వలలో చిక్కి.. విలవిలలాడి...

ABN , First Publish Date - 2021-07-31T05:40:37+05:30 IST

ఆ ముగ్గురు వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అతడు నమ్మాడు.. తెలిసిన వారికి ఈ విషయం చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి రూ.80 లక్షలు ముట్టచెప్పాడు.. కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు.. దీంతో ఆ ముగ్గురిని నిలదీయగా వారి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి..

వలలో చిక్కి.. విలవిలలాడి...
సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం చెబుతున్న కేశవస్వామి

మోసపోయామంటూ దంపతుల ఆత్మహత్య
రూ.80 లక్షలు తీసుకొని నిండా ముంచిన దళారులు
డబ్బులిచ్చిన వారికి ముఖం చూపించలేక మనస్తాపం
సెల్ఫీ వీడియోలో మరణ వాంగ్మూలం రికార్డు చేసి బలవన్మరణం
అనాథలైన ఇద్దరు పిల్లలు... పరకాలలో ఘటన..


పరకాల, జూలై 30: ఆ ముగ్గురు వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అతడు నమ్మాడు.. తెలిసిన వారికి ఈ విషయం చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి రూ.80 లక్షలు ముట్టచెప్పాడు.. కానీ నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాలేదు.. దీంతో ఆ ముగ్గురిని నిలదీయగా వారి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి.. దీంతో మనస్తాపం చెందిన సదరు వ్యక్తి తన భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన  వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.  సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేసి మరీ దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం కలచివేస్తోంది. వారి ఇద్దరు పిల్లలకు మానసిక స్థితి సరిగా లేదు. తల్లిదండ్రుల మృతితో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేశవస్వామి వాంగ్మూలం,   పరకాల సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన మేరకు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి...

వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌ గ్రామానికి చెందిన తాళ్లపెళ్లి కేశవస్వామి (53)కి నర్సంపేటకు చెందిన సంధ్యారాణి (45)తో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లల మానసిక స్థితి సరిగా లేదు. వాస్తవానికి కేశవస్వామి స్వస్థలం ఖానాపురం. అతడి కన్నతల్లిదండ్రులు  మారయ్య, వరలక్ష్మి.  పొనకల్‌ గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రామస్వామి, వీరమ్మ దంపతులకు సంతానం లేక పోవడంతో  కేశవస్వామిని చిన్నవయస్సులో దత్తత తీసుకున్నారు.  15 ఏళ్ల క్రితం కేశవస్వామి కుటుంబంతో సహా హన్మకొండకు వలసవెళ్లాడు. అక్కడ కొద్దికాలం ఉన్న అనంతరం  ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు మారాడు. చిత్ర పరిశ్రమలో లైట్‌బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.  ఆ తర్వాత మళ్లీ రెండేళ్ల క్రితం హన్మకొండకు తిరిగివచ్చి ఓ పెస్టిసైడ్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

ఈ క్రమంలో అతడికి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పని చేస్తున్న పుల్ల బాబు, కాంట్రాక్టర్‌ వాలునాయక్‌, గాడిపెల్లి వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడింది. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని విద్యుత్‌ శాఖలో  కంప్యూటర్‌ ఆపరేటర్‌, అటెండర్‌, సబ్‌ స్టేషన్‌ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతి న ఇప్పిస్తామంటూ వారు కేశవస్వామికి చెప్పారు. వారి మాటల ను నమ్మిన కేశవస్వామి తనకు తెలిసిన పలువురికి ఉద్యోగాల విష యం తెలిపి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇలా రూ.80 లక్షలు ముగ్గురికి అప్పగించాడు. బ్యాంకు ద్వారా  పుల్ల బాబుకు రూ.40 లక్షలు, వెంటేశ్వర్లుకు రూ.17 లక్షలు, నాయక్‌కు రూ.3.24 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేసి మిగతా డబ్బు నగదు రూపంలో ఇచ్చాడు.

అయితే నెలలు గడుస్తున్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు కేశవస్వామిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని కేశవస్వామి పుల్ల బాబు, వాలునాయక్‌, వెంకటేశ్వర్లుకు తెలుపగా, రేపు మాపు అంటూ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. చివరకు కేశవస్వామి గట్టిగా అడగడంతో ముగ్గురూ రివర్స్‌ అయి బెదిరింపులకు దిగారు. డబ్బులు అడిగితే చంపుతామని కేశవస్వామిని బెదిరించారు. వారి తీరుతో కేశవస్వామి తీవ్ర మనస్తాపం చెందాడు. తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు. ముగ్గురి నుంచి డబ్బులు వసూలు చేయలేక,  తమకు డబ్బులిచ్చిన వారికి సమాధానం చెప్పలేక మనోవ్యథకు లోనయ్యాడు. భర్త పరిస్థితిని గమనించిన భార్య సంధ్యారాణి కూడా దిగాలు పడిపోయింది. తమకు చావే శరణమ్యని ఇద్దరూ భావించారు. తాను మోసోయిన తీరును కేశవస్వామి భార్యా పిల్లలతో కలిసి సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. తన సూసైడ్‌ వీడియోను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి పరిగణనలోకి తీసుకొని తనను మోసం చేసిన ముగ్గురిపైన చట్టపరమైన చర్యలు తీసుకోని నిరుద్యోగులకు డబ్బులు ఇప్పించాలని కోరాడు.

పరకాల చర్చిలో ప్రార్థనలు...
గత బుధవారం రోజున కేశవస్వామి, సంధ్యారాణి దంపతులు ఇద్దరు పిల్లలను తీసుకొని పరకాలలోని సీఎ్‌సఐ చర్చికి వచ్చారు. రోజంతా అక్కడే ఉండి ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి సమీపంలో బస చేశారు.  గురువారం రాత్రి మొదట సంధ్యారాణి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్‌సలో పభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  విషయం తెలుసుకున్న కేశవస్వామి ఆస్పత్రికి చేరుకుని భార్య తాగి వదిలేసిన పురుగుల మందును తాగాడు. అక్కడే ఉన్న డాక్టర్లు అతడికి ప్రథ మ చికిత్స అందించి వరంగల్‌ ఎంజీఎంకు రెఫర్‌ చేశారు. అయితే మార్గంమధ్యలోనే కేశవస్వామి సైతం కన్నుమూశాడు. దీంతో అతడి మృతదేహాన్ని కూడా పరకాలకు తీసకువచ్చి ఇద్దరికీ పోస్టుమార్టం చేశారు. అనంతరం పరకాలలోని చలివాగు ఒడ్డున పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.   సంధ్యారాణి సోదరుడు వేముల కృష్ణప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పిల్లలిద్దరికీ మానసిక వైకల్యం

కేశవస్వామి, సంధ్యారాణి దంపతులకు జన్మించిన నిఖిల్‌ సాయివర్ధన్‌, చందనప్రియకు పుట్టుకతోనే మానసిక వైకల్యం ఉంది. పిల్లలు పెద్దవాళ్లయినా వారికి సంధ్యారాణే ఇప్పటికీ సపర్యలు చేస్తోంది. కేశవస్వామి సెల్ఫీ వీడియో రికార్డు చేస్తున్నప్పుడు పిల్లలిద్దరూ ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో కనిపించారు. కేశవస్వామి దంపతుల ఆత్మహత్యతో ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జరిగింది ఏమిటో వారికి తెలియడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే సంబంధం లేని మాటలతో జవాబు ఇస్తున్నారు. ఇద్దరి పరిస్థితిని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారికి ప్రభు త్వం ఆశ్రయం కల్పించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.



Updated Date - 2021-07-31T05:40:37+05:30 IST