ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

ABN , First Publish Date - 2022-05-21T04:55:58+05:30 IST

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోడ్లపై కూరగాయల

ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌
కొత్తగా నిర్మించిన 40 మడిగెల కాంప్లెక్స్‌

  • ఇబ్రహీంపట్నం చౌరస్తాలో కూరగాయల అమ్మకాలకు తొలగిన ఇబ్బందులు
  • 40 మండిగెలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ సిద్ధం.. త్వరలో ప్రారంభం


ఇబ్రహీంపట్నం, మే 20: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోడ్లపై కూరగాయల అమ్మకాలు జరపడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్రంగా ఇబ్బంది తలెత్తుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంచాల రోడ్డులో రూ.1.06 కోట్లతో కొత్తగా నిర్మించిన 40 మడిగెల కాంప్లెక్స్‌ను కూరగాయల వ్యాపారులకు కేటాయించనున్నారు. వచ్చే వారంలో దీనిని ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే వంద మంది వరకు కూరగాయల వ్యాపారులు రిజిస్టర్‌ చేసుకున్నందున లాటరీ పద్ధతిన మడిగెలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంపాటు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో కూరగాయల విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడేవారు. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టి కూరగాయల మార్కెట్‌ను అక్కడ నుంచి పాత పోలీస్‌ క్వార్టర్స్‌ స్థలానికి మార్చారు. తాత్కాలికంగా తడికెల కింద విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వ్యాపారాలు నడవడం లేదని కొందరు తిరిగి చౌరస్తా ఏరియాలో కూరగాయల విక్రయాలు మొదలు పెట్టారు. దీంతో చౌరస్తా ఇరుకుగా మారి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది. కొత్తగా నిర్మాణం చేసిన మార్కెట్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తే సమస్య కొంత మేరకు తీరనుంది. 


రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం

కాగా, కూరగాయల మార్కెట్‌ కాంప్లెక్స్‌ను అనుసరించే రూ.4.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ (వెజ్‌, నాన్‌వెజ్‌) మార్కెట్‌ నిర్మాణం చేస్తున్నారు. పనులు కూడా మొదలయ్యాయి. ఇది గనుక పూర్తయితే అన్ని సౌకర్యాలతో వెజ్‌, నాన్‌ వెజ్‌, పూలు, పండ్ల వ్యాపారాలు ఒకే దగ్గర జరగనున్నాయి. ఇది అమ్మకందారులతోపాటు  కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉంటుంది.  


క్లీన్‌సిటీగా మార్చాలనే..

అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లపై కూరగాయలు, పూలు, పండ్లు తదితర విక్రయాలు జరగకుండా క్లీన్‌సిటీగా మార్చాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా ఏర్పాటైన కాంప్లెక్స్‌లో 40 మంది వ్యాపారులకు మడిగెలు కేటాయించనున్నాం. 

- ఎండీ యూసుఫ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ 


Updated Date - 2022-05-21T04:55:58+05:30 IST