డ్రోన్‌ దాడులకు 3 రకాలుగా చెక్‌!

ABN , First Publish Date - 2021-07-26T08:03:29+05:30 IST

దేశ సరిహద్దుల్లో జరుగుతున్న డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పి కొట్టడానికి మూడు పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి వెల్లడించారు.

డ్రోన్‌ దాడులకు 3 రకాలుగా చెక్‌!

సాఫ్ట్‌ కిల్లింగ్‌తో కూల్చేస్తాం.. హార్డ్‌, రాడార్‌ కిల్లింగ్‌తో కూడా..

రక్షణ పరికరాల స్వీయ తయారీ దేశాల సరసన భారత్‌

సొంతంగా యుద్ధ ట్యాంకులు, క్షిపణుల రూపకల్పన

కరోనా బాధితుల కోసం హైఎండ్‌ వెంటిలేటర్‌

బెంగళూరులో రూపొందించాం: డీఆర్‌డీవో సతీశ్‌రెడ్డి 


విజయవాడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దుల్లో జరుగుతున్న డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పి కొట్టడానికి మూడు పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి వెల్లడించారు. సాఫ్ట్‌ కిల్లింగ్‌, హార్డ్‌ కిల్లింగ్‌, రాడార్‌ కిల్లింగ్‌ అనే ఈ మూడు విధానాల్లో శత్రువులు ప్రయోగించే డ్రోన్లను నేలకూల్చవచ్చని తెలిపారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సతీశ్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో రక్షణ రంగ పరికరాలు, సామగ్రిని తయారు చేసే ఆరు దేశాల సరసన భారత్‌ చేరిందన్నారు. రాబోయే రోజుల్లో రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, అంతరిక్షంలో శాటిలైట్లను ధ్వంసం చేసే టార్పెడోలను భారతదేశం సొంతంగా తయారు చేస్తోందన్నారు.


తాజాగా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని బుల్లెట్‌ ఛేదించేలా 150ఎంఎం బ్యారెల్‌ గన్‌ను తయారు చేశామన్నారు. రక్షణ రంగంలో ఉపయోగించే చిన్న, పెద్ద పరికరాల తయారీకి దేశంలో 11 వేల పరిశ్రమలు పనిచేస్తున్నాయని చెప్పారు. ‘‘కొంతకాలంగా ఇంజనీరింగ్‌ యువత ఆలోచనా విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ఐఐటీ పట్టా తీసుకున్న యువత విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసది. ఇప్పుడు 85ు మంది దేశంలో స్టార్ట్‌పలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 55 వేల స్టార్ట్‌పలు రిజిస్టర్‌ అయ్యాయి’’ అని పేర్కొన్నారు.


రోజుకు 6 లక్షల కిట్లు..

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలో ఉన్న డీఆర్‌డీవో శాస్త్రవేత్తలంతా పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీ విధానాలపై పనిచేశారని సతీశ్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడు దేశంలో రోజుకు 6 లక్షల పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారన్నారు. డీఆర్‌డీవో 75 రక్షణ పరికరాల ప్రాజెక్టులను రూపొందిస్తే.. వాటిని 795 తయారీ పరిశ్రమలకు ఇచ్చామని చెప్పారు. ‘‘కరోనా బాధితుల కోసం.. ఇప్పటి వరకు దేశంలో లేని హైఎండ్‌ వెంటిలేటర్‌ను బెంగళూరులోని ప్రయోగశాలలో రూపొందించాం. ఈ వెంటిలేటర్లు బీహెచ్‌ఈఎల్‌ ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. ఢిల్లీలో పది రోజుల్లో 1,000 పడకల ఆస్పత్రిని నిర్మించాం.


తేజస్‌ యుద్ధ విమానంలో 30 వేల అడుగుల ఎత్తుకు వెళ్లే సరికి ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఇందులో ఉండేవారు వెంట ఒకప్పుడు సిలిండర్‌ను వెంట తీసుకెళ్లేవారు. దీనికి విరుగుడుగా.. విమానంలోనే ఆక్సిజన్‌ తయారు చేసుకునే విధానాన్ని రూపొందించాం. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశాం. దేశంలో వివిధ ఆస్పత్రులు, కొండ ప్రాంతాల్లో 866 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసే బాధ్యతను ప్రభుత్వం మాకు అప్పగించింది. ఇప్పటికీ దేశంలో రోజుకు 30-40 ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. 2డీఆక్సీ గ్లూకోజ్‌ మందును డీఆర్‌డీవోలో పనిచేసే శాస్త్రవేత్తలు రేడియేషన్‌కు లోనైనప్పుడు ఇవ్వడానికి తయారుచేశాం’’ అని సతీశ్‌రెడ్డి వివరించారు.

Updated Date - 2021-07-26T08:03:29+05:30 IST