వ్యాక్సిన్‌ కోసం బారులు

ABN , First Publish Date - 2021-05-06T05:33:10+05:30 IST

ఐదు రోజుల తర్వాత కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోస్‌లు రావడంతో జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది.

వ్యాక్సిన్‌ కోసం బారులు
గుంటూరు శ్రీనివాసరావుపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద కరోన వ్యాక్సిన్‌ కోసం బారులుదీరిన ప్రజలు

కొవిడ్‌-19 నిబంధనలు గాలికి...

గుంటూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): ఐదు రోజుల తర్వాత కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోస్‌లు రావడంతో జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. వ్యాక్సిన్‌లు వచ్చాయన్న సమాచారం అందుకున్న ప్రజలు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకొన్నారు. వారు ఏమాత్రం కొవిడ్‌-19 నిబంధనలు పాటించకుండా ఎండలోనే క్యూలైన్‌లో నిలుచుని తమ వంతు కోసం వేచి చూశారు. కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల సిఫార్సులతో వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు ఇలా వచ్చి అలా వ్యాక్సిన్‌ వేయించుకొని వెళ్లారు. దాంతో ఎండలో క్యూలైన్‌లో నిలబడిన వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒకదశలో వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరావుపేట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద కనీస సామాజికదూరం పాటించకుండా ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఎగబడ్డారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,689 మందికి బుధవారం వ్యాక్సిన్‌ అందింది. ఇందులో హెల్త్‌కేర్‌ వర్కర్స్‌-242, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌-2,467, 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 4,980 మంది ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. ప్రజల ఇబ్బందులు దృష్ట్యా నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ పలు కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేయించారు. 

రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో..

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యా భవన్‌ పాఠశాలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌క్రాస్‌ జిల్లా చైౖర్మన్‌ పి.రామచంద్రరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొని వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కోశాధికారి రవి శ్రీనివాస్‌, రెడ్‌క్రాస్‌ వలంటీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:33:10+05:30 IST