సైబర్‌ క్రైమ్‌కు ‘సైకాప్స్‌’తో చెక్‌

ABN , First Publish Date - 2022-01-23T08:38:00+05:30 IST

సైబర్‌ క్రైమ్‌.. సాంకేతిక ప్రపంచంలో పోలీసులకు అతిపెద్ద సవాల్‌.

సైబర్‌ క్రైమ్‌కు ‘సైకాప్స్‌’తో చెక్‌

  • ఒక్కసారి చిక్కితే నేరగాళ్ల ఆటకట్టు
  • ఆన్‌లైన్‌ మోసగాళ్ల పూర్తి సమాచారం నిక్షిప్తం
  • దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నట్లు అంచనా
  • ఇప్పటికే అందుబాటులో 3 లక్షల మంది డేటా
  • ఒక్కసారి అరెస్టయితే.. ఏళ్ల పాటు జైల్లోనే..
  • టెక్నాలజీని రూపొందించిన తెలంగాణ పోలీసులు 
  • తొమ్మిది రాష్ట్రాల్లో వినియోగం

హైదరాబాద్‌ సిటీ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ క్రైమ్‌.. సాంకేతిక ప్రపంచంలో పోలీసులకు అతిపెద్ద సవాల్‌. ఆన్‌లైన్‌ వ్యవస్థలోని చిన్నచిన్న లోపాలను అందిపుచ్చుకుని అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు ఈ సైబర్‌ నేరగాళ్లు. ఎక్కడో కూర్చుని ఓ చిన్న స్మార్ట్‌ ఫోన్‌తో నిలువు దోపిడీ చేసేస్తున్నారు. కొందరి అమాయకత్వం, అత్యాశే వీరి ప్రధాన బలం. ప్రతి రంగంలోనూ ఆన్‌లైన్‌ వినియోగం పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. అదే స్థాయిలో సైబర్‌ మోసాలూ ఎక్కువయ్యాయి. రెప్పపాటులో ఖాతాలు ఖాళీ చేయడం.. ఆదమరిస్తే సొమ్ములు కాజేయడం.. ఆశకు పోతే.. నిలువునా ముంచేయడం ఈ నేరగాళ్ల ప్రత్యేకత. కంటికి కనిపించని ఈ మోసగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని వ్యూహాలు పన్నుతున్నా.. ఎప్పటికప్పుడు సరికొత్త రూపాల్లో తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. రోజూ వేలాదిగా వస్తున్న ఈ తరహా ఫిర్యాదులతో తలలు పట్టుకుంటున్న పోలీసులకు.. ‘సైకాప్స్‌’ రూపంలో అందుబాటులోకి వచ్చిన ఓ సరికొత్త సాంకేతికత కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ‘సైకాప్స్‌’.. సాంకేతిక మాయగాళ్లపై పోలీసులు ఎక్కుపెట్టిన సైబరాస్త్రం ఇది. సైబర్‌ నేరగాళ్ల పని పట్టేందుకు తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పోలీసులు రూపొందించిన ఈ ‘సైబర్‌క్రైమ్‌ అనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం’ (సైకాప్స్‌) మంచి ఫలితాలనే ఇస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎ్‌ఫసీఎ్‌ఫఆర్‌ఎంఎస్‌) ఆదారంగా ఈ టెక్నాలజీ రూపొందింది.


నేరగాడు ఒక్కసారి చిక్కితే చాలు.. అతడి సమస్త నేర చరిత్ర ఇందులో నిక్షిప్తం చేసేస్తారు. దీని ద్వారా.. అతడిపై ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదై ఉన్నాయి.. ఎక్కడ ఎంత మందిని ముంచాడు.. లాంటి వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో తెలిసిపోతాయి. దీని ఆధారంగా.. వెంటనే ఆయా రాష్ట్రాలు, నగరాలకు సమాచారం వెళ్లిపోతుంది. ఇంకేముంది.. ఒక కేసులో బెయిల్‌ వస్తే మరో కేసులో అరెస్టు.. ఆ కేసులో బెయిలిస్తే ఇంకో కేసులో అరెస్టు.. ఇలా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో.. అతడు బెయిల్‌పై బయటకు రావడానికి నెలలు, ఏళ్లు పట్టొచ్చు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్‌ రాష్ట్రాలు కూడా ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. దేశంలో మొత్తం 8 లక్షల మంది సైబర్‌ నేరగాళ్లు ఉన్నారన్నది ఓ అంచనా కాగా.. ఇప్పటికే 3.15 లక్షల మందికి సంబంధించిన సమస్త నేరాల చిట్టాను, వారి పూర్తి ప్రొఫైళ్లను అధికారులు సైకా్‌ప్సలో నిక్షిప్తం చేశారు. వీరిలో సుమారు 3 వేల మందిని వివిధ రాష్ట్రాల పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు. సైబర్‌క్రైం టోల్‌ప్రీ నెంబర్‌ 15260, డయల్‌ 100, డయల్‌ 112 ద్వారా నమోదవుతున్న ఫిర్యాదులతో పాటు నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ) డేటాను కూడా సైకా్‌ప్సలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు.



సమాచారం ఇలా సేకరిస్తారు..

బాధితుడి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ముందుగా.. నేరగాళ్లు ఏ నెంబర్‌ నుంచి ఫోన్‌ చేశారు,,? కాజేసిన డబ్బును ఏ ఖాతాలోకి మళ్లించారు? మోసం జరిగిన తీరు.. లాంటి వివరాలను సేకరిస్తారు. వీటిని తమ వద్ద ఉన్న డేటాతో విశ్లేషిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంగా పని చేసేలా సైబర్‌క్రైం కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (టీ4సీ)ని ఏర్పాటు చేశారు. ఇలా.. దేశంలోని వివిధ కేంద్రాల్లో చిక్కిన 120 మంది సైబర్‌ నేరస్థుల నుంచి సేకరించిన సమాచారాన్ని.. అప్పటికే సైకా్‌ప్సలో ఉన్న డేటాతో విశ్లేషించడం ద్వారా దేశవ్యాప్తంగా 30 వేల సైబర్‌క్రైమ్‌ కేసులను పోలీసులు ఛేదించగలిగారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఒక్కో నేరస్థుడు ఎన్ని నేరాలకు పాల్పడుతున్నాడో..! ఇదే ఇప్పుడు పోలీసులకు ఆయుధంలా మారింది. ఆయా రాష్ట్రాలు, నగరాల పోలీసులు.. నేరగాళ్ల డేటాను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా.. ఒకే నేరగాడు వివిధ ప్రాంతాల్లో చేసిన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా.. ఒక్క కేసులో నేరగాడు అరెస్టయితే చాలు.. అతడిపై ఉన్న కేసులన్నీ బయటకు తీసి.. వరుస అరెస్టులతో ఏళ్ల తరబడి అతడ్ని జైలులోనే ఉంచేందుకు అవకాశం ఉంటోంది. సైకాప్స్‌ సాయంతో క్షణాల్లో నేరస్థుల డేటాను సేకరిస్తున్న పోలీసులు.. వారి నివాసాలు, అడ్డాలను గుర్తించి.. వాటిని హాట్‌స్పాట్స్‌గా మ్యాపింగ్‌ చేస్తున్నారు.


హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల పోలీసులూ గుర్తించడానికి వీలుగా యూనిఫామ్‌ కలర్స్‌ను వాడుతున్నారు. నేరం జరిగిన ప్రదేశానికి నీలం రంగు, అరెస్టయినకేసులకు ఎరుపురంగు ఇస్తున్నారు. దీని ద్వారా.. ఇతర నగరాలు, రాష్ట్రాల పోలీసులు కూడా సైకా్‌ప్సలో లాగిన్‌ అయి హాట్‌స్పాట్‌లను గుర్తించి చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ డేటా అప్‌డేషన్‌ ప్రక్రియ కూడా నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఈ వివరాల ప్రకారం.. తెలంగాణలో గడచిన ఆరు నెలల్లో సైబర్‌ ఆర్థిక నేరాలపై 50 వేల ఫిర్యాదులు నమోదు కాగా.. బాధితులు పోగొట్టుకున్న సొమ్ము ఏకంగా రూ.96 కోట్లు కావడం గమనార్హం. అందులో ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులు 10 వేలు. ఈ సొమ్ము 9,925 సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిందని గుర్తించిన పోలీసులు.. అందులో 1965 ఖాతాలను స్తంభింపజేశారు. దీని ద్వారా రూ.5 కోట్ల సొమ్ము ఫ్రీజ్‌ అయింది. 

Updated Date - 2022-01-23T08:38:00+05:30 IST