ఈ-పాస్‌ లేకుండా అనుమతి లేదు

ABN , First Publish Date - 2020-07-09T09:32:48+05:30 IST

గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ బుధవారం పల్నాడులో పర్యటించారు. నాగార్జునసాగర్‌ అంతరాష్ట్రీయ సరిహద్దు చెక్‌పోస్టును, దాచేపల్లి మండలం పొందుగల

ఈ-పాస్‌ లేకుండా అనుమతి లేదు

రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ 

గురజాల సబ్‌డివిజన్‌లో తనిఖీలు


విజయపురిసౌత్‌, మాచర్ల రూరల్‌, రెంటచింతల, వెల్దుర్తి, దుర్గి, దాచేపల్లి, జూలై 8: గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ బుధవారం పల్నాడులో పర్యటించారు. నాగార్జునసాగర్‌ అంతరాష్ట్రీయ సరిహద్దు చెక్‌పోస్టును, దాచేపల్లి మండలం పొందుగల గ్రామ సమీపంలోని రాష్ట్ర పోలీసు చెక్‌పోస్టును రూరల్‌ ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపాస్‌ లేకుండా రాష్ట్రంలో ప్రవేశించేందుకు ఎటువంటి అనుమతి లేదని స్పష్టంచేశారు. కొవిడ్‌-19 అధికంగా ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి రాష్ట్రపోలీసు చెక్‌పోస్టు సమీపంలోని కొవిడ్‌ సెంటర్‌లో పరీక్షలు తప్పనిసరిగా చేస్తారన్నారు.


రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తామని పునరుద్ఘాటించారు. సాయంత్రం 7గంటల తరువాత మెడికల్‌ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఇసుక, మద్యం వంటి అక్రమరవాణా జరగకుండా కఠినచర్యలు తీసుకున్నామన్నారు. గురజాల సబ్‌ డివిజన్‌లోని పోలీస్‌స్టేషన్లలో పోలీసుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీచేసినట్లు చెప్పారు. ఇప్పటికే సరిహద్దు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించిన వారిలో మూడురోజుల క్రితం ముగ్గురు ఏఎన్‌ఎస్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేశామన్నారు. అనంతరం కొవిడ్‌ సెంటర్‌ను, పొందుగుల కృష్ణానది సమీపంలోని పోలీసు క్యాంపును ఆయన పరిశీలించారు.


అలాగే మాచర్ల రూరల్‌, రెంటచింతల, వెల్దుర్తి, దుర్గి పోలీసుస్టేషన్లను ఎస్పీ విశాల్‌ గున్నీ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయనతోపాటు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి, గురజాల అర్బన్‌, రూరల్‌ సీఐలు దుర్గాప్రసాద్‌, ఉమేష్‌, విజయపురిసౌత్‌, రెంటచింతల, దాచేపల్లి ఎస్‌ఐలు పాల్‌ రవీందర్‌, చల్లా సురేష్‌, బాలనాగిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2020-07-09T09:32:48+05:30 IST