చైనాకు చెక్‌

ABN , First Publish Date - 2021-09-17T08:47:45+05:30 IST

ఇండో-పసిఫిక్‌ ప్రాం తంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు త్రైపాక్షిక రక్షణ కూటమి(ఏయూకేయూఎస్‌) ఏర్పాటైంది.

చైనాకు చెక్‌

  • ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కొత్త రక్షణ కూటమి
  • అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఏర్పాటు

వాషింగ్టన్‌, లండన్‌, సెప్టెంబరు 16: ఇండో-పసిఫిక్‌ ప్రాం తంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు త్రైపాక్షిక రక్షణ కూటమి(ఏయూకేయూఎస్‌) ఏర్పాటైంది. 21వ శతాబ్దంలో వ్యూహాత్మకం గా కీలకమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అతిపెద్ద శక్తిగా ఎదుగుతున్న చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా ఈ కూటమిని ప్రారంభించా యి. అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములను సమకూర్చుకోవడంలో ఆస్ట్రేలియాకు సాయం చేయడం సహా కూటమిలోని దేశాలు రక్షణ సామర్థ్యాలను పెద్దఎత్తున పెంపొందించుకునేలా సహకరించుకునేందుకు ఒప్పందం కుదిరింది. దీన్ని ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం పెంపొందించే, తమ సంయుక్త ప్రయోజనాలు, విలువలకు మద్దతిచ్చే చర్య గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆస్ర్టేలియా ప్రధాని స్కాట్‌ మార్రిసన్‌ ఓ సంయుక్త ప్రకటనలో అభివర్ణించారు. ఈ నెల 24న అమెరికాలో జరిగే క్వాడ్‌ దేశాధినేతల సమావేశానికి వారం ముందు ఏయూకేయూఎస్‌ కూటమి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకొంది. క్వాడ్‌ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని మార్రిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా హాజరుకానున్నారు. 


చైనా మండిపాటు..

ఈ కూటమి ఏర్పాటును చైనా తీవ్రంగా విమర్శించింది. ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా, అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ చర్యలకు విఘాతంగా అభివర్ణించింది. దీనిపై నిశితంగా పరిశీలన జరుపుతామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ అన్నారు. దక్షిణాసియాలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం ఈ ప్రాంతంలోని దేశాలు కృషి చేయాలని సూచించారు. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఐసీబీఎం అగ్ని-5 బాలిస్టిక్‌ క్షిపణిని భారత్‌ ప్రయోగించనుందనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాలోని అనేక నగరాలను ఈ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. అణ్వాయుధాలను తీసుకెళ్లగలిగే ఈ క్షిపణిని భారత్‌ ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని సైన్యానికి అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, ఉత్తర కొరియా దేశాల వద్ద మాత్రమే ఇలాంటి క్షిపణులు ఉన్నాయి. ‘ఇది మాకు వెన్నుపోటు. ఆస్ర్టేలియాపై నమ్మకంతో మేం ఆ దేశంతో సంబంధాలు ఏర్పరచుకొన్నాం. ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు’ అని ఫ్రాన్స్‌ విమర్శించింది.

Updated Date - 2021-09-17T08:47:45+05:30 IST