మళ్లీ తనిఖీలు!

ABN , First Publish Date - 2021-10-19T06:15:16+05:30 IST

నీరు-చెట్టు పథకం కింద తెలుగుదేశం హయాంలో చేసిన పనులను మరోసారి తనిఖీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సంబంధిత కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మళ్లీ తనిఖీలు!
నీరు-చెట్టు పథకం కింద గతంలో మట్టి పనులు చేసిన కశింకోట మండలం రంగబోలు గెడ్డ రిజర్వాయర్‌

నీరు-చెట్టు పథకం కింద టీడీపీ ప్రభుత్వ హయాంలో 950 పనులు

పలుచోట్ల డీఈలు, ఈఈలు, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు సైతం తనిఖీ

బిల్లులు మంజూరుచేసే తరుణంలో అమల్లోకి ఎన్నికల కోడ్‌ 

ఆ తరువాత చెల్లింపు ఆపేసిన వైసీపీ ప్రభుత్వం

పనుల్లో నాణ్యత లేదంటూ మరోసారి తనిఖీలు 

అధికారుల నివేదికలతో కొన్నింటికి బిల్లుల్లో కోత

అయినా నిధులు విడుదల చేయని ప్రభుత్వం

హైకోర్టులో కాంట్రాక్టర్ల పిటిషన్లు

ఆయా పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశం

మొత్తం పనులన్నీ తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

రెండున్నరేళ్ల తరువాత నాణ్యత నిర్ధారణపై కాంట్రాక్టర్లు విస్మయం


విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు పథకం కింద తెలుగుదేశం హయాంలో చేసిన పనులను మరోసారి తనిఖీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సంబంధిత కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి ఇష్టం లేకనే వైసీపీ ప్రభుత్వం వింత నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపిస్తున్నారు. మరోవైపు జల వనరుల శాఖ అధికారులు సైతం..మూడేళ్ల క్రితం చేసిన మట్టి పనుల కొలతలు ఇప్పుడు ఎలా తీయాలో అర్థం కావడం లేదని అంటున్నారు. 


నీరు-చెట్టు పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చెరువులు, కాలువల్లో పూడిక తీసి, గట్లను పటిష్టం చేసే పనులు చేపట్టారు. కొన్నిచోట్ల చిన్నాచితకా సిమెంట్‌ పనులు కూడా చేశారు. సెక్షన్‌ అధికారులు ఆయా పనుల కొలతలు తీసుకుని ఎం.బుక్‌లో నమోదుచేశారు. తరువాత పనుల విలువను బట్టి డీఈ/ఈఈలు స్వయంగా తనిఖీలు చేశారు.  జల వనరుల శాఖ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కూడా పనులను పరీక్షించారు. తరువాత పే అండ్‌ అకౌంట్స్‌ శాఖ ద్వారా ఎఫ్‌టీపీలు జనరేట్‌ చేసి టోకెన్‌ నంబర్లు ఇచ్చారు. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు మంజూరుచేయడం ఒక్కటే మిగిలి ఉంది. ఈ తరుణంలో (2019 మార్చి) సాధారణ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో బిల్లుల మంజూరు నిలిచిపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు ఆపేసింది. పనుల్లో నాణ్యత లోపించిందంటూ జల వనరుల శాఖ విజిలెన్స్‌ అధికారులతో తనిఖీలు చేయించింది. కొన్ని పనుల్లో నాణ్యత లేదంటూ విజిలెన్స్‌ అధికారులు నిర్ధారించి బిల్లుల్లో కోత వేశారు. అయినా బిల్లులు చెల్లించలేదు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. వీరిలో విశాఖ జిల్లాకు చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు. పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం... ఆయా పనులను తనిఖీ చేసి, నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


అన్ని పనులూ తనిఖీ చేయాలని ప్రభుత్వ ఆదేశం

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాంట్రాక్టర్లు చేసిన పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొత్తం పనులన్నింటినీ తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని జల వనరుల శాఖను ఆదేశించింది. మిగిలిన కాంట్రాక్టర్లు కూడా కోర్టులో పిటిషన్లు వేస్తారేమోనన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ తీరును కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పటి అధికారులు పనులను తనిఖీ చేసి ఎం.బుక్‌లో నమోదుచేశారని, అటువంటిది మరోసారి తనిఖీలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక రెండున్నరేళ్ల క్రితం చేసిన మట్టి పనులను ఇప్పుడు తనిఖీ చేయడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం చెరువులు, కాలువల్లో నీరు వుందని, వీటిల్లో తనిఖీలు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కాగా నీరు-చెట్టు పనులను జల వనరుల శాఖ తనిఖీ చేసిన తరువాత, అదే శాఖకు చెందినక్వాలిటీ కంట్రోల్‌ అధికారులు వాటిల్లో 50 శాతం పనులను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది 


జిల్లాలో రూ.55 కోట్లతో 950 పనులు

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకం కింద జల వనరుల శాఖ రెగ్యులర్‌ డివిజన్‌, ఎస్‌ఎంఐ డివిజన్‌, వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్‌లలో సుమారు రూ.55 కోట్ల విలువైన 950 పనులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యధికంగా విశాఖలో రెగ్యులర్‌ డివిజన్‌ పరిధిలో సుమారు రూ.40 కోట్లతో 649 పనులు చేశారు. మిగిలిన రెండు డివిజన్‌లలో రూ.15 కోట్ల విలువైన 300 పనుల వరకు చేపట్టినట్టు చెబుతున్నారు.  


సాధ్యమైనంత వరకు ప్రతి పనినీ తనిఖీ చేస్తాం

బొత్స శ్రీనివాసరావు, ఈఈ, జలవనరుల శాఖ, విశాఖ డివిజన్‌

నీరు-చెట్టు కింద చేపట్టిన పనులను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నా డివిజన్‌లో మొత్తం 649 పనులు జరిగాయి. అన్నింటికీ తనిఖీ చేయాలి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చాలా వరకు చెరువులు నిండాయి. తనిఖీలు చేయడానికి వీలుకాని వాటిని విడిచిపెడతాం. విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికే 18 పనులు తనిఖీ చేసి కొన్నింటిలో నాణ్యత లోపాలున్నట్టు గుర్తించారు.

Updated Date - 2021-10-19T06:15:16+05:30 IST