టెక్‌తో చెక్‌!

ABN , First Publish Date - 2021-02-24T07:14:01+05:30 IST

థాంక్యూ సత్య. హైదరాబాద్‌తో పాటు భారతదేశానికి టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఎంతో ప్రధానం. ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చలు జరుగుతున్న తరుణం ఇది.

టెక్‌తో చెక్‌!

  • కరోనా కట్టడిలో సాంకేతికతే కీలకం
  • ఆ మహమ్మారితో పని విధానాల్లో సమూల మార్పు
  • అంకుర సంస్థలతో వైద్యరంగంలో పెనుమార్పులు
  • ఇలాంటి ఉపద్రవాలను టెక్నాలజీతోనే ఎదుర్కోగలం
  • బయో ఆసియా సదస్సులో మైక్రోసాప్ట్‌ సీఈవో
  • సత్య నాదెళ్లతో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర చర్చ
  • టి-హబ్‌కు మళ్లీ రండి.. 
  • సత్య నాదెళ్లను కోరిన కేటీఆర్‌


రామ్‌.. సత్యా అంటూ స్నేహ పూర్వకమైన పలకరింపులు, ఛలోక్తుల మధ్య మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. బయోఆసియా సదస్సులో భాగంగా మంగళవారం ‘హెల్త్‌కేర్‌ టు హిట్‌ అండ్‌ రిఫ్రెష్‌’ అంశంపై ఆన్‌లైన్‌లో ఇద్దరి మధ్య 20 నిమిషాల పాటు ఆసక్తికరమైన సంభాషణ కొనసాగింది. ఆ వివరాలు..


కేటీఆర్‌: థాంక్యూ సత్య. హైదరాబాద్‌తో పాటు భారతదేశానికి టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఎంతో ప్రధానం. ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చలు జరుగుతున్న తరుణం ఇది. ఆరంగం పురోగతికి డిజిటల్‌ పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతోంది. కృత్రిమ మేఽథ, డిజిటల్‌ టెక్నాలజీలు మైక్రోసా్‌ఫ్టతో పాటు సత్యకు కూడా ఎంతో ఇష్టమైన అంశాలు. ఏడాదిగా కరోనా మహమ్మారి మన జీవితాలు, వ్యాపారాలు సహా అన్ని విషయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలు సంఘటితంగా ఎలా కృషి చేయాలి?


సత్య నాదెళ్ల: థాంక్యూ రామ్‌. బయో ఆసియాలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. అది కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న సదస్సులో పాల్గొనడం ఆనందం కలిగిస్తోంది. కరోనా మహమ్మారితో డిజిటల్‌ రంగంలో పెనుమార్పులు వచ్చాయి. క్లౌడ్‌, టీమ్స్‌ వంటి టెక్నాలజీలు లేకపోతే  ఇలాంటి సమయంలోఏం జరిగేదో ఊహించడానికే కష్టంగా ఉంది. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడే వారికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సహకరిస్తున్నాం. తద్వారా మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో నాణ్యమైన ఔషధాలు తయారు చేయగలుగుతున్నాం. మన మొబైల్‌ యాప్‌లో ఏఐ ట్రయాజ్‌ టూల్స్‌, టెలీ మెడిసిన్‌ సౌకర్యం వచ్చిన తరువాత అవుట్‌ పేషెంట్‌ విజిట్‌ ప్రక్రియ సమూలంగా మారిపోయింది. ప్రజలకు ఇందుకోసమే ఎక్కువ ఖర్చు అయ్యేది. పేషెంట్లు, వారి బంధువుల సౌకర్యాలతో పాటు వైద్య నిపుణుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉపకరణాలను కనుగొన్నాం. అంతేకాదు వైద్యులకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడం వల్ల.. రోగ నివారణపై ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. కరోనా వల్ల.. వైద్యరంగంలోని వివిధ విభాగాల మధ్య అనుసంధానం జరగడం గొప్ప విషయం. ఉదాహరణకు కరోనా ప్రారంభంలో అడాప్టివ్‌ బయోటెక్‌ అనే కంపెనీతో పనిచేశాం. ఆ కంపెనీ రోగనిరోధక వ్యవస్థ వైర్‌సకు ఎలా స్పందిస్తుందనే అంశంపై పరిశోధన చేపట్టింది. అది అర్థం చేసుకుంటేనే కరోనాకు సత్వరం ఔషధాలు, టీకాలు కనుగొనే వీలుకలుగుతుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో కరోనా లాంటి మరో ఉపద్రవం రావచ్చు. అటువంటి వాటిని డిజిటల్‌ టెక్నాలజీ సహకారంతో సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం జరగాలి.


కేటీఆర్‌: ఇప్పుడందరూ ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నారు. ఈ సదస్సు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. వర్క్‌ ఫ్రం హోంపై మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో పనివిధానాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనుకుంటున్నారు.


సత్య: పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో కూడా మనం కాలం, స్థలం, దృక్పథం విషయంలో మరింత సౌలభ్యంతో వ్యవహరించాలి. అలా చేయాలంటే అందుకు కొత్త ఉపకరణాలు కావాలి. అన్నింటి మధ్య సమన్వయం ఉండాలి. కరోనా కాలంలో మనం ఇంటి నుంచే పని చేస్తున్నా అందరితో సమన్వయంతో సులువుగా పని చేసుకోగలుగుతున్నాం. టెకీలే కాదు కరోనా పోరాటయోధులందరివిషయంలోనూ ఇది వర్తిస్తుంది. మైక్రోసాఫ్ట్‌ హాలోలైన్స్‌ లేదా టీమ్స్‌ వంటి మెసేజింగ్‌ అప్లికేషన్స్‌తో సునాయాసంగా వైద్యులను సంప్రదించగలుగుతున్నారు. ఇలా తేలిగ్గా అన్ని వర్గాల మధ్య టెక్నాలజీ సహకారంతో సమన్వయం సాధించగలిగాం. మరో అంశం ఏమిటంటే.. మనం నేర్చుకునే ప్రక్రియలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యం నేర్చుకునే స్వభావం ఉంటేనే వ్యక్తి అయినా సంస్థ అయినా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. శ్రేయస్సు అనేది మరో ముఖ్యమైన విషయం. ఇక్కడ సరదాగా ఒక విషయం చెబుతాను.  మనం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నామా లేక (స్లీపింగ్‌ ఫ్రం హోం) ఇంటి నుంచి నిద్రపోతున్నామా అని... నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది (నవ్వులు). అందుకే ఉద్యోగులకు సకాలంలో విరామం ఇవ్వాలి. వారి సంక్షేమం గురించి చూసేందుకు మేనేజర్లకు తగిన సౌకర్యాలు కల్పించాలి. సమన్వయం, నేర్చుకోవడం, శ్రేయస్సు అనే మూడు అంశాలు పని గురించి మన ఆలోచనలో మౌలిక మార్పులు తీసుకొస్తాయి.


కేటీఆర్‌: థాంక్యూ సత్య. దశాబ్దంలో జరిగిన సాంకేతిక పరిణామాలకు చక్కటి భాష్యం చెప్పారు. అంకుర సంస్థలు అద్భుత విజయాలు సాధిస్తాయని బలంగా నమ్మేవారిలో మీరు ముందు వరుసలో ఉంటారు. వైద్య రంగంలో అంకుర సంస్థలు ఎలాంటి మార్పులు తెస్తాయని మీరు భావిస్తున్నారు?


సత్య: నాకు గుర్తుంది. నేను ఐదేళ్ల క్రితం మీతో కలిసి టి-హబ్‌ను సందర్శించాను. టెక్నాలజీ, బయాలజీ రంగాలు సమన్వయంతో పనిచేస్తే అద్భుత విజయాలు సాధించగలుగుతాం. అంకుర సంస్థలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో కూడా జీవశాస్త్ర పరిశోధనలకు, ఔషధాల తయారీ రంగాలకు ఇంత త్వరగా అంకుర సంస్థలు విస్తరించడం ఆనందించదగ్గ విషయం. నేను భారతదేశానికి చెందిన సైమెట్రిక్‌ అనే కంపెనీని ఈ మధ్యే చూశాను. అది క్లినికల్‌ ట్రయల్స్‌ను అనూహ్య వేగంతో నిర్వహించగలుగుతోంది. కొత్త విషయాలను ఆవిష్కరించడంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే వాయిస్‌ టెక్నాలజీ సహకారంతో వైద్యరంగంలో ఎన్నో అవరోధాలను అధిగమించగలుగుతు న్నాం. ఉదాహరణకు వాయిస్‌ టెక్నాలజీ సహకారంతో అపోలో హాస్పటల్స్‌ 24 గంటల వైద్య సేవలందిస్తోంది. ఆ వాయిస్‌ టెక్నాలజీని అంకుర సంస్థలు అందించడం విశేషం. మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే రామ్‌.. తక్కువ ఖర్చుతో వైద్య సేవల్ని అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాం. క్షయ వ్యాధి చికిత్స కోసం ఫోన్‌ ద్వారా లేదా మెసేజ్‌ ద్వారా వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. అది ‘99 డాట్స్‌’ ప్రోగ్రాంతో సాధ్యమవుతున్నది. ‘ఎవర్‌ వెల్‌ హె ల్త్‌ సొల్యూషన్స్‌’ అనే అంకుర సంస్థ ఆ ప్రాజెక్టును నిర్వహించడం చాలా సంతోషం కలిగిస్తోంది. ఇలాంటి అంకుర సంస్థల వల్ల పేషెంట్‌ సేవలు లేదా కొత్త మందులు కనిపెట్టే అంశాల్లో గొప్ప విజయాలు సాధ్యమవుతున్నాయి.


కేటీఆర్‌: థాంక్యూ సర్‌, నాకు గుర్తుంది. మీరు టి-హబ్‌ను సందర్శించారు. టి-హబ్‌ ఈ మధ్య కాలంలో మరిన్ని ఘన విజయాలు సాధించింది. హైదరాబాద్‌లో అంకుర సంస్థలకు అది కేంద్ర బిందువుగా మారింది. ఈసారి మీరు భారతదేశం వచ్చినప్పుడు వీలు చూసుకుని మరోసారి టి-హబ్‌కు రండి. ఇక.. నాతో పాటు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటుంది సత్య. మా అబ్బాయికి 15 ఏళ్ల వయసు. అతడికి షూ కొనిపెట్టాను. దానికి ట్రాకింగ్‌ పరికరం అమర్చి ఉంది. ఆ పరికరం మనం ఎంత దూరం నడిచామో చెబుతుంది. ఇది యాప్‌ల కాలం. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు, ఫిట్‌ నెస్‌ సాధనాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. కానీ, సమాచార భద్రత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు కూడా ఉల్లంఘనలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నాయి. ప్రైవసీ, సమాచార భద్రతను మనం ఎలా పరిరక్షించాలి? 


సత్య: చాలా కరెక్ట్‌గా చెప్పారు రామ్‌. టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకొస్తోంది. మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల్లో.. ఇలాంటి ప్లాట్‌ఫాంలు, టెక్నాలజీ సాధనాలు తయారు చే సే సమయంలోనే ప్రైవసీని, భద్రతను అందించే విధంగా వాటిని రూపొందిస్తున్నాం. అదే సమయంలో ఇంటర్నెట్‌ భద్రత గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులేషన్‌ గురించి మాత్రమే కాదు ఇంజనీరింగ్‌, డిజైన్‌ విలువల అంశాన్ని కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క సంస్థా పరిగణనలోకి తీసుకోవాలి. ‘‘మేం టెక్నాలజీ సాధనాలు తయారు చేశాం.. ఏం జరుగుతుందో తరువాత చూద్దాం’’ అనుకోవడం సరికాదు. అన్ని ఉత్పత్తులనూ ప్రైవసీని పరిరక్షించేందుకు అనువుగానే తయారుచేయాలి. ఇక ప్రైవసీని కాపాడేందుకు ప్రపంచ దేశాల్లో ప్రభుత్వ నిబంధనలు ఎలాగూ ఉన్నాయి. ఆహార భద్రత, ఔషధ భద్రత చట్టాల లాగానే.. ప్రైవసీ, డేటా భద్రతకు కూడా చట్టాలు రూపొందించాలి. ప్రైవసీ, భద్రతను కాపాడే విషయంలో ఎవరికి వారు కాకుండా ప్రపంచ మంతా ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాలి. ఆ చట్టాలను మనం అనుసరిస్తేనే ఆధునిక పరిజ్ఞానం ప్రయోజనాలను విస్తృతంగా అందుకోగలుగుతాం.


కేటీఆర్‌: థాంక్యూ వెరీమచ్‌ సత్య. బయో ఆసియాలో మీరు భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉంది. త్వరలో మిమ్మల్ని హైదరాబాద్‌లో కలుసుకోగలనని ఆశిస్తున్నాను.

సత్య నాదెళ్ల: థాంక్యూ రామ్‌.. థాంక్యూ వెరీమచ్‌

- స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2021-02-24T07:14:01+05:30 IST