తనిఖీలు నిల్‌.. అక్రమాలు ఫుల్‌

ABN , First Publish Date - 2021-12-06T06:40:53+05:30 IST

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల అలసత్వం రేషన్‌ డీలర్లకు కాసులు కురిపిస్తున్నాయి. రేషన్‌ దుకాణాల్లో పౌరసరపఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో రేషన్‌ డీలర్లు రేషన్‌ బియ్యాన్ని పక్కదారి మళ్లిస్తున్నారు.

తనిఖీలు నిల్‌.. అక్రమాలు ఫుల్‌

 రేషన్‌ దుకాణాల్లో తూతూమంత్రంగా తనిఖీలు

 జిల్లాలో యథేచ్ఛగా రేషన్‌ బియ్యం ఆక్రమ వ్యాపారం

సూర్యాపేట సిటీ, డిసెంబరు 5: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల అలసత్వం రేషన్‌ డీలర్లకు కాసులు కురిపిస్తున్నాయి. రేషన్‌ దుకాణాల్లో పౌరసరపఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో రేషన్‌ డీలర్లు రేషన్‌ బియ్యాన్ని పక్కదారి మళ్లిస్తున్నారు. ప్రతీ నెల జిల్లాలో ఎక్కడో ఒక చోట రేషన్‌  బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుంటున్న  అధికారులు నామ మాత్రంగా  జరిమానాలు విధిస్తూ ఆక్రమార్కులకు   సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 నుంచి 2021 నవం బరు 11 వరకు జిల్లా వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో తనిఖీ చేసిన అధికా రులు కేవలం 63 కేసులు నమోదు చేశారు. అయితే అక్రమంగా పొందిన డబ్బులను రికవరీ చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. 

తనిఖీలు బేజారు..

ప్రజల కోసం పంపిణీ చేయాల్సిన రేషన్‌  బియ్యం, కిరోసిన్‌ ప్రతీ నెల పక్కదారి పడు తున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. లారీల కొద్ది రేషన్‌ బియ్యం పట్టుబడుతున్నా నామమాత్రంగా  జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో 610 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటికి ప్రతీ నెల 9,919.845 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని పౌరసర ఫరాల శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఒక రేషన్‌ కార్డు కు కేజీ  చెక్కర చొప్పున  19,773 కేజీలు, 12 వేల లీటర్లకుపైగా కిరోసిన్‌ సరఫరా చేస్తున్నారు.  ఇవి సక్రమంగా జరగాలంటే రేషన్‌ దుకాణాల్లో ప్రతి నెలా తనిఖీలు చేయాల్సి ఉంది. అయి తే పౌరసరఫరాల శాఖ అధికారులు సంవత్సరానికి 100 రేషన్‌ దుకాణాలను కూడా తనిఖీ చేయడంలేదు. దీంతీ ప్రతీ నెల క్వింటాళ్ల  రేషన్‌ బియాన్ని విక్రయించి అక్రమదారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 610 రేషన్‌ దుకాణాలు ఉంటే 2017 నుంచి 2021 నవంబరు 11 వరకూ కేవలం 298 రేషన్‌ దుకాణాల్లో మాత్రమే అధికారు తనిఖీలు చేశారు.  ఈ ఐదేళ్లలో సగానికిపైగా రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేయకపోవడం పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. .2017 జనవరి నుంచి డిసెంబరు వరకు   జిల్లాలో కేవలం 98 రేష న్‌ దుకాణాల్లో తనిఖీలు చేసిన అధికారులు 20మంది రేషన్‌ డీలర్లపై కేసులు నమోదు  చేశారు. 2018 జనవరి నుంచి డిసెంబరు వరకు 56 రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేసిన అధికారులు కేవలం ఎనిమిది మందిపై కేసు లు నమోదు చేశారు. 2019లో 72 రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేసి 15 మందిపై కేసులు నమోదు చేశారు .2020 లో 69 రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేసి కేవలం నలుగురిపై కేసులు నమోదు చేశారు. 2021 జనవరి నుంచి నవంబరు 11 వరకు కేవలం 83 రేషన్‌ దుకాణాల్లో తనిఖీలు చేసిన అధికారులు 16 మందిపై కేసులు నమోదు చేశారు.

సొమ్ము రికవరీలో జాప్యం

  రేషన్‌ బియాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రేషన్‌ డీలర్లపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు అక్రమ సొమ్ము విలువను వెల్లడించడానిక జంకుతున్నారు. ఎక్కువమంది రేషన్‌ డీలర్లపై నామమాత్రపు జరిమానా విధించి తిరిగి వారికే రేషన్‌ దుకాణాలను కట్టపెట్టుతున్నారు. ఇప్పటికీ చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

సంవత్సరం     తనిఖీలు చేసిన     నమోదు చేసిన

                   షాపులు                 కేసులు

2017 98                20

2018 56                 08

2019 72                 15

2020 69                 04

2021 83                 16



Updated Date - 2021-12-06T06:40:53+05:30 IST