Abn logo
Jun 4 2020 @ 04:54AM

ఈ పండు అందం..

మేడిపండు చందం

పండ్లపై రసాయనాల ప్రభావం

కృత్రిమంగా మగ్గబెడుతున్న వ్యాపారులు

జిల్లాలో 11 కేంద్రాల్లో నిల్వలు

మేల్కొనకపోతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం 


ఫలరాజు మామిడి.. పసుపు వర్ణంలో చూస్తూనే తినేయాలని పించేలా ఉంటుంది. కానీ, కాయను కోస్తే ఆసలు విషయం బయటపడుతుంది. పండు లోపల గుజ్జు అస్సలు మగ్గనే ఉండదు. 


అరటి పండ్లు పరిస్థితీ అంతే.. చూసేందుకు కలర్‌ఫుల్‌గా ఉన్నా రుచీపచీ ఉండదు. ఇవే కాదు.. ఆపిల్‌, బొప్పాయి, సపోటా ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల పండ్ల పరిస్థితీ అంతే. మగ్గకుండానే కాయలు ఎలా రంగు మారుతున్నాయనే అనుమానం అందరికీ వస్తుంది. ఇక్కడే ఉందండీ అసలు కిటుకు. ఇదంతా వ్యాపారుల మాయాజాలం. అదెలాగో ఈ కథనం చదవండి.


నెల్లూరు (వైద్యం) జూన్‌ 3 : కొందరు వ్యాపారులు ధనాశతో వివిధ రకాల పండ్లను కృత్రిమ పద్ధతుల్లో మగ్గబెడుతూ వాటికి రసాయనాలు జోడిస్తున్నారు. ఆ పండ్లు తిని ఎంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కరోనా వైరస్‌పై కూడా వీటి ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్టట వ్యవహరిస్తుండటంతో రసాయన పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల నెల్లూరులో మున్సిపల్‌ హెల్త్‌ అధికారి ఓ పండ్ల దుకాణంపై దాడి చేసినప్పుడు రసాయనాలతో మగ్గబెడుతున్న పండ్లను గుర్తించారు. 


 రసాయనాలు వినియోగం ఇలా...

అత్యంత ప్రమాదకర కాల్షియం కార్బైడ్‌తోపాటు ఇథిలిన్‌, సల్ఫర్‌ తదితర రసాయనాలను ఈ పండ్లను మగ్గించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో ఆ పండ్లలో ఉన్న పోషకాలు కరగడమే కాకుండా అవి విషపూరితం అవుతాయి. ప్రత్యేకంగా అరటి పండ్లను మగ్గించేందుకు ఇథిలిన్‌ ద్రావణాన్ని నీళ్లలో కలిపి వాటిపై చల్లడం వల్ల అవి ఆ రసాయనాలతో కృత్రిమంగా మగ్గుతున్నాయి.  అలాగే సపోటాపై కూడా అలాంటి విధానాన్నే అవలంభిస్తున్నారు. బొప్పాయి  మగ్గించేందుకు లిక్విడ్‌తోపాటు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. బత్తాయి పండ్లకు కూడా ఇథిలిన్‌ రసాయనాన్ని వాడుతున్నారు. ప్రత్యేకించి ఈ వేసవిలో అందుబాటులోకి వచ్చే మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ఆపిల్‌లో రంగు కోసం రసాయన సూదిమందు ఎక్కించే పరిస్థితి ఉంది. పుచ్చకాయల్లో ఎరుపు రంగు కోసం కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు.


జిల్లాలో మగ్గబెట్టే కేంద్రాలు 

జిల్లాలో పండ్లను కృత్రిమంగా రసాయనాలతో మగ్గబెట్టే ఏసీ కేంద్రాలు 11 వరకు ఉన్నాయి. నెల్లూరుతో పాటు నాయుడుపేట, ఆత్మకూరు, సూళ్లూరుపేట, కావలి, బుచ్చిరెడ్డిపాళెం, రాపూరు, కలిగిరి తదితర ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ రోజుల తరబడి పండ్లను నిల్వ ఉంచుతారు.  డిమాండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వాటిని రసాయనాలతో మగ్గించి  విక్రయిస్తున్నారు. ప్రతి రోజు 50 టన్నుల వరకు అరటిపండ్లు, మూడున్నర టన్నుల వరకు సపోటా, 10 టన్నుల వరకు ఆపిల్‌, కమలాపండ్లు విక్రయిస్తున్నారు. 


హైకోర్టు తీవ్ర ఆగ్రహం 

రసాయనాలతో పండించే పండ్ల విధానంపై ప్రభుత్వాన్ని  హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ప్రమాదకర కాల్షియం కార్బైడ్‌ను అనేక దేశాలు, రాష్ట్రాలు నిషేధిస్తే ఏపీలో ఇంకా వాటి ద్వారా కాయలను మగ్గబెడుతున్నారని, దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదంటూ నిలదీసింది. ఇలాంటి చర్యలను సహించకూడదని, వెంటనే తీసుకున్న చర్యలేమిటో తమకు తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం 

రసాయన పండ్లు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో వికారం ఏర్పడుతుంది. 


రక్తహీనత, రక్తపోటు వంటి సమస్యలూ తలెత్తుతాయి. 


కాళ్లలో సూదులు గుచ్చినట్లు, అరచేతి, అరకాళ్లలో చర్మంపై రుగ్మతలు ఏర్పడుతాయి. 


తలనొప్పి, అలసట, నరాల సమస్యలు వస్తాయి.


ఊపిరితిత్తులు, మూత్రాశయం వ్యాధులు సంక్రమిస్తాయి. 


మూత్రపిండాలు దెబ్బతినడమేగాక కేన్సర్‌  వచ్చే అవకాశం ఉంది. 


మానసిక వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. 


కనురెప్పల వాపు తదితర కంటి సమస్యలు తలెత్తుతాయి. 


ఈ జాగ్రత్తలు తప్పదు!

రసాయనాలతో మగ్గించే పండ్లపై కొనుగోలుదారులు అవగాహన పెంచుకోవాలి. 


పండ్లపై రసాయనాలకు సంబంధించి మచ్చలు, పొడి ఇంకేమైనా ఉన్నాయా అని పరిశీలించాలి.


తెలియక కొన్న పండ్లు తినే ముందు వేడినీటిలో కాసేపు ఉంచాలి. 


ప్రత్యేకించి మైనపు పూత ఆపిల్‌ను తినే ముందు పైతొక్కను పూర్తిగా తొలగించాలి.


అప్రమత్తత అవసరం.. డాక్టర్‌ గంగాధర్‌, జనరల్‌ ఫిజీషియన్‌ జీజీహెచ్‌

కృత్రిమ రసాయన పండ్ల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గి మెగ్నీషియన్‌, కార్బన్‌ శాతం  ఎక్కువై అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్రధాన అవయవాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు తాజాగా సాధారణ పద్ధ్దతుల్లో పండించిన పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి.


Advertisement
Advertisement
Advertisement