HYD మూసీపై చెక్ డ్యామ్‌లు.. KTR ఆదేశాలతో కసరత్తు!

ABN , First Publish Date - 2021-07-10T19:43:10+05:30 IST

మూసీ నదిపై చెక్‌ డ్యాంలు రానున్నాయా..?

HYD మూసీపై చెక్ డ్యామ్‌లు.. KTR ఆదేశాలతో కసరత్తు!

  • సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న అధికారులు
  • వంతెనలు ప్రతిపాదించిన చోట నిర్మాణానికి యోచన
  • కేటీఆర్‌ ఆదేశాలతో అధికారుల కసరత్తు
  • త్వరలో మంత్రితో మరో భేటీ

హైదరాబాద్‌ సిటీ : మూసీ నదిపై చెక్‌ డ్యాంలు రానున్నాయా..? స్వచ్ఛమైన నీటితో మూసీ కళకళలాడనుందా అంటే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఊహ నిజమయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత స్థాయి అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తూ మొదలైందని చెబుతున్నారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదించిన వంతెనలతో పాటు చెక్‌ డ్యాంలు నిర్మించవచ్చా పరిశీలించాలని తాజాగా మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రస్తుతానికి వంతెనల నిర్మాణం ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఎన్ని చోట్ల చెక్‌ డ్యాంల నిర్మాణానికి అవకాశం ఉంది, ఏ నమూనాలో నిర్మించాలి అన్నది హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌), ఇరిగేషన్‌ విభాగాలు సంయుక్తంగా పరిశీలించనున్నాయి. త్వరలో ఈ విషయంపై కేటీఆర్‌ వద్ద సమావేశం జరుగుతుందని ఉన్నతాధికారొకరు తెలిపారు.


14 వంతెనలు.. ఓ లింక్‌ రోడ్‌...

గండిపేట నుంచి గౌరెల్లి, హిమాయత్‌సాగర్‌ నుంచి బాపుఘాట్‌ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది ఉంది. దీనికి హద్దులు గుర్తించి బఫర్‌ జోన్‌ నిర్ధారణకు సర్వే నిర్వహించారు. మూసీపై ప్రస్తుతం ఉన్న 24 వంతెనలు, 10 కాజ్‌వేల ద్వారా నిత్యం 36 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 2031 సంవత్సరానికి ఈ సంఖ్య 60 లక్షలకు పెరుగుతుందని సమగ్ర రవాణా అధ్యయనం (సీటీఎ్‌స)లో అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మూసీ, ఈసా నదులపై అదనంగా మరో 14 వంతెనలు అవసరమని ప్రతిపాదించారు. మూసీకి దక్షిణ, ఉత్తర భాగాల నుంచి రాకపోకల నేపథ్యంలో మున్ముందు అవసరాల కోసం ఈ వంతెనలు అవసరమని పేర్కొన్నారు. వంతెనలతోపాటు ఒక లింక్‌ రోడ్డూ నిర్మించాలని ప్రతిపాదించారు. వీటికి రూ.392.70 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.


గేట్లతో చెక్‌ డ్యాంలు..

సీటీఎస్‌ నివేదిక ప్రకారం వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు కేటీఆర్‌ ఆదేశాలతో వంతెనలు ప్రతిపాదించిన ప్రాంతాల్లో చెక్‌డ్యాంల ఏర్పాటుకు అవకాశముందా అని పరిశీలించనున్నారు. చెక్‌ డ్యాంలు నిర్మించాల్సి వస్తే.. బ్రిడ్జి ఎంత ఎత్తులో ఉండాలి, ఎగువ నుంచి వచ్చే వరద నీరు వెళ్లేందుకు వీలుగా గేట్లు ఏర్పాటు చేయాలా, అక్కడ నదిలో వాలును బట్టి గేట్లు ఎంత ఎత్తున ఉండాలి అన్నది నీటి పారుదల శాఖ నిర్ణయించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. వంతెనలు ప్రతిపాదించిన 14 చోట్లా చెక్‌ డ్యాంల ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని, ఎక్కడ అవకాశం ఉందన్నది తేలాలని చెప్పారు. 


నగరంలో ప్రస్తుతం వెలువడుతోన్న మురుగులో 700 మిలియన్‌ లీటర్లు మాత్రమే ఎస్‌టీపీల ద్వారా శుద్ధి అవుతోంది. మరో 800 ఎంఎల్‌డీ వరకు నేరుగా మూసీలో చేరుతోంది. మున్ముందు శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం మూసీకి ఇరువైపులా ఎస్‌టీపీలు నిర్మించే ఆలోచన ప్రభుత్వ విభాగాలకు ఉంది. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన నీరు మూసీలోకి రావడం మొదలైన అనంతరం.. అవసరాన్ని బట్టి గండిపేట నీటిని నదిలోకి వదలాలనే ఆలోచన కూడా ఉంది. సీజన్‌తో సంబంధం లేకుండా 365 రోజులూ మూసీ స్వచ్ఛమైన నీటితో కనిపించాలని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే క్రమంలో బోటింగ్‌ కూడా అందుబాటులోకి తీసుకురావాలని గతంలో కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గండిపేట నుంచి నీటిని విడుదల చేసిన పక్షంలో దిగువకు ప్రవాహం సాఫీగా సాగేలా.. చెక్‌ డ్యాంల వద్ద గేట్లు ఉండాల్సిందే అని నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ అధికారొకరు చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని మరో అధికారి చెప్పారు.


ఆ వంతెన రద్దు చేసి...

మూసీ నదిపై సాలార్‌జంగ్‌ మ్యూజియం వద్ద ఐకానిక్‌ వంతెన నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. రెండు వరుసల్లో నిర్మించే వంతెనలో ఒక లెవల్‌లో వాహనాలు, మరో లెవల్‌లో పాదచారులు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని భావించారు. రూ.200 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఖర్చు ఎక్కువ కావడంతో ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నారు. కేవలం పాదచారులు, వీధి వ్యాపారుల పునరావాసం కోసం ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకు రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశారు. ముసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌, ఇబ్రహీంబాగ్‌, నార్సింగి, చింతల్‌మెంట్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అయితే కేటీఆర్‌ సూచనతో తాత్కాలికంగా వంతెనల నిర్మాణాన్ని పక్కన పెట్టి, చెక్‌ డ్యాంల నిర్మాణ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. 



Updated Date - 2021-07-10T19:43:10+05:30 IST