అక్రమాల.. అగాథాలు

ABN , First Publish Date - 2021-03-05T05:44:05+05:30 IST

మైనింగ్‌ మాఫియా దాటికి మండల పరిధిలోని గ్రామాలు విలవిల లాడిపోతున్నాయి.

అక్రమాల.. అగాథాలు
శేకూరులో క్వారీ తవ్వకాలు సాగిస్తున్న యంత్రాలు

 చేబ్రోలులో మైనింగ్‌ మాఫియా

ఎర్ర మట్టి తరలింపుతో రూ.కోట్లు 

అధికారుల తనిఖీలు.. వెలుగుచూసిన అక్రమాలు


ఎర్రమట్టితో రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఎర్రమట్టికి డిమాండ్‌.. అధికారం అండతో గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. పర్యావరణ, వాల్టా చట్టాలు పట్టించుకునే వారే లేకుండాపోయారు. నిబంధనలు.. అనుమతులు అవసరం లేకుండానే భూములను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేస్తున్నారు. ఈ తవ్వకాలతో చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల్లోని మైదాన భూములు అగాధాలను తలపిస్తున్నాయి. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు తవ్వకాలు సాగిస్తున్నారు. విలువైన ఎర్ర మట్టిని చేజిక్కించుకునేందుకు పట్టా భూములతోపాటు డీ పట్టా భూములు రాత్రికి రాత్రి చేతులు మారిపోతున్నాయి. అంతేగాక రైల్వే స్థలాలపైనే కన్నేశారు. కాసుల వేటలో ఉన్న క్వారీల నిర్వాహకులు పర్యవరణం, ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. అధికారులు అడపాదడపా తనిఖీలు చేపట్టి అక్రమాలు గుర్తించి నివేదికలు రూపొందించినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎర్ర మాఫియాకు అడ్డేలేకుండా పోతోంది.  

 

అడ్డుకున్నా ప్రారంభం

మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల రైల్వే పనుల కోసం ప్రారంభించిన క్వారీకి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి ఈ క్వారీని మూయించాలని ప్రయత్నించారు. అయినా ఆ క్వారీ తిరిగి ప్రారంభమైంది. దీంతో మాఫియా శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయోనని ఆ గ్రామస్థులు అంటున్నారు.

 

ఎర్రమట్టి, గ్రావెల్‌ మాయం

చేబ్రోలులో పాత రైల్వే లైన్‌ నిర్మాణ సమయంలో రైల్వే శాఖ దశాబ్దాల క్రితమే ఎర్ర మట్టిని, గ్రావెల్‌ను వినియోగించింది.  దీనిపై మాఫియా కన్ను పడింది. దీంతో రాత్రికి రాత్రే రైల్వే లైన్‌ కోసం వినియోగించిన ఎర్ర మట్టిని గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. వీరిపై రైల్వే అధికారులు కేసులు నమోదు చేసినా అక్రమార్కులు లెక్క చేయడంలేదు. మట్టి తరలిపోవడంతో ప్రస్తుతం పాత రైల్వే లైన్‌ ఆనవాళ్లు కూడా లేవు.


చేబ్రోలు, మార్చి 4: మైనింగ్‌ మాఫియా దాటికి మండల పరిధిలోని గ్రామాలు విలవిల లాడిపోతున్నాయి. మండలంలోని శేకూరు, వీరనాయకునిపాలెం, సుద్ధపల్లి, వేజండ్ల, వడ్లమూడి ప్రాంతాలు ఎర్రమట్టి నిలయాలు. ఈ ప్రాంతంలో విలువైన ఎర్రమట్టి, రాళ్లతో కూడిన నాణ్యమైన గ్రావెల్‌  పొరలు ఉన్నాయి. ప్రారంభంలో వడ్లమూడి క్వారీ దేవాలయ సమీపంలోనే  జిల్లా పరిషత్‌కు చెందిన 30 ఎకరాల భూమిలో మాత్రమే ఎర్ర మట్టి తవ్వకాలు జరిగేవి. ఎర్రమట్టి కాసులు కురిస్తుండటంతో క్రమేపి మట్టి తవ్వకాలు మండలం అంతా వ్యాపించాయి. ప్రస్తుతం ఈ ఎర్రమట్టి తవ్వకాలపై అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో క్వారీలు ప్రారంభమయ్యాయి. నిబంధనలు గాలికి వదిలి మట్టి మాఫియా కాసులు దండుకునే పనిలో పడింది. క్వారీ అక్రమార్కులకు అధికారం దన్నుగా మారింది. ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి పంచాయతీలకు పాలకులు ఎన్నికైయ్యారు. ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు చేసిన వారి కన్ను క్వారీలపై పడింది. వీటిని ఆదాయ వనరుగా చేసుకునేందుకు వారు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాలో ఉన్న క్వారీల నిర్వాహకులతో తాజా పాలకులు సమావేశమై ఎర్ర మట్టి రవాణా, తవ్వకాలు సాగించాలంటే తమ సంగతి చూడాలని ఇండెంట్లు పెడుతున్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా తమ ఖర్చులను చూసుకోవాలని క్వారీల నిర్వాహకులకు సూచిస్తున్నట్లు సమాచారం. గ్రావెల్‌ అంటేనే గుర్తు వచ్చే గ్రామానికి ఎన్నికైన సర్పంచ్‌ భర్త  ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి క్వారీయింగ్‌కు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాత్రిళ్లు ట్రాక్టర్లు, లారీల్లో గ్రావెల్‌ను గుట్టుచప్పుడు కాకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


రాత్రింబవళ్లు తవ్వకాలు

ఓ మంత్రి అండతో ఉన్న క్వారీలో రాత్రింబవళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు సాగించి నిత్యం 200 లారీల గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఈ క్వారీకి సమీపంలోనే త్వకాలపై నిషేధం ఉన్న గ్రామంలో గుంటూరుకు చెందిన ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి సమీప బంధువు ఆధ్వర్యంలో మరో క్వారీ ఇటీవలే ప్రారంభమైంది. నియోజకవర్గ స్థాయి నేతలకు తామేమీ తీసిపోమన్నట్లుగా చోటా మోటా నాయకులు సైతం పలు గ్రామాలో మట్టి తవ్వకాలు సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న, చిన్న రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 


ఆందోళనలతో అధికారుల్లో స్పందన

ఇటీవల శేకూరులో మట్టి మాఫియా ఆగడాలకు విసిగిన విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళనలకు దిగారు. గ్రామంలోకి ఎర్ర మట్టి లారీలు అనుమంతించవద్దని రోడ్డెక్కడంతో మాఫియా ఆగడాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో మీడియాలో వచ్చిన కథనాలతో స్పందించిన మైనింగ్‌ అధికారులు మట్టి తవ్వకాలపై దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించి సాగుతున్న తవ్వకాలు, క్వారీలపై విచారణ జరిపారు. 20 అడుగుల లోతులో గ్రావెల్‌ తవ్వి తరలించినట్లు అధికారులు నివేదిక రూపొందించారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న గ్రావెల్‌ లారీలపై రావాణా శాఖ అఽధికారులు ఆరా తీస్తున్నారు. గ్రావెల్‌ మాఫియాపై ప్రభుత్వం కూడా వివిధ శాఖల నుంచి రహస్య నివేదిక కోరిన్నట్లు సమాచారం. అయినా ఎవరెన్ని విచారణలు జరిపినా తమకు ఏమీ కాదనే ధోరణిలో ఎర్ర మాఫియా తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.   

Updated Date - 2021-03-05T05:44:05+05:30 IST