అక్రమాలకు చెక్‌!

ABN , First Publish Date - 2021-09-30T05:13:22+05:30 IST

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో అక్రమాలకు చెక్‌ పడనుంది. ప్రభుత్వం ఈ-పర్మిట్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నెల 15 నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. మాన్యువల్‌ అనుమతులను నిలిపివేశారు. ఏడాది కిందటే ప్రారంభించాల్సి ఉన్నా.. కొవిడ్‌తో వాయిదా వేస్తూ వస్తున్నారు.

అక్రమాలకు చెక్‌!
ఇచ్ఛాపురం ఏఎంసీ కార్యాలయం



ఏఎంసీల్లో ‘ఈ-పర్మిట్‌’ విధానం

మాన్యువల్‌ అనుమతులు నిలిపివేత

ఈ నెల 15 నుంచి అమలు

పారదర్శకత కోసమే అంటున్న అధికారులు

వ్యాపారులు వినియోగించుకోవాలని సూచన

 (ఇచ్ఛాపురం)

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో అక్రమాలకు చెక్‌ పడనుంది. ప్రభుత్వం ఈ-పర్మిట్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నెల 15 నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. మాన్యువల్‌ అనుమతులను నిలిపివేశారు. ఏడాది కిందటే ప్రారంభించాల్సి ఉన్నా.. కొవిడ్‌తో వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 ఏఎంసీల్లో అమలుచేస్తున్నారు. దీంతో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు ఆదాయంతో పాటు అవినీతికి చెక్‌ పడుతుందని భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమయంలో వచ్చే ఒక శాతం ‘సెస్‌’ ఏఎంసీలకు ప్రధాన ఆదాయ వనరు. మరోవైపు గోదాముల అద్దె రూపంలో కొంత మొత్తం ఆదాయం వస్తుంది. పన్నుల వసూళ్లకుగాను ప్రధాన రహదారుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసేవారు. అక్కడే నేరుగా సెస్‌ వసూలు చేసేవారు. కేంద్ర వ్యవసాయ చట్టాల నేపథ్యంలో ‘ఒకే దేశం- ఒకే మార్కెట్‌’ విధానం తెరపైకి రావడంతో జిల్లా వ్యాప్తంగా ఏఎంసీల చెక్‌పోస్టులు సుమారు ఏడాది పాటు నిలిచిపోయాయి. దీంతో ఆదాయం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. కొద్దినెలల కిందట వ్యవసాయ చట్టాలను న్యాయస్థానం రద్దు చేసిన నేపథ్యంలో చెక్‌ పోస్టులు తిరిగి తెరుచుకున్నాయి. శాఖాపరంగా అవినీతికి చెక్‌ చెప్పడంతో పాటు పారదర్శక సేవలకు ‘ఈ-పర్మిట్‌’ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.  

 ఇదీ ఏఎంసీల పరిస్థితి

జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. 170 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. నరసన్నపేట, జలుమూరు, ఎచ్చెర్ల, పలాస ఏఎంసీలు ఆదాయపరంగా ముందంజలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు ఏటా రూ.20 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుంది. 2019-20లో రూ.20.55 కోట్లు, 2020-21 లో రూ.15.10 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఇప్పటివరకూ రూ.3 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పటివరకూ మాన్యువల్‌ రూపంలో అనుమతులు ఇచ్చేవారు. కొందరు వ్యాపారులు సిబ్బందితో కుమ్మక్కై అనుమతికి మించి వ్యవసాయ ఉత్పత్తులను తరలించేవారు. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ‘ఈ-పర్మిట్‌’ విధానాన్ని ప్రారంభించింది. ఇదో సులభతర ప్రక్రియగా అధికారులు చెబుతున్నారు. వ్యాపారి తన మార్కెటింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, ఫోన్‌ నంబర్లతో దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ వస్తుంది. దానికి అనుగుణంగా నెట్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా నగదు చెల్లించుకుంటే అనుమతులు మంజూరు చేస్తూ ఫోన్‌లోనే సంక్షిప్త సమాచారం పంపిస్తారు. దానిని చెక్‌పోస్టుల వద్ద చూపిస్తే అక్కడున్న సిబ్బంది గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. ఇప్పటికే దీనిపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. సిబ్బందికి సైతం శిక్షణనిచ్చారు. చెక్‌పోస్టు సమీప రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తరలించేటప్పుడు తహసీల్దారు అనుమతిపత్రం చూపిస్తే సరిపోతుంది. 

ఈ-పర్మిట్‌తో వ్యాపారులకు వెసులుబాటు

 జిల్లాలో ఈనెల 15వ తేదీ నుంచి ఈ-పర్మిట్‌ విధానం అమలులోకి వచ్చిందని మార్కెటింగ్‌ శాఖ ఏడీ బి.శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ విధానం వల్ల వ్యాపారులకు ఎంతో వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. ప్రధానంగా వ్యాపారులకు అనుమతి కష్టాలు తొలగిపోతాయని తెలిపారు. ఈ-పర్మిట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు  ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యాపారులు కూడా సహకరించాలని కోరారు.



Updated Date - 2021-09-30T05:13:22+05:30 IST