అక్రమాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-05-09T07:32:47+05:30 IST

వరి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని, రైతులకు ఎలాంటి నష్టం చేకూరొద్దని రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సర్వే చేపట్టి యాసంగిలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

అక్రమాలకు చెక్‌
వరి ధాన్యం కొనుగోలు చేపడుతున్న దృశ్యం

- వరి ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధన అమలు

- ఓటీపీ వస్తేనే గన్నీ బ్యాగులు


కామారెడ్డి, మే 8: వరి ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని, రైతులకు ఎలాంటి నష్టం చేకూరొద్దని రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సర్వే చేపట్టి యాసంగిలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీని ఆధారంగానే కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఈ ఏడాది వరి ధాన్యానికి మద్దతు ధర పెంచింది. గతేడాది ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.1,880, బీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1,860 ధర ఉండగా ఈ ఏడాది ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1,960, బీ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1,940 పెంచింది.

జిల్లాలో సాగు ఇలా..

ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 1.68లక్షల ఎకరాల్లో  రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రూల్లాబాద్‌, పోచారం ప్రాజెక్టు కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ మండలాలతో పాటు మాచారెడ్డి, దోమకొండ, కామారెడ్డి మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ లెక్కన యాసంగిలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు అంచనా వేశారు. అయితే కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

ఓటీపీ వస్తేనే గన్నీ బ్యాగులు

ఆధార్‌ కార్డుకు లింక్‌ చేసిన సెల్‌ఫోన్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగానే రైతులకు గన్నీ బ్యాగులు ఇస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పంటల సర్వేలో వరి సాగు చేపట్టిన రైతులకు మాత్రమే గన్నీ బ్యాగులు ఇవ్వడంతో అక్రమాలకు చెక్‌పడే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు సాగు చేసిన విస్తీర్ణం ఆధారంగా దిగుబడి అంచనా వేసి అందుకు సరిపడా గన్నీ బ్యాగులు అందిస్తున్నారు. వీటన్నింటితో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండే అవకాశం ఉంది.


సరైన నిర్ణయం

- రాజం, రైతు, భూంపల్లి

ఓటీపీ ఆఽధారంగా వరి ధాన్యం కొనుగోలు చేసే నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. వ్యవసాయ అధికారులు యాసంగి పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వాటి ఆధారంగా గన్నీ బ్యాగులు ఇవ్వడం, కొనుగోళ్లు చేయడంతో అక్రమాలకు చెక్‌పడనుంది. అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.


రైతులకు మేలు

- రాజశేఖర్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారి, కామారెడ్డి

కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తుండడంతో అక్రమాలకు చెక్‌ పడటంతో పాటు అర్హులైన రైతులకు మేలు చేకూరుతుంది. ఇప్పటికే రైతులు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌, మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసుకుని రైతుబంధు పొందుతున్నారు. కొత్త నిబంధనలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓటీపీ ఆధారంగా గన్నీ బ్యాగులను అందించి రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేపడతాం.


క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు

- భాగ్యలక్ష్మీ, వ్యవసాయాధికారి, కామారెడ్డి

జిల్లాలోని రైతులు యాసంగిలో సాగు చేసిన పంటలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు. వరి సాగు చేసిన రైతుల వివరాల ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం.


Read more