దాడి చేసి.. పట్టుబడి.. మృత్యువాత

ABN , First Publish Date - 2020-05-29T09:55:24+05:30 IST

బత్తాయి తోట కంచెలో చిక్కుకున్న చిరుత.. పట్టుకునే క్రమంలో అటవీ అధికారులపై దాడి చేసింది. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు చిరుతను బంధించి.. హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేటతండా గ్రామ శివారులో

దాడి చేసి.. పట్టుబడి.. మృత్యువాత

మర్రిగూడ/మదీన, మే 28 (ఆంధ్రజ్యోతి): బత్తాయి తోట కంచెలో చిక్కుకున్న చిరుత.. పట్టుకునే క్రమంలో అటవీ అధికారులపై దాడి చేసింది. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు చిరుతను బంధించి.. హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందింది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాజుపేటతండా గ్రామ శివారులో గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ రైతు బత్తాయి తోటకు వేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. ఉదయం 9 గంటలకు పులిని గమనించిన రైతులు అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ సయ్యద్‌ అసదుల్లా నేతృత్వంలో జూ పార్కు రెస్క్యూ టీమ్‌ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి మొదట మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. అప్పటికే భయాందోళనకు గురైన చిరుత.. ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేసింది. ఇద్దరికి గాయాలయ్యాయి. అందరూ కేకలు వేయడంతో బెదిరిపోయిన చిరుత పక్కనే ఉన్న అటవీ వాహనం కిందకు దూరిం ది. సీఐ శ్రీనివా్‌సరెడ్డి జీపు పై నిలబడి వలవిసరడం, మరో మత్తు ఇంజక్షన్‌ ఇవ్వడం తో ఎట్టకేలకు పులిని బోనులో బంధించి హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కాగా, చిరుత వయస్సు ఏడేళ్లు ఉంటుందని, అంతర్గత గాయా లు, అధిక రక్తస్రావం, ఎండ వేడి వల్లే మృతి చెం దిందని నెహ్రూ జూపార్కు అధికారులు తెలిపారు.  


నాలుగు నెలల్లో రెండో ఘటన

మర్రిగూడ మండలం అజలాపురం శివారులో ఓ రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో జనవరి 14న చిరుత పడింది. గురువారం రాజుపేటతండా శివారులో మరో చిరుత చిక్కుకోవడం కలకలం రేపిం ది. 4నెలల వ్యవధిలోనే రెండో ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  


బోనకల్‌లో చిరుత కలకలం.. దొరకని ఆనవాళ్లు

చిరుత కనిపించిందన్న ప్రచారంతో ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం చొప్పకట్లపాలెంలో గురువారం కలకలం రేగింది. చిరుత సంచరించిందని చెబుతున్న ప్రదేశాన్ని పోలీసులు, ఫారెస్టు అధికారులు పరిశీలించారు. కానీ వారికి ఎలాంటి ఆనావాళ్లు కనిపించలేదు.  


పారిపోయిన చిరుత ప్రత్యక్షం

గతంలో ఫాంహౌ్‌సలోకి వెళ్లి తప్పించుకుపోయిన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. గురువారం రాత్రి రాజేంద్రనగర్‌లోని పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌ వద్ద చిరు త తిరుగుతున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో నమోదయ్యాయి.  


జనావాసాల్లోకి రాకుండా చర్యలు: ఇంద్రకరణ్‌

హైదరాబాద్‌: వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా మనుషుల సంచారం, వాహనాల శబ్దాల లేకపోవడం వల్లే చిరుత పులులు, ఇతర వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయని చెప్పా రు. అడవి నుంచి వన్యప్రాణులు బయటకు రాకుండా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందుకోసం ఓ విభాగం పని చేస్తుందని వెల్లడించారు. శాఖాహార వన్యప్రాణుల కోసం గడ్డి క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, జనంలోకి వచ్చిన జంతువులను అడవుల్లోకి తరలించేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2020-05-29T09:55:24+05:30 IST