కాలుష్య కోరల్లో మైసమ్మ చెరువు

ABN , First Publish Date - 2020-08-08T05:32:37+05:30 IST

శామీర్‌పేట మండలం యాడారం గ్రామ సమీపంలో ఉన్న మైసమ్మ చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.

కాలుష్య కోరల్లో మైసమ్మ చెరువు

చెరువు సమీపంలోని భూమిలో రసాయన వ్యర్థాలు

వర్షాలకు పైకి తేలి వెదజల్లుతున్న దుర్గంధం

చెరువు నీటిలో రసాయనాలు కలిసి చేపలు మృత్యువాత


మైసమ్మ చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్‌ సంచులు పాతిపెడుతున్నారు. వర్షాలకు కెమికల్స్‌ కరిగి చెరువు నీటిలో కలుస్తున్నాయి. దీనివల్ల చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. సమీప గ్రామాలకు చెరువు నుంచి సరఫరా అవుతున్న నీటిని తాగి జనం వ్యాధుల బారిన పడుతున్నారు.


శామీర్‌పేట రూరల్‌ : 

శామీర్‌పేట మండలం యాడారం గ్రామ సమీపంలో ఉన్న మైసమ్మ చెరువు కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. వర్షాలకు వ్యర్థ రసాయనాలు కొట్టుకు వచ్చి చెరువు నీటిని కలుషితం చేస్తున్నాయి. చెరువు సమీపంలో ఉన్న భూమిలో ఇతర ప్రాం తాల నుంచి తెచ్చిన రసాయనాలతో నింపిన ప్లాస్టిక్‌ సంచులను గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టారు. వానలు కురిసినప్పుడు అవి పైకి తేలి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. రసాయనాలు నీటిలో కరిగి వరద నీటితో కలిసి చెరువులోకి చేరుతున్నాయి.


యాడారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 272లో భాస్కర్‌రావు అనే పట్టాదార్‌కు చెందిన ముప్పావు ఎకరం భూమిలో కెమికల్‌ రసాయనాల సంచులను పాతిపెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాతిపెట్టిన సంచులు బయటకు తేలి ఒక రకమైన వ్యర్థాలు, దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించి ఆందోళనకు గురయ్యారు. ఈ సంచుల నుంచి వచ్చే రసాయనాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎవరు పాతి పెట్టారు?. ఎందుకు పెట్టారనేది ప్రశ్నగా మిగిలింది. 


మృత్యువాత పడుతున్న చేపలు

యాడారం గ్రామ రెవెన్యూపరిధిలోని సర్వేనెంబర్‌ 31, 32, 33లోని సుమారు 56.448 ఎకరాల్లో మైసమ్మ చెరువు విస్తరించి ఉంది. పట్టాదార్‌ భూమిలో పాతిపెట్టిన రసాయనాలు వర్షపు నీటితో కలిసి చెరువులోకి చేరడంతో గతేడాది చెరువులో వేసిన దాదాపు 60వేల చేపలు మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామంలో 12మంది సభ్యులున్న గంగా భవాని మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతియేడు చేప పిల్లలను మైసమ్మ చెరువులో వదులుతామని, రసాయనాలు చెరువులోకి రావడంతో చేపలు మృత్యువాత పడి జీవనోపాధి కోల్పోతున్నామంటున్నారు. 


ప్రస్తుతం చెరువులో ఓ పక్కన కుంటలో చేపలు వేసి పెంచుతున్నా మన్నారు. గ్రామానికి చెందిన 35 మత్స్యకారుల కుటుంబాలు చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయని వారు వాపోతున్నారు.


చేపలు చనిపోతున్నాయి..

మైసమ్మ చెరువు సమీపంలోని భూమిలో రసాయనాలను పూడ్చి పెడుతున్నారు. వర్షం పడిన ప్పుడు కెమికల్‌ నీళ్లు చెరువులోకి వచ్చి చేపలు చనిపోతున్నాయి. మేము చేపలను పెంచుకొని పూట గడిపెటోల్లం. ప్రస్తుతం చెరువులో ఓ పక్కన కుంటలో చేపలు వేసి పెంచుతున్నాం. కలుషిత వ్యర్థాలు చెరువులోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. చెరువు చుట్టూ ఫెన్సింగ్‌ వేయించాలి.

తలారి గోపాల్‌, మత్స్యకారుల సంఘం గ్రామాధ్యక్షుడు, యాడారం


కలుషితమవుతున్న బోరు బావులు

యాడారం గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు రానప్పుడు.. అప్పుడప్పుడు చెరువులోని నీటిని మూడు బోర్‌మోటార్ల ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తుంటారు. దీంతో ఈ కలుషితమైన నీటిని గ్రామస్థులు తాగి చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రసాయనాలతో పూడ్చిన పరిసరాలను పరిశీలించి వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా వాటిని పాతిపెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు.


రసాయనాలను వదులుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం..

యాడారం రెవెన్యూ పరిధిలో ఉన్న మైసమ్మ చెరువులోకి కలుషితమైన రసాయనాలను వదులుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించి చెరువు పరిసరాలను కాపాడుతాం. మత్స్యకారులు చేపలను పెంచుకునే విధంగా చర్యలు చేపడుతాం.                   

 - కన్నయ్య, ఇరిగేషన్‌ ఏఈ, శామీర్‌పేట

Updated Date - 2020-08-08T05:32:37+05:30 IST