Musi River మురుగుకు ఇక చెక్‌.. సివర్‌ ట్రంక్‌ వచ్చేస్తోంది.. 297 కోట్లతో పనులు..!

ABN , First Publish Date - 2021-10-04T16:47:10+05:30 IST

మూసీనదికి ఉత్తరం వైపున ఏళ్ల నాటి సివరేజీ వ్యవస్థే కొనసాగుతోంది...

Musi River మురుగుకు ఇక చెక్‌.. సివర్‌ ట్రంక్‌ వచ్చేస్తోంది.. 297 కోట్లతో పనులు..!

  • జూబ్లీహిల్స్‌ నుంచి బేగంబజార్‌ వరకు..
  • జాంబాగ్‌ నుంచి గోల్కోండ వరకు
  • సివరేజీ వ్యవస్థ మెరుగుకు చర్యలు
  • జోన్‌-3లో 129 కిలోమీటర్ల సివర్‌ ట్రంక్‌ 
  • రూ.297కోట్లతో పనులు చేపట్టనున్న వాటర్‌బోర్డు

హైదరాబాద్‌ సిటీ : మూసీనదికి ఉత్తరం వైపున ఏళ్ల నాటి సివరేజీ వ్యవస్థే కొనసాగుతోంది. బేగంబజార్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వరకు వెలిసిన వేలాది బహుళ అంతస్తుల భవనాలతో ఆ పాత సివరేజీ వ్యవస్థపై బాగా భారం పడుతోంది. కోర్‌ సిటీలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగు పారుదలకు ఈ పరిమిత వ్యవస్థ ఏ మూలకూ సరిపోవడం లేదు. ఏ వీధిలో చూసినా మురుగు పొంగి ప్రవహించడమే. ఇలా అస్తవ్యస్తంగా మారిన సివరేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వాటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. రోడ్లు, వీధుల్లో మురుగు నీరు ప్రవహించకుండా రూ.297 కోట్లతో సివర్‌ ట్రంక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా, ప్రభుత్వం అనుమతులిచ్చింది. దాంతో టెండర్లను ఆహ్వానించి పనులు చేపట్టేందుకు వాటర్‌బోర్డు సిద్ధమైంది.


డీపీఆర్‌ రూపకల్పన..

నగరంలో 1931లో అప్పటి అవసరాలు, ఐదు లక్షల జనాభాకు అనుగుణంగా 54 కిలోమీటర్ల మేర సివరేజీ వ్యవస్థను నిర్మించారు. నగర విస్తరణకు అనుగుణంగా సివరేజీ వ్యవస్థ కూడా పెరుగుతూ వస్తోంది. 2010 నాటికి నగరంలో 3500 కిలోమీటర్ల మేర సివరేజీ నెట్‌వర్క్‌ ఉంది. కోర్‌ సిటీ ప్రాంతాన్ని ఐదు జోన్లుగా చేసి విస్తరించిన మహా నగరం, పెరిగిన జన సామర్థ్యానికి అనుగుణంగా వ్యవస్థను అధికారులు మెరుగుపరుస్తున్నారు. ఇప్పటికే పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో చర్యలు చేపట్టగా, తాజాగా మూసీనదికి ఉత్తరాన గల (33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని) జోన్‌-3 పరిధిలోకి వచ్చే టోలిచౌకి, గోల్కొండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, ఆసి్‌ఫనగర్‌, విజయనగర్‌కాలనీ, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్‌ తదితర ప్రాంతాల్లో సివరేజీ వ్యవ స్థ మెరుగుదల కోసం ముంబాయికి చెందిన షా కన్సల్టెన్సీ డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రూపొందించింది.


భవిష్యత్తు అవసరాల అనుగుణంగా...

జోన్‌-3లో మొత్తం 9 క్యాచ్‌మెంట్లు ఉండగా, అందులో ఎన్‌1 నుంచి ఎన్‌ 7వరకు గల క్యాచ్‌మెంట్లతో పాటు ఎన్‌11, ఎన్‌ 31 క్యాచ్‌మెంట్లు కూడా ఉన్నాయి. బేగంబజార్‌ నుంచి జూబ్లీహిల్స్‌ వరకు గల ప్రాంతాల్లో ప్రస్తుతం 355.78 కిలోమీటర్ల సివరేజీ వ్యవస్థ ఉంది. ఈ ప్రాంతంలో 2036 నాటికి 6.33 లక్షల జనాభాతో రోజుకు 127.42 మిలియన్‌ గ్యాలన్ల మురుగు నీటి పారుదల ఉంటోందని, 2051 నాటికి 10.20 లక్షల జనాభాతో రోజుకు 153.813 మిలియన్‌ గ్యాలన్ల మురుగు నీరు ఉంటుందనీ అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే మురుగునీటి మొత్తాన్ని వంద శాతం సేకరించేందుకు సివరేజీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి నిర్ణయించారు. జోన్‌-3 సివరేజీ ప్రాజెక్టు డీపీఆర్‌ను వాటర్‌బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా, ఇటీవల పాలనాపరమైన అనుమతులిచ్చింది.

Updated Date - 2021-10-04T16:47:10+05:30 IST