కోసమే వీటిని ఎంచుకుంటారు.  అల్యూమినియం కళాయిల్లో వండే డీప్ ఫ్రైలు, నాన్ స్టిక్ కళాయిల్లో కూరలు చేయడానికి వీలుంటుందనీ, ఆ గిన్నెల లుక్ బావుంటాయని ఎంచుకుంటుంటారు. ఇవి స్టేటస్ సింబల్ గా భావించేవారూ ఉన్నారు. 


అల్యూమినియం(Aluminum), నాన్ స్టిక్(Non stick) వస్తువులతో అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయని తెలియకే చాలామంది ఆడవారు ఈ పాత్రల మోజులో పడుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, కొన్ని కిచెన్‌వేర్(Kitchenware), ఫుడ్ ప్యాకేజింగ్‌లలో సాధారణంగా ఉండే రసాయనాలు బయటకు రావడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు.


ఈ వంటపాత్రలు సాధారణమైన సింథటిక్ రసాయనాలతో తయారుకావడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయని, అల్జీమర్స్‌ (Alzheimer's) పెరుగుతుందని కనుగొన్నారు. రసాయనాలు నాన్-స్టిక్ వంటగది పాత్రలలో ఎక్కువగా ఉండి.., నాన్-వైరల్ హెపాటోసెల్యులర్ కార్సినోమా, సాధారణ కాలేయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 4.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.


అల్యూమినియంతో జీర్ణవ్యవస్థకు హాని

ప్రపంచవ్యాప్తంగా వంటగదుల్లో వాడుతున్న అల్యూమినియంతో అల్జీమర్స్‌ ప్రమాదముందని, ఈ పాత్రలలో పదార్థాలను డీప్ ఫ్రై చేసినప్పుడు అల్యూమినియం కంటెంట్ పెరిగే అవకాశం ఉంది. అల్యూమినియం పాత్రల్లో వంట చేయటం వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందట. వీటిని ఎక్కువకాలం వాడితే, షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాధులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలు తేల్చాయి. కొద్దిగా పాతకాలానికి ప్రయాణం కట్టి చాలావరకూ అల్యూమినియం, నాన్ స్టిక్ పాత్రలను వాడకుండా మన ఓల్డ్ మెథడ్ అయిన మట్టి పాత్రల్లోకి దిగిపోయి వంట చేసుకోవడమే నయం. 

Updated Date - 2022-08-10T20:01:31+05:30 IST