బినామీలకు చెక్‌!

ABN , First Publish Date - 2020-09-29T15:28:49+05:30 IST

దుర్గగుడిలో ఈవో అడ్డగోలు దందాకు దేవదాయశాఖ కమిషనర్‌ చెక్‌ పెట్టారు..

బినామీలకు చెక్‌!

ఎట్టకేలకు దుర్గగుడిపై పారిశుధ్య, సెక్యూరిటీ టెండర్లకు నోటిఫికేషన్‌

గతంలో అడ్డగోలుగా ఈవో బినామీ సంస్థలకు కాంట్రాక్టులు 

కరోనా సాకుతో మరో ఏడాది పొడిగింపునకు స్కెచ్‌

ఆంధ్రజ్యోతి కథనాలతో ఈవోకు దేవదాయ శాఖ కమిషనర్‌ చెక్‌

కొత్తగా టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్‌


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఇంద్రకీలాద్రిపై అక్రమాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. నిబంధనలకు విరుద్ధంగా గత ఏడాది దుర్గగుడిపై పారిశుధ్య టెండర్లను, సెక్యూరిటీ కాంట్రాక్టును ఈవో సురేశ్‌బాబు తన బినామీ సంస్థ లకు కట్టబెట్టారు. దీనిపై ఆంధ్రజ్యోతి వరస కథనా లను ప్రచురించింది. వీటిని ఖండిస్తూ ఈవో ప్రకటనలు కూడా విడుదల చేశారు. కానీ ఎట్టకేలకు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈవో అడ్డగోలు దందాకు దేవదాయశాఖ కమిషనర్‌ చెక్‌ పెట్టారు. 

 

దుర్గగుడిలో ఈవో అడ్డగోలు దందాకు దేవదాయశాఖ కమిషనర్‌ చెక్‌ పెట్టారు. మంత్రి అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈవోకు ముకుతాడు వేశారు. పారిశుధ్య, సెక్యూరిటీ కాంట్రాక్టులను పాతవారికే పొడిగించాలంటూ ఈవో రాసిన లేఖను కమిషనర్‌ బుట్టదాఖలు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. దీంతో సోమవారం టెండరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 


ఇంద్రకీలాద్రిపై ఏడాది కాలంగా పారిశుధ్య నిర్వహణ, సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు సంస్థలనే మరో ఏడాది కొనసాగించేందుకు అనుమతించాలని కోరుతూ దుర్గగుడి ఈవో ఎం.వి.సురేశ్‌బాబు ఇటీవల దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. జులై 30న నిర్వహించిన దేవస్థానం పాలకమండలి సమావేశ ఎజెండాలో ఈ ప్రతిపాదన పెట్టారు. అమ్మవారి సొమ్ముకు కాపలాదారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన పాలకవర్గ సభ్యులు కూడా అక్రమ ప్రతిపాదనలను ఆమోదించడంతో ఈవో అక్రమాలకు పాలకవర్గం కూడా వత్తాసు పలుకుతోందన్న విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. పారిశుధ్య, సెక్యూరిటీ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ అవే సంస్థలకు కట్టబెట్టేందుకు దుర్గగుడి అధికారులు, పాలకమండలి కలిసి చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తూ ‘అడ్డ‘గోల్‌..’’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 12న ప్రచురితమైన కథనానికి స్పందించిన ఈవో తమ తప్పేమీ లేదంటూ అదే రోజు ఖండన విడుదల చేశారు.


అయితే ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా ఈవో రాసిన లేఖను దేవదాయశాఖ కమిషనర్‌ తిరస్కరించారు. తాజాగా టెండర్లను ఆహ్వానించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో దుర్గగుడిపై పారిశుధ్య, సెక్యూరిటీ కాంట్రాక్టులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు ఆహ్వానిస్తూ టెండరు ప్రకటన ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.  నవంబరు ఒకటో తేదీ నుంచి 2022, మార్చి 31వ తేదీ వరకు ఒక సంవత్సరం ఐదు నెలల కాలపరిమితితో కొండపై హౌస్‌ కీపింగ్‌, స్వీపింగ్‌ చేయడానికి, సెక్యూరిటీ గార్డులు, సూపర్‌వైజర్లను సరఫరా చేయడానికి, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మ్యాన్‌పవర్‌ను సరఫరా చేసే లైసెన్సులు పొందేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ దుర్గగుడి అధికారులు సోమవారం పత్రికల ద్వారా ‘ఈ-టెండరు’ ప్రకటన జారీ చేశారు. 


ఈవో బినామీ సంస్థకు బ్రేక్‌ 

దుర్గగుడిలో ఏడాది కాలంగా పారిశుధ్య నిర్వహణ చూస్తున్న కాంట్రాక్టు సంస్థ ఈవో బినామీ సంస్థని, గత ఏడాది దసరా ఉత్సవాల ముందు ఈ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండరు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. ఈ నెలాఖరుతో ఈ కాంట్రాక్టు గడువు ముగియనుంది. అయితే ఈవో మరో ఏడాది కూడా అదే సంస్థను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడం ద్వారా ఆ సంస్థతో తనకున్న సంబంధమేమిటో బయటపెట్టుకున్నట్లయింది. ఇదంతా పరిశీలించిన కమిషనర్‌ అర్జునరావు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశించడంతో ఈవో గొంతులో వెలక్కాయ పడినట్లయిందని దుర్గగుడి వర్గాలు చర్చించుకుంటున్నాయి.  



Updated Date - 2020-09-29T15:28:49+05:30 IST